250 గజాల స్థలం.. వడ్డీలేని రుణం | Sakshi
Sakshi News home page

250 గజాల స్థలం.. వడ్డీలేని రుణం

Published Tue, Dec 26 2023 2:48 AM

Paid holiday on Singareni Day: Ponguleti Srinivasa Reddy - Sakshi

సింగరేణి (కొత్తగూడెం): సింగరేణి కార్మికులను అన్ని విధాలా ఆదుకుంటామని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భరోసా ఇచ్చారు. కార్మికుల సొంతింటి కల సాకారం చేసేందుకు ఒక్కొక్కరికి 250 గజాల స్థలం ఇవ్వడంతో పాటు గృహ నిర్మాణానికి రూ.20 లక్షల వడ్డీలేని రుణం అందజేస్తామని ప్రకటించారు.

సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఆయన కొత్తగూడెం, ఇల్లెందు, మణుగూరు, సత్తుపల్లి ఏరియాల్లోని బొగ్గు గనుల వద్ద జరిగిన సభల్లో మాట్లాడారు. సింగరేణి డే రోజున కార్మికులకు సెలవు దినంగా ప్రకటిస్తామని, మహిళా ఉద్యోగులకు అండర్‌ గ్రౌండ్‌లో కాకుండా సర్ఫేస్‌ విధులు కేటాయించేలా ఆధికారులతో మాట్లాడతానని హామీ ఇచ్చారు.

కొత్తగూడెం ఏరియాలో రాంపూర్‌ భూగర్భ గని, వీకే– 7తో పాటు మరో ఓసీ ఏర్పాటుకు కృషి చేస్తామని, గత ప్రభుత్వ నిర్వాకంతో తగ్గిన కార్మికుల సంఖ్యను గణనీయంగా పెంచుతామని చెప్పారు. బీఆర్‌ఎస్‌ హయాంలో మెడికల్‌ ఇన్‌వాలిడిటేషన్‌ కోసం కార్మికులు రూ.6 నుంచి రూ.8 లక్షలు వెచ్చించాల్సి వచ్చేదని, ఈ ప్రభుత్వంలో ఒక్క రూపాయి ఖర్చు లేకుండా అర్హులందరికీ అవకాశం కలి్పస్తామని పేర్కొన్నారు.

సీఎం రేవంత్‌రెడ్డి అందరి నాయకుడని, కార్మికుల సమస్యలు ఆయన దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని చెప్పారు. మాయమాటలు చెప్పి రెండుసార్లు కార్మికుల ఓట్లతో గెలుపొందిన బీఆర్‌ఎస్‌ అనుబంధ టీబీజీకేఎస్‌.. ఏ ఒక్క హామీని అమలు చేయలేదని విమర్శించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ భారీ మెజారిటీతో కేంద్రంలో అధికారంలోకి వస్తుందని, రాహుల్‌గాంధీ ప్రధానమంత్రి కాగానే, సింగరేణి కార్మికులకు ఆదాయపన్ను నుంచి మినహాయింపు ఇచ్చేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

ఈనెల 27న జరిగే గుర్తింపు సంఘం ఎన్నికల్లో గడియారం గుర్తుపై ఓటు వేసి ఐఎన్‌టీయూని గెలిపించాలని పొంగులేటి కోరారు. ఆయా కార్యక్రమాల్లో పినపాక, అశ్వారావుపేట, ఇల్లెందు, సత్తుపల్లి ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, జారే ఆదినారాయణ, కోరం కనకయ్య, మట్టా రాగమయి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement