ఓయూలో ‘పదోన్నతుల’ రగడ! | Osmania University Cancel 2 Professors Promotion | Sakshi
Sakshi News home page

ఉస్మానియా యూనివర్సిటీలో ‘పదోన్నతుల’ రగడ!

Jan 24 2025 7:51 PM | Updated on Jan 24 2025 7:57 PM

Osmania University Cancel 2 Professors Promotion

నిబంధనలకు విరుద్ధంగా ప్రొఫెసర్లకు ప్రమోషన్లు

ఔటా నేతల ఫిర్యాదుపై స్పందించిన యూజీసీ

మాజీ వీసీ ప్రొ.రవీందర్, ప్రొ.బాలకిషన్‌ పదోన్నతులు రద్దు

ఉస్మానియా యూనివర్సిటీ(ఓయూ)లో పదోన్నతుల రగడ కొనసాగుతోంది. అధిక వేతనం కోసం కొంతమంది ప్రొఫెసర్లు (Professors) అడ్డదారిలో ప్రమోషన్లు పొందారనే అంశం ఓయూ అధ్యాపక, విద్యార్థి వర్గాల్లో కలకలం రేపుతోంది. తప్పుడు సమాచారం ఇచ్చి 50 మంది ప్రొఫెసర్లు సీనియర్‌ ప్రొఫెసర్లుగా ప్రమోషన్లు పొందినట్లు ‘ఔటా’ ఫిర్యాదు చేయగా, మాజీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ రవీందర్, సైన్స్‌ మాజీ డీన్‌ ప్రొఫెసర్‌ బాలకిషన్‌ పదోన్నతులను రద్దు చేస్తూ యూజీసీ (UGC) ఉత్తర్వులు జారీ చేసింది.

కొత్తగా సీనియర్‌ ప్రొఫెసర్‌ హోదా.. 
యూనివర్సిటీల్లో బోధన, పరిశోధనలకుగాను ప్రొఫెసర్లను నియమిస్తారు. ప్రొఫెసర్‌ కంటే ముందుగా అసిస్టెంట్‌ ప్రొఫెసర్, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ లేదా రీడర్‌ హోదాలు ఉంటాయి. అయితే బీజేపీ కేంద్రంలో రెండోసారి అధికారం చేపట్టాక సీనియర్‌ ప్రొఫెసర్‌ అనే మరో హోదాను సృష్టించింది. సీనియర్‌ ప్రొఫెసర్‌గా పదోన్నతి పొందాలంటే యూజీసీ నిబంధనల ప్రకారం ప్రొఫెసర్‌గా 10 ఏళ్ల సరీ్వస్, 10 పరిశోధనా పత్రాలు(పబ్లికేషన్స్‌), ఇద్దరు విద్యార్థులకు పీహెచ్‌డీ పర్యవేక్షకులు(గైడ్‌షిప్‌)గా ఉండాలి. సీనియర్‌ ప్రొఫెసర్‌కు నెలకు రూ.3.40 లక్షల వరకు వేతనంతోపాటు పింఛను, ఇతర అలవెన్సులు ఉంటాయి.

తొలిసారి 51 మందికి అవకాశం
ఓయూ మాజీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొ.రవీందర్‌ హయాంలో మూడుసార్లు జరిగిన కెరియర్‌ అడ్వాన్స్‌డ్‌ స్కీమ్‌(సీఎస్‌ఎస్‌) పదోన్నతుల్లో 51 మంది సీనియర్‌ ప్రొఫెసర్లుగా పదోన్నతి పొందారు. కానీ, అందులో కొందరికి యూజీసీ నిబంధనల ప్రకారం పరిశోధనా పత్రాలు 10 కంటే తక్కువగా ఉన్నాయని ఉస్మానియా యూనివర్సిటీ టీచర్స్‌ అసోసియేషన్‌(ఔటా) నాయకులు ఫిర్యాదు చేశారు. ఔటా ఫిర్యాదు మేరకు ఓయూ మాజీ వీసీ ప్రొ.తిరుపతిరావు అధ్యక్షతన రాష్ట్ర ప్రభుత్వం విచారణ కమిటీని నియమించింది. అయితే కమిటీ విచారించిన అంశాలను బహిర్గతం చేయాలని ఔటా నాయకులు కోరినా ఇంతవరకు బహిర్గతం చేయలేదు. ‘గతం గతః భవిష్యత్తులో ఇలాంటి తప్పిదాలు జరగకుండా జాగ్రత్త పడాలి’అని కమిటీ విచారణలో పేర్కొన్నట్లు తెలిసింది.  

ఇద్దరి పదోన్నతులు చెల్లవు: యూజీసీ 
ఓయూలో ఇద్దరు సీనియర్‌ ప్రొఫెసర్ల పదోన్నతులు చెల్లవని యూజీసీ తేల్చి చెప్పింది. మాజీ వీసీ ప్రొ.రవీందర్, సైన్స్‌ మాజీ డీన్‌ ప్రొ.బాలకిషన్‌కు యూజీసీ నిబంధనల ప్రకారం 10 పరిశోధనాపత్రాలు లేవని తేలడంతో వారి పదోన్నతులు రద్దు చేయాలని ఉత్తర్వులను జారీ చేసింది. అయితే మరో 40 మందికి కూడా 10 పరిశోధన పత్రాలు లేవని ఔటా, ఏఐఎస్‌ఎఫ్‌ విద్యార్థి సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు. సీనియర్‌ ప్రొఫెసర్లుగా పదోన్నతులు పొందినవారికి ఇంతకాలం చెల్లించిన వేతనం, పింఛన్‌ రికవరీ చేయాలని డిమాండ్‌ చేశారు.

చ‌ద‌వండి: పాతబస్తీ మెట్రో పనులు.. చ‌కచ‌కా!

నిబంధన మేరకే..: ప్రొ.రవీందర్‌ 
ఓయూలో తొలిసారిగా చేపట్టిన సీనియర్‌ ప్రొఫెసర్ల పదోన్నతుల్లో ఎలాంటి అక్రమాలు జరగలేదని మాజీ వీసీ ప్రొఫెసర్‌ రవీందర్‌ వివరణ ఇచ్చారు. ప్రొఫెసర్‌ బాలకిషన్‌పై వచ్చిన ఆరోపణలను విచారించి ఆయనకు ఇచ్చిన పదోన్నతిని రద్దు చేసినట్లు పేర్కొన్నారు. తనకు 10 పబ్లికేషన్స్‌ ఉన్నాయని, తప్పుడు తడకగా సమాచారాన్ని ఆర్‌టీఏ ద్వారా సేకరించి తనపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. కాగా, అక్రమ పదోన్నతులను రద్దు చేసి, ఇంతవరకు పొందిన వేతనం, పింఛన్‌ను రికవరీ చేయాలని ఔటా అధ్యక్షుడు ప్రొ.మనోహర్, ఏఐఎస్‌ఎఫ్‌ నేత నెలి సత్య డిమాండ్‌ చేశారు.     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement