విజిలెన్స్‌ పట్టించినా.. ఆర్టీసీ వదిలేసింది | Removing Cases By Taking Money From Suspended RTC Employees | Sakshi
Sakshi News home page

విజిలెన్స్‌ పట్టించినా.. ఆర్టీసీ వదిలేసింది

Mar 8 2021 3:21 AM | Updated on Mar 8 2021 8:09 AM

Removing Cases By Taking Money From Suspended RTC Employees - Sakshi

 సాక్షి, హైదరాబాద్‌: టికెట్‌ డబ్బుల లెక్కల్లో తేడాలతో కండక్టర్లు, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌తో డ్రైవర్లు సస్పెండయ్యారు. వారు అప్పీళ్లకు వెళ్తే కేసులవారీగా పరీక్షించి తిరిగి విధుల్లోకి తీసుకున్నారు. అంతా బాగానే ఉంది. కానీ వారి దగ్గర పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుని కేసులు మాఫీ చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విజిలెన్స్‌ అధికారులు రంగంలోకి దిగి, విచారణ జరిపి ఆర్టీసీకి నివేదిక ఇచ్చారు. దాదాపు 70 మందికి సంబంధించి విచారణ జరిపితే.. 39 మందిదాకా తమ దగ్గర ఉన్నతాధికారి లంచం తీసుకున్నట్టుగా స్పష్టమైన సమాచారం ఇచ్చినట్టు తెలిసింది. ఈ నివేదిక ఆర్టీసీకి అందింది. అయినా బాధ్యులైన వారిపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు.

ఇక ఓ డిపోలో కొందరు తాత్కాలిక సిబ్బంది పనిచేశారు. వారు విధుల్లో ఉండగానే.. కనీస వేతనాల మొత్తం పెరిగింది. ఈ మేరకు సొమ్ము విడిగా మంజూరైంది. కానీ ఈ సొమ్మును తాత్కాలిక కార్మికులకు చెల్లించకుండా పెండింగ్‌లో పెట్టారు. తర్వాత చెల్లించేసినట్టు లెక్కలు చూపారు. దీనిపై ఆరోపణలు రావటంతో విజిలెన్సు విచారణ జరిగింది. పెరిగిన మేర సొమ్ము తమకు అందలేదని కార్మికులు చెప్పినట్టు సమాచారం. ఈ నివేదిక కూడా ఉన్నతాధికారులకు చేరినా.. ఎవరిపైనా చర్యలు తీసుకోలేదు. ఈ వ్యవహారంపై ఆర్టీసీ సిబ్బంది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలాగే కొనసాగితే అధికారులు మరింతగా వసూళ్లకు పాల్పడతారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఏం జరిగింది?
ఆర్టీసీలో డ్రైవర్లు, కండక్టర్లే కీలకం. అయినా వారి విధుల్లో ఏమాత్రం నిర్లక్ష్యం కనిపించినా సస్పెన్షన్‌ వేటు వేస్తుంటారు. ఇలా ఏటా వంద మంది వరకు సస్పెండ్‌ అవుతున్నారు. చిన చిన్న కారణాలతోనే సస్పెండ్‌ చేస్తున్నారని, తమకు ఉద్యోగ భద్రత లేకుండా పోయిందని డ్రైవర్లు, కండక్టర్లు ఆందోళన వ్యక్తం చేయడంతో సీఎం కేసీఆర్‌ స్పందించి నిబంధనల్లో మార్పునకు ఆదేశించారు. ఈ మేరకు కొత్త నియమావళి ఇటీవలే విడుదలైంది. అయితే ఈ కొత్త నియమావళి కూడా సరిగా లేదంటూ ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు. డిపోల ముందు నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా సస్పెన్షన్‌ వేటు పడుతుండటమే దీనికి కారణం. అయితే చిన్న ఉద్యోగుల విషయంలో కఠినంగా ఉంటున్న యాజమాన్యం.. అధికారుల విషయంలో మాత్రం చూసీచూడనట్టు ఉంటోందన్న చర్చ ఆర్టీసీలో వినిపిస్తోంది. సస్పెండైన కండక్టర్లు, డ్రైవర్లను తిరిగి విధుల్లోకి తీసుకునే విషయంలో భారీగా వసూళ్లకు పాల్పడ్డట్టు తేలినా సదరు అధికారులను ఎందుకు వదిలేస్తున్నారని కార్మికులు మండిపడుతున్నారు. ఇతర అధికారులు దీనిని అలుసుగా తీసుకుని వసూళ్ల పర్వం ప్రారంభిస్తారని వాపోతున్నారు.

అంతర్గత విచారణ ఏదీ?
కొందరు అధికారులు అక్రమాలకు పాల్పడ్డట్టు విజిలెన్సు నివేదిక జనవరి చివరి వారంలోనే అందినా ఆర్టీసీ యాజమాన్యం స్పందించడం లేదని కార్మికులు మండిపడుతున్నారు. సాధారణంగా విజిలెన్సు నివేదికలు అందిన తర్వాత ఆర్టీసీ అధికారులు అంతర్గత విచారణ జరిపి చర్యలు తీసుకుంటారు. ఇటీవల వరంగల్‌లో ఓ డిపో మేనేజర్‌ను ఇలాగే సస్పెండ్‌ చేశారు. కానీ మరో రెండు కేసుల విషయంలో అంతర్గత విచారణ కూడా చేపట్టలేదు. ఇది ఆర్టీసీలో కార్మిక సంఘాలు తిరిగి బలోపేతం అవ్వాలన్న డిమాండ్‌కు తెరలేపుతోంది. చిన్న ఉద్యోగుల విషయంలో ఓ రకంగా, అధికారుల విషయంలో మరో రకంగా వ్యవహరిస్తున్నందున.. మళ్లీ కార్మిక సంఘాలకు అవకాశం కల్పించి ఎన్నికలు నిర్వహించాలన్న డిమాండ్‌ మొదలవుతోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement