33 రోజుల్లో.. 1000 మొబైల్‌ ఫోన్లు

Recovery Of 1000 Mobile Phones In 33 Days By CEIR At Telangana - Sakshi

యజమానులకు తిరిగి అందజేసిన పోలీసులు 

సీఈఐఆర్‌ పోర్టల్‌తో చోరీ మొబైళ్ల గుర్తింపు

రాష్ట్రవ్యాప్తంగా సీఈఐఆర్‌ అమలు

సాక్షి, హైదరాబాద్ః చోరీకి గురైన, పోగొట్టుకున్న మొబైల్‌ ఫోన్ల జాడ కనిపెట్టేందుకు అమల్లోకి తెచ్చిన సీఈఐఆర్‌ (సెంట్రల్‌ ఎక్విప్మెంట్‌ ఐడెంటిటీ రిజిస్టార్‌) పోర్టల్‌ విధానం సత్ఫలితాలిస్తోంది. గత నెల ఏప్రిల్‌ 13వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా 780 పోలీస్‌ స్టేషన్ల పరిధిలో ఈ నూతన పోర్టల్‌ విధానాన్ని డీజీపీ అంజనీకు­మార్‌ ప్రారంభించారు. 60 మంది ట్రైనర్లకు తొలుత ఈ పోర్టల్‌ వాడకంపై శిక్షణ ఇచ్చారు. ఆ తర్వాత  పూర్తిస్థాయిలో ఏప్రిల్‌ 20 నుంచి ఈ సీఈఐఆర్‌ రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీస్‌ స్టేషన్లలో అమల్లోకి తెచ్చారు. 

అప్పటి నుంచి ఈ పోర్టల్‌ విధానంతో సోమవారం వరకు అంటే 33 రోజుల్లో వెయ్యి మొబైల్‌ ఫోన్ల జాడను గుర్తించడంతోపాటు వాటిని తిరిగి ఫోన్ల యజమా­నులకు అందించారు. వీటిలో అత్యధికంగా సైబరాబాద్‌ కమిషనరేట్‌లో 149, వరంగల్‌ కమిషనరేట్‌ పరిధిలో 91, కామారెడ్డి జిల్లా పరిధిలో 79 మొబైల్‌ ఫోన్ల జాడ కనిపెట్టినట్టు సీఈఐఆర్‌ నోడల్‌ అధికారి, సీఐడీ అడిషనల్‌ డీజీ మహేశ్‌ భగవత్‌ తెలిపారు. బాధితుల నుంచి అందిన ఫిర్యాదుల మేరకు మొత్తం 16,011 మొబైల్‌ ఫోన్లను సీఈఐఆర్‌ విధానంలో బ్లాక్‌ చేసినట్టు చెప్పారు. రాష్ట్ర పౌరులెవరైనా తమ మొబైల్‌ ఫోన్లు పోగొట్టుకున్నట్టయితే దగ్గరలోని మీసేవా లేదా పోలీస్‌ స్టేషన్‌కి వెళ్లి సీఈఐఆర్‌ విధానంలో ఫిర్యాదు చేయవచ్చని మహేశ్‌ భగవత్‌ సూచించారు. 

ఇది కూడా చదవండి: GO 111: మాస్టర్‌ప్లాన్‌ ఇప్పట్లో లేనట్టే!

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top