
‘బడిబాట’లో ఉపాధ్యాయులకు తల్లిదండ్రుల నుంచి ఎదురవుతున్న ప్రశ్నలు
సర్కారు పాఠశాలల ప్రత్యేకతలేమిటో వారికి చెప్పలేకపోతున్నామంటున్న టీచర్లు
ఫలితంగా ‘బడిబాట’తో ఆశించిన స్థాయిలో లభించని ప్రయోజనం
గత పదేళ్లలో ఏకంగా 32 శాతం తగ్గిన విద్యార్థుల ప్రవేశాలు
ప్రైవేటుకు దీటుగా డిజిటల్ విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలి
రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలో పాఠశాల విద్యాశాఖ
సాక్షి, హైదరాబాద్: ‘ప్రభుత్వ పాఠశాలల్లో మా పిల్లల్ని ఎందుకు చేర్చాలి?’ ఇదీ బడిబాట కార్యక్రమంలో భాగంగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్న ఉపాధ్యాయులకు తల్లిదండ్రుల నుంచి ఎదురవుతున్న ప్రశ్న. ఇదే విషయాన్ని పాఠశాల విద్యాశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించింది. విద్యార్థుల చేరికలు, అందులో ఎదురవుతున్న ఇబ్బందులు, క్షేత్రస్థాయిలో జరగాల్సిన కృషిని తెలియజేస్తూ సవివర నివేదిక సమర్పించింది.
స్పందన ఏదీ?
బడిబాటను ఈసారి పెద్ద ఎత్తున చేపట్టాలని ప్రభుత్వం భావించినా క్షేత్రస్థాయిలో ఆశించిన ప్రయోజనాలు కనిపించలేదని విద్యాశాఖ వర్గాలు అంగీకరిస్తున్నాయి. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల వద్దకు టీచర్లు వెళ్లినప్పుడు పెద్దగా స్పందన రావడం లేదని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేకతలు ఏమిటనేవి ప్రజలకు చెప్పలేకపోతున్నామని టీచర్లు అంటున్నారు. అలాంటప్పుడు వారిని ఆకర్షించడం సాధ్యం కావడం లేదని పేర్కొంటున్నారు.
ఏఐ జోరు పెంచితేనే..
ప్రైవేటు విద్యాసంస్థల్లో డిజిటల్ విద్యా బోధన చేస్తుండగా ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఈ తరహా ప్రాధాన్యత పెంచాలని విద్యాశాఖ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో పేర్కొంది. ముఖ్యంగా కృత్రిమ మేధ (ఏఐ) బోధన అందించేందుకు అనేక ప్రైవేటు కంపెనీలు ముందుకొస్తున్నాయి. వాటిని ఉపయోగించుకునే అవకాశాలున్నాయి. అయితే ఏఐ యాప్‌లను వాడుకోవడానికి స్కూళ్లలో అనేక మార్పులు తేవాలని అధికారులు అంటున్నారు. ఇంటర్నెట్ స్పీడ్ పెంచడం, కంప్యూటర్లను అప్‌గ్రేడ్ చేయడం, డిజిటల్ లేబొరేటరీల ఏర్పాటు, అవసరమైన యాప్‌లను డౌన్‌లోడ్ చేసే, సాంకేతిక సహకారం అందించే నిపుణుల నియామకం బడుల్లో అవసరమని పాఠశాల విద్యాశాఖ అభిప్రాయపడింది.
తగ్గుతున్న ప్రవేశాలు
ప్రభుత్వ పాఠశాలల్లో గత పదేళ్లలో విద్యార్థుల ప్రవేశాలు 32 శాతం మేర తగ్గాయి. 2014–15లో 24.85 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ బడుల్లో చేరగా 2024–25లో ఈ సంఖ్య 16.68 లక్షలకు తగ్గింది. మరోవైపు ఇదే కాలానికి ప్రైవేటు స్కూళ్లలో ప్రవేశాలు పెరిగాయి. 2014–15లో 31.17 లక్షల మంది విద్యార్థులు ప్రైవేటు స్కూళ్లలో ఉంటే 2024–25లో ఆ సంఖ్య 36.73 లక్షలకు పెరిగింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పడిపోవడం కూడా దీనికి కారణంగా భావిస్తున్నారు.
విద్యార్హతలున్న టీచర్లు ప్రభుత్వ స్కూళ్లలోనే ఉన్నా, పాఠశాలల నిర్వహణ, ఉపాధ్యాయులు యాంత్రికంగా పనిచేస్తున్నారన్న విమర్శలు ప్రైవేటు వైపు ఆకర్షణకు కారణమవుతున్నాయి. విశ్వాసం పెంచితే తప్ప విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్ల బాట పట్టరని ప్రభుత్వం భావిస్తోంది. అయితే బడిబాటపై చాలామంది టీచర్లు పెద్దగా ఆసక్తి చూపడం లేదని.. తూమంత్రంగానే పాల్గొంటున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
త్వరలో కమిటీ ఏర్పాటు
ఈ నివేదిక ఆధారంగానే ప్రభుత్వం కొన్ని కొత్త ప్రతిపాదనలను విద్యాశాఖ ముందుకు తెచ్చింది. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో నమ్మకం, విశ్వాసం కల్పించేలా స్కూళ్లను తీర్చిదిద్దాలని ఆదేశించింది. ఆట స్థలాలు, మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించింది. అయితే నిధుల కొరత నేపథ్యంలో కార్పొరేట్ సంస్థల సామాజిక బాధ్యత కింద వాటిని సమకూర్చుకోవాలని సూచించింది. అయితే దీనికి క్షేత్రస్థాయి ప్రజాప్రతినిధుల తోడ్పాటు ఉంటేనే సాధ్యమవుతుందని విద్యాశాఖ అధికారులు అంటున్నారు. దాతలు, పారిశ్రామికవేత్తల ద్వారా నిధుల సమీకరణపై ప్రభుత్వం ఏ తరహా అడుగులు వేయాలనే విషయమై విద్యాశాఖ అధికారులతో త్వరలో ఓ కమిటీ ఏర్పాటు చేసే వీలుందని అధికార వర్గాలు తెలిపాయి.