వాకింగ్‌కు ఏదీ అవకాశం!

People Demands Government To Open Parks For The Walking - Sakshi

లాక్‌డౌన్‌ నిబంధనతో పార్కులకు తాళం 

నాలుగు నెలలుగా నడకకు నగరవాసి దూరం 

గత్యంతరం లేక రోడ్లపైనే నడక 

జనం మధ్య తిరగాల్సిరావటంతో కరోనా వైరస్‌ భయం 

సాక్షి, హైదరాబాద్‌: రోజూ ఉదయంపూట నడక.. రోగాలను దూరంగా ఉంచుతుందంటారు. అయితే కరోనా వైరస్‌ జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్న నేపథ్యంలో నగరజీవి ఉదయంపూట నడకకు దూరం కావాల్సి వచ్చింది. కరోనా వైరస్‌ సోకకుండా ఉండాలంటే శరీరంలో రోగనిరోధక శక్తి మెరుగ్గా ఉండాలని సూచిస్తున్న వైద్యులు, తగిన వ్యాయామం కూడా అత్యవసరమని చెబుతున్నారు. ఇంతకాలం పార్కుల్లో నిత్యం ఉదయం, సాయంత్రం నడకతో ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వస్తున్న వారు ఇప్పుడు నాలుగు నెలలుగా నడకకు దూరం కావాల్సి వచ్చింది. దానికి లాక్‌డౌన్‌ నిబంధనలే అడ్డుగా మారటం గమనార్హం.  

నాలుగు నెలలుగా దూరం.. 
మార్చిలో జనతా కర్ఫ్యూ తర్వాత విధించిన లాక్‌డౌన్‌తో మున్సిపల్‌ పార్కులన్నింటిని మూసేశారు. అప్పుడు మూసుకున్న గేట్లు ఇప్పటి వరకు తెరుచుకోలేదు. హైదరాబాద్‌లోని చాలా కాలనీలు, బస్తీల్లో మున్సిపల్‌ పార్కులు తప్ప నడకకు సరైన ప్రదేశాలంటూ లేవు. దీంతో శారీరక ఫిట్‌నెస్‌పై శ్రద్ధ ఉన్నవారు ఉదయం, సాయంత్రం వేళల్లో ఆయా పార్కుల్లోనే వాకింగ్‌ చేసేవారు. కానీ, లాక్‌డౌన్‌తో పార్కులు మూసేసిన తర్వాత వారికి వాకింగ్‌ చేసే వెసులుబాటు లేకుండా పోయింది. దీంతో కొందరు గత్యంతరం లేక రోడ్లపైనే నడుస్తున్నారు. కానీ ప్రస్తుతం కరోనా వైరస్‌ వ్యాప్తి తీవ్రమవటంతో వారు రోడ్లపై నడిచేందుకు భయపడుతున్నారు.

ఇతర పనులకు నడుచుకుంటూ వెళ్లేవారికి దగ్గరగా నడవాల్సి రావటంతో వైరస్‌ సోకే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా కాస్త వయసు ఎక్కువగా ఉన్నవారు, ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు మరింతగా భయపడుతున్నారు. వైరస్‌ సోకుతుందన్న భయంతో అసలు వాకింగ్‌కే వెళ్లటం మానేశారు. పార్కులు తెరిచి ఉంటే ధైర్యంగా నడిచే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు. అన్‌లాక్‌ ప్రక్రియ మొదలైనా.. పార్కులను మాత్రం తెరవకపోవటంతో వాకర్లు ఇబ్బందులు పడుతున్నారు. పార్కులు మూసి ఉండటంతో ముఖ్యంగా మధుమేహం, రక్తపోటు ఉన్న వారు సరైన నడక లేక ఇబ్బంది పడుతున్నారు. దుకాణాలు, హోటళ్ల వద్ద పెద్ద సంఖ్యలో గుమికూడేవారిని నియంత్రించటంలో విఫలమవుతున్న అధికార యంత్రాంగం, అతి తక్కువ మంది వచ్చే పార్కులను పూర్తిగా మూసి ఉంచటంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

పార్కులు తెరవండి
క్రమబద్ధమైన నడక ఆరోగ్యానికి ఎంతో మంచిది. నా దగ్గరికి వచ్చే మధుమేహ వ్యాధిగ్రస్తులకు కచ్చితంగా వాకింగ్‌ సిఫారసు చేస్తాను. కానీ ఇప్పుడు వాకింగ్‌ చేసేందుకు అనువైన పార్కులు లేకపోవటంతో చాలామంది ఆ ప్రక్రియకు దూరమై మధుమేహాన్ని నియంత్రించుకోలేకపోతున్నారు. కరోనా భయంతో ఎక్కువ సమయం ఇళ్లకే పరిమితమవుతున్నవారు.. ఓ రకమైన మానసిక సమస్యలోకి జారుకుంటున్నారు. వీరికి నడక చాలా అవసరం. అలాగే కరోనా సోకకుండా ఉండాలంటే శరీరం కూడా ఫిట్‌గా ఉండాలి. దానికి వాకింగ్‌ ఎంతో అవసరం.  పార్కులకు నిర్ధారిత వేళలు విధించటం, వాకర్స్‌ మాత్రమే పార్కులను వినియోగించుకునేలా చూడ్డం ద్వారా కరోనా భయం లేకుండా చేయొచ్చు.  – డాక్టర్‌ సీతారాం, డయాబెటాలజిస్టు

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top