
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పంచాయతీరాజ్ ఏఈ
కాల్వశ్రీరాంపూర్ (పెద్దపల్లి): సీసీ రోడ్డు నిర్మించిన కాంట్రాక్టర్‌కు బిల్లు మంజూరు చేయడానికి లంచం డిమాండ్ చేసిన పంచాయతీరాజ్ ఏఈ జగదీశ్‌ను ఏసీబీ అధికారులు శనివారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పెద్దపల్లి జిల్లా గంగారం గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఏసీడీ డీఎస్పీ విజయ్‌కుమార్ కథనం ప్రకారం.. జిల్లాలోని ఓదెల మండలం బాయమ్మపల్లె గ్రామానికి చెందిన కాంట్రాక్టర్ కావేటి రాజు కాల్వశ్రీరాంపూర్ మండలం వెన్నంపల్లి గ్రామంలో రూ.15 లక్షలు వెచ్చించి ఇటీవల సీసీ రోడ్లు నిర్మించారు.
ఇందుకు సంబంధించిన బిల్లులు మంజూరు చేయాలని ఆయన ఏఈ జగదీశ్‌ను సంప్రదించారు. అయితే, తనకు రూ.లక్ష లంచం ఇస్తేనే బిల్లు మంజూరు చేస్తానని ఏఈ డిమాండ్ చేయగా, రూ.90 వేలకు ఒప్పందం కుదిరింది. ఈ క్రమంలోనే బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారిసూచన మేరకు గంగారంలో రూ.90 వేలు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు.
రోడ్డుపైనే నిఘావేసి..: బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు గంగారం ప్రధాన చౌరస్తా సమీపంలోని రహదారిపై నిఘా వేశారు. అటుగా వచి్చన కాంట్రాక్టర్ రాజు నుంచి రూ.90 వేలు లంచం తీసుకుంటుండగా ఏ ఈ జగదీశ్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఓ ప్రభుత్వ అధికారి రోడ్డుపైనే బహి రంగంగా లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడటం చర్చనీయాంశంగా మారింది.