
రోల్డ్‌గోల్డ్‌ను అసలు బంగారంగా భావించిన నిందితులు
లాకర్ తాళాలు ఇవ్వకపోవడంతో రేణు అగర్వాల్ హత్య
పథకం ప్రకారమే హతురాలి ఇంట్లో పనికి చేరిన హర్ష్
డ్రగ్స్‌కు బానిసగా మారి సోషల్ మీడియాలో రీల్స్
పోలీసులు అరెస్టు చేసే సమయంలోనూ మత్తులోనే
ఇతనితో పాటు మరో ఇద్దరు నిందితుల అరెస్టు
వీడిన కూకట్‌పల్లి మహిళ హత్య కేసు మిస్టరీ
వివరాలు వెల్లడించిన సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి
సాక్షి, హైదరాబాద్: నగరంలో సంచలనం సృష్టించిన కూకట్‌పల్లి మహిళ హత్య కేసును సైబరాబాద్ పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. హతురాలు రేణు అగర్వాల్ ఇంట్లో ఉన్న రోల్డ్ గోల్డ్ వస్తువులను నిజమైన బంగారమని భావించిన నిందితులు.. వాటిని దాచిన లాకర్ కీ ఆమె ఇవ్వకపోవడంతో హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. ఇద్దరు నిందితులు హర్ష్, రోషన్‌లతో పాటు ఝార్ఖండ్‌లో వీరికి ఆశ్రయం కల్పించన రాజ్ వర్మను కూడా పోలీసులు అరెస్టు చేశారు. శనివారం సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి మీడియాకు వివరాలు వెల్లడించారు.
స్నేహితుడితో కలిసి..
కూకట్‌పల్లిలోని స్వాన్‌లేక్ గేటెడ్ కమ్యూనిటీలోని అపార్ట్‌మెంట్‌లో ఉండే రాకే‹Ù, రేణు అగర్వాల్ దంపతుల ఇంట్లో ఝార్ఖండ్‌కు చెందిన రాజ్ వర్మ పని చేసేవాడు. ప్రతిరోజూ ఇంట్లో కబోర్డులు శుభ్రం చేస్తుండగా నకిలీ బంగారు ఆభరణాలను చూసి, అవి నిజమైనవిగా భావించాడు. తాను పనిచేసే ఇంట్లో భారీగా బంగారం, నగదు ఉన్నాయని స్నేహితుడు హర్ష్‌కు చెప్పాడు. వాటిని ఎలాగైనా దొంగిలించాలని భావించిన హర్ష్ పథకం వేశాడు. రేణు హత్యకు రెండు రోజుల ముందే రాజ్‌తో పని మాని్పంచి, ఆ స్థానంలో తాను పనిలో చేరాడు. అదే అపార్ట్‌మెంట్‌లో 14వ అంతస్తులో ఉంటున్న రాకేష్ సోదరుడి ఇంట్లో ఝార్ఖండ్‌కు చెందిన రోషన్ పని చేసేవాడు. హర్ష్, రోషన్‌లు ఇద్దరూ స్నేహితులే.
కాళ్లు, చేతులు కట్టేసి.. 40 కత్తిపోట్లు
ఈ నెల 10న రాకేష్, అతని కుమారుడు వ్యాపారం నిమిత్తం బయటికి వెళ్లిపోయారు. రేణు అగర్వాల్ ఒంటరిగా ఉండటంతో హర్ష్, రోషన్‌లు ఇంట్లోకి చొరబడ్డారు. రేణు నోటిలో దుస్తులు కుక్కి కాళ్లు చేతులు కట్టేశారు. లాకర్ తాళాలు ఎక్కడున్నాయో చెప్పాలని, డబ్బులు, బంగారం ఎక్కడెక్కడ దాచిపెట్టారో చెప్పాలంటూ చిత్రహింసలకు గురి చేశారు. సుమారు గంటకు పైగా ఆమెను చిత్రహింసలకు గురిచేసినా చెప్పకపోవడంతో.. ఆగ్రహానికి గురైన నిందితులు వంటింట్లోని కుక్కర్‌తో ఆమె తలపై బలంగా మోదారు. ఆపై కత్తితో గొంతుకోసి.. నుదురు, చేతులు, కడుపు, మెడపై 40సార్లు పొడిచి చంపేశారు. అనంతరం ఇంట్లో ఉన్న బంగారం ఆభరణాలు, నగదు, రోల్డ్ గోల్డ్ వస్తువులు, గడియారాలను ట్రావెల్ బ్యాగ్‌లో సర్దుకున్నారు. ఈ ఇంట్లోనే స్నానం చేసి, ట్రావెల్ బ్యాగ్‌తో యజమాని స్కూటీపై పరారయ్యారు.
పోలీసులను చూసి.. ప్లాన్ మార్చి..
ఈ ముఠా నిత్యం రైళ్లలోనే ప్రయాణాలు సాగిస్తుంటుంది. హత్య చేసిన తర్వాత కూడా రైల్వే స్టేషన్‌కు వెళ్లేందుకు పయనమయ్యారు. వీరికి హఫీజ్‌పేట రైల్వే స్టేషన్ ఎక్కడుందో తెలియదు. దీంతో మార్గంమధ్యలో ఇద్దరు ముగ్గురిని అడిగి స్టేషన్‌కు దారి తెలుసుకున్నారు. స్టేషన్ బయటే స్కూటీని వదిలేసి.. లోపలికి వెళ్లి రైలు ఎక్కి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వెళ్లిపోయారు. రాంచీ వెళ్లేందుకు టికెట్లు తీసుకొని రైలు ఎక్కేందుకు స్టేషన్ లోపలికి వెళ్లిపోయారు. అప్పటికే స్టేషన్ లోపల పోలీసులు ఉండటంతో అక్కణ్నుంచి బయటికి వచ్చారు. మళ్లీ హఫీజ్‌పేట చేరుకొని.. రాత్రి 1 గంట సమయంలో క్యాబ్ బుక్ చేసుకొని, రాంచీలోని రాజు వర్మ వద్దకు వెళ్లిపోయారు.
రాంచీకి విమానంలో వెళ్లి నిందితుల పట్టివేత
సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించిన పోలీసులు పనివాళ్లే నిందితులని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. అప్పటికే హత్య కేసు, అనుమానితుల ఊహాచిత్రాలు మీడియాలో వైరల్ కావడంతో నిందితులను రాంచీలో వదిలేసిన క్యాబ్ డ్రైవర్ దీన్ని గమనించాడు. దీంతో వెంటనే క్యాబ్ యజమాని సహాయంతో నిందితులు క్యాబ్ బుక్ చేసుకున్న విషయాన్ని సైబరాబాద్ పోలీసులకు అందించారు. వెంటనే సైబరాబాద్ పోలీసులు నిందితుల కంటే ముందే విమానంలో రాంచీకి చేరుకున్నారు. హర్ష్, రోషన్, రాజ్‌లను అరెస్టు చేసి, స్థానిక న్యాయస్థానంలో హాజరుపరిచారు. ట్రాన్సిట్ వారెంట్‌పై హైదరాబాద్‌కు తరలించారు. నిందితుల నుంచి బంగారు ఆభరణాలు, 16 వాచీలు, రెండు సెల్‌ఫోన్లు, రోల్డ్ గోల్డ్ వస్తువులను స్వా«దీనం చేసుకున్నారు.
డ్రగ్స్‌కు బానిస హర్ష్
నిందితుడు హర్ష్ డ్రగ్స్‌కు వ్యవసనపరుడని విచారణలో పోలీసులు గుర్తించారు. అరెస్టు చేసే సమయంలోనూ హర్ష్ మత్తులో ఉన్నాడని కమిషనర్ అవినాష్ మహంతి తెలిపారు. కోల్‌కతాలోని ఓ రిహాబిలిటేషన్ సెంటర్‌లో అడ్మిషన్, చికిత్స చేయించుకున్న డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. హర్ష్‌పై 2023లోనే రాంచీలో మూడు కేసులు నమోదయ్యాయని చెప్పారు. స్థానికంగా జైలులో ములాఖత్‌కు వెళ్లి, బయటికి వచ్చేటప్పుడు హీరోగా రీల్స్ చేస్తూ ఉండేవాడని, అందుకోసమే చెయిన్స్, ఆయుధాలను కొనుగోలు చేశాడని సీపీ వివరించారు. కేసును చాకచక్యంగా ఛేదించిన సీపీ అవినాష్ మహంతిని, ఆయన బృందాన్ని డీజీపీ డాక్టర్ జితేందర్ అభినందించారు.