ఆఫీస్‌లో ఎక్స్‌ట్రా వర్క్‌కు నో! | No to extra work in the office | Sakshi
Sakshi News home page

ఆఫీస్‌లో ఎక్స్‌ట్రా వర్క్‌కు నో!

Aug 3 2026 7:32 AM | Updated on Aug 3 2026 7:42 AM

No to extra work in the office

సాక్షి, హైదరాబాద్‌: భారతీయ కార్పొరేట్‌ ప్రపంచంలో ఒకప్పుడు ‘హసిల్‌ కల్చర్‌’(రేయింబవళ్లు కష్టపడే సంస్కృతి) రాజ్యమేలేది. కంపెనీ ఎదుగుదల కోసం ఉద్యోగులు తమ సొంత సమయాన్ని త్యాగం చేస్తూ అప్పగించిన పనికంటే ఎక్కువే చేసేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్‌ మారింది. ఆఫీసుల్లో సరికొత్త నిశ్శబ్ద విప్లవం మొదలైంది. ఉద్యోగులు తమకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగానే పూర్తి చేస్తున్నారు. కానీ, అంతకుమించి ఒక్క అడుగు కూడా ముందుకు వేయడానికి ఇష్టపడటం లేదు. ఈ కొత్త ధోరణినే నిపుణులు ‘ఎఫర్ట్‌ రిసెషన్‌’అని పిలుస్తున్నారు.‘గ్రేట్‌ ప్లేస్‌ టు వర్క్‌ ఇండియా’తాజా అధ్యయనంలో ఒక విస్తుపోయే నిజం బయటపడింది. భారత్‌లో ప్రతి 10లో 6 సంస్థలు (దాదాపు 63 శాతం) తమ ఉద్యోగుల్లో ఈ ‘ఎఫర్ట్‌ రిసెషన్‌’ధోరణిని గమనిస్తున్నట్లు అంగీకరించాయి. దాదాపు 57 లక్షల మంది ఉద్యోగుల నుంచి సేకరించిన అభిప్రాయాల ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు.

జెన్‌–జీ రాకతో మారిన సమీకరణాలు
ఈ మార్పు వెనుక ఉన్న అతిపెద్ద కారణం కార్పొరేట్‌ రంగంలోకి ‘జెన్‌–జీ’(1997–2012 మధ్య పుట్టిన యువత) వేగంగా అడుగుపెట్టడమే. 2023లో భారతీయ శ్రామిక శక్తిలో జెన్‌–జీ వాటా కేవలం 13 శాతమే. ఇప్పుడు అది ఏకంగా 26 శాతానికి చేరింది. ఐటీ, బ్యాంకింగ్, మాన్యుఫ్యాక్చరింగ్, ఫార్మా వంటి అన్ని రంగాల్లోనూ వీరి సంఖ్య వేగంగా పెరుగుతోంది. జెన్‌–జీ ఉద్యోగుల ప్రవేశంతో పాత మేనేజ్‌మెంట్‌ పద్ధతులు ఇక సాగవని స్పష్టమవుతోంది. దాదాపు ఇద్దరిలో ఒక హ్యూమన్‌ రిసోర్స్‌ హెడ్‌ తాము జెన్‌–జీ ఉద్యోగుల మానసిక స్థితిని, వారిని ఏ అంశాలు ఉత్సాహపరుస్తాయో సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నామని బహిరంగంగానే అంగీకరిస్తున్నారు. 
జెన్‌–జీ ఏం కోరుకుంటోంది?  

  • సంప్రదాయ ఉద్యోగుల్లా వీరు కేవలం ‘ఉద్యోగ భద్రత’లేదా ‘పెద్ద జీతం’మాత్రమే ఆశించడం లేదు. వారి ప్రాధాన్యతలు పూర్తి భిన్నంగా ఉన్నాయి. 

  • వీరికి పని ఎంత ముఖ్యమో, వ్యక్తిగత జీవితం, మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. ఆఫీస్‌ సమయం ముగియగానే ల్యాప్‌టాప్‌ క్లోజ్‌ చేయడం హక్కుగా భావిస్తారు. 

  • రిమోట్‌ వర్క్, హైబ్రిడ్‌ మోడల్‌ లేదా ఫ్లెక్సిబుల్‌ పని వేళలను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. 

  • తాము చేసే పని సమాజానికి లేదా కంపెనీకి ఎలా ఉపయోగపడుతుందో స్పష్టంగా తెలియాలి. కేవలం మెకానికల్‌గా పని చేయడం నచ్చదు. 

  • తదుపరి ప్రమోషన్‌ లేదా కెరీర్‌ ప్లానింగ్‌ విషయంలో యాజమాన్యం దాపరికం లేకుండా, పారదర్శకంగా ఉండాలని కోరుకుంటారు. 
    మారకపోతే కష్టమే.. 

  • కంపెనీలు జెన్‌–జీ అవసరాలను గుర్తించి, వారి ఆలోచనలకు అనుగుణంగా మారకపోతే ఆయా సంస్థల్లో ఉద్యోగులు ఎక్కువ కాలం నిలబడటం లేదని సర్వే హెచ్చరించింది. కంపెనీలు ఒకవైపు జెన్‌–జీ ఉద్యోగులను అర్థం చేసుకోవడానికి తంటాలు పడుతుంటే, మరోవైపు టెక్నాలజీ వారిపై ఒత్తిడిని మరింత పెంచుతోంది. 58 శాతానికి పైగా హ్యూమర్‌ రిసోర్స్‌ హెడ్స్‌ అటు జెన్‌–జీ హ్యాండ్లింగ్, ఇటు ఏఐ విస్తరణ వంటి రెండు సవాళ్లను ఒకేసారి ఎదుర్కొంటున్నారు.

పరిష్కారం ఆఫర్లలో లేదు.. 
ఈ ఎఫర్ట్‌ రిసెషన్‌ ఆపడానికి ఆఫీసుల్లో ఉచిత స్నాక్స్‌ ఇవ్వడమో, కఠినమైన రూల్స్‌ పెట్టడమో సరిపోదు. దీనికి అసలైన మందు నాయకత్వం లోనే ఉందని నిపుణులు చెబుతున్నారు. జెన్‌–జీని కేవలం పనిముట్లుగా కాకుండా, వారి అభిప్రాయాలను ఆలకించి, వారిని గౌరవించే లీడర్స్‌ ఉన్న కంపెనీల్లో అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయి. బలమైన నాయకత్వం, పరస్పర నమ్మకం ఉన్న ఆఫీసుల్లో ఉత్పాదకత 47 శాతం, ఆవిష్కరణలు 34 శాతం మెరుగయ్యాయి. రాబోయే రోజుల్లో కంపెనీల అసలైన విజయం ఏఐ వాడకంలో లేదని, జెన్‌–జీని అర్థం చేసుకుని, వారిని సంతోషంగా పని చేసేలా చూసుకోగలగడంలోనే ఉందని నిపుణులు అంటున్నారు. లీడర్లు కేవలం టార్గెట్లు నిర్దేశించడమే కాకుండా ఉద్యోగుల మనోభావాలను ఆలకించినప్పుడే ఈ ‘ఎఫర్ట్‌ రిసెషన్‌’కు బ్రేక్‌ పడుతుందని చెబుతున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement