టన్నెల్‌లో రోబోలతో రెస్క్యూ షురూ | Rescue begins with robots in tunnel | Sakshi
Sakshi News home page

టన్నెల్‌లో రోబోలతో రెస్క్యూ షురూ

Mar 13 2025 4:30 AM | Updated on Mar 13 2025 4:30 AM

Rescue begins with robots in tunnel

గంటకు వెయ్యి క్యూబిక్‌ మీటర్ల మట్టి, బురద తొలగింపునకు అవకాశం

సాక్షి, నాగర్‌కర్నూల్‌: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో ప్రమాద స్థలం వద్ద మట్టి, శిథిలాలు, బురద తొలగింపునకు రోబోలతో రెస్క్యూ ఆపరేషన్‌ ప్రారంభమైంది. బుధవారం ఉదయం అన్వి రోబోటిక్స్‌కు చెందిన నిపుణులు ఆటోమేటెడ్‌ స్లడ్జ్‌ రిమూవల్‌ రో బోను సొరంగం లోపలకు తీసుకెళ్లారు. రాళ్లను క్రష్‌ చేసి తొలగించేందుకు ఒక రోబో, మట్టిని తొలగించేందుకు మరో రోబో, బురదను తొలగించేందుకు ఒకటి చొప్పున మూడు రకాల రోబోల ద్వారా రెస్క్యూ ఆపరేషన్‌ చేపడుతున్నారు. 

ఆటో మేటెడ్‌ స్లడ్జ్‌ రిమూవల్‌ రోబోæ సొరంగంలో పను లు మొదలుపెట్టింది. పూర్తిగా ఉక్కుతో తయారైన ఈ రోబోట్‌ హైడ్రాలిక్‌ వ్యవస్థతో పనిచేస్తుంది. ఈ రోబోకు ముందుభాగంలో ఉన్న గ్రైండర్‌ సహాయంతో పెద్ద రాళ్లు, శిథిలాలను కట్‌ చేస్తూ ము క్కలుగా చేయడంతోపాటు బురదను వ్యాక్యూమ్‌ సక్కర్‌ ద్వారా తొలగించి నేరుగా కన్వేయర్‌ బెల్టుపై వేస్తుంది. గంటకు వెయ్యి క్యూబిక్‌ మీటర్ల మట్టి, బురదను తొలగిస్తుందని చెబుతున్నారు.

ప్రమాద స్థలంలో ఏఐ ఆధారిత రోబో సాయంతో తవ్వకాలు, మట్టి తొలగింపు చేపడుతుండగా, 100 మీటర్ల దూరం నుంచి రిమోట్‌ ఆపరేటింగ్‌ ద్వారా రోబోలను పర్యవేక్షించనున్నారు. సొరంగం ఇన్‌లెట్‌ వద్ద ఉండే మాస్టర్‌ రోబో మిగతా రోబోలతో కమ్యూనికేట్‌ చేస్తుంది. ఆల్‌ఇండియా రోబోటిక్‌ అసోసియేషన్‌ ఈ ఆపరేషన్‌కు సహకారం అందిస్తోంది. 

చివరి 20 మీటర్ల వద్ద తవ్వకాలు  
సొరంగంలో ప్రమాదం చోటుచేసుకున్న 13.85 కి.మీ. పాయింట్‌ వద్ద చివరి 20 మీటర్ల స్థలంలో సొరంగం పైకప్పు వదులుగా ఉండటంతో మళ్లీ కూలే అవకాశాలు ఉన్నాయని, అక్కడ పనిచేసే రెస్క్యూ బృందాలకు సైతం ప్రమాదకరమని జియోలాజికల్‌ సర్వే అధికారులు స్పష్టం చేశారు. దీంతో ఎలాంటి ప్రాణనష్టం లేకుండా చివరి 20 మీటర్ల ప్రదేశంలో రోబోల ద్వారా రెస్క్యూ చేపడుతున్నారు. 

ప్రమాదస్థలంలో కడావర్‌ డాగ్స్‌ గుర్తించిన డీ2, డీ1 పాయింట్ల మధ్య ట్రెంచ్‌ తవ్వకాలు జరుగుతున్నాయి. అక్కడే టీబీఎం మధ్య భాగంలో ఖాళీ ప్రదేశం ఉంటుంది. ఆ స్థలంలోనే మిగతా కార్మికులు ఉంటారని భావిస్తున్నారు. ఆ ప్రాంతమంతా పూర్తిగా మట్టి, శిథిలాలతో కూరుకుపోయి ఉంది. మట్టి, బురద, శిథిలాలను తొలగిస్తేనే కార్మికుల జాడ తెలిసే అవకాశముంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement