NEET 2021 Exam Day Guidelines - No Shoes Allowed - Sakshi
Sakshi News home page

NEET Exam: బూట్లు వద్దు.. చెప్పులే వేసుకోండి!

Aug 20 2021 3:38 AM | Updated on Aug 20 2021 3:29 PM

NIT Has Issued Guidelines For NEET Examination - Sakshi

వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్‌ పరీక్ష వచ్చే నెల 12న నిర్వహించేందుకు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ ఏర్పాట్లు పూర్తి చేసింది.

సాక్షి, హైదరాబాద్‌: కఠిన నిబంధనలు, కరోనా జాగ్రత్తల నడుమ వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్‌ పరీక్ష వచ్చే నెల 12న నిర్వహించేందుకు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ ఏర్పాట్లు పూర్తి చేసింది. నీట్‌కు హాజరయ్యే విద్యార్థులు బూట్లు ధరించకూడదని ఎన్‌టీఏ ప్రకటించింది. సాధారణ చెప్పులు మాత్రమే వేసుకుని రావాలని స్పష్టం చేసింది. ఈ మేరకు తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. ఎంబీబీఎస్, బీడీఎస్, బీఏఎంఎస్, బీయూఎంఎస్, బీహెచ్‌ఎంఎస్‌ తదితర అండర్‌ గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నీట్‌ నిర్వహించనున్నారు. నీట్‌ పరీక్ష నియమాలు, నిబంధనలకు కట్టుబడి ఉండకపోతే అభ్యర్థిని పరీక్ష రాసేందుకు అనుమతించరు. ప్రధానంగా పరీక్ష హాలులోకి వచ్చే విద్యార్థులకు కఠినమైన నిబంధనలను అమలుచేస్తున్నారు. 

హెయిర్‌ పిన్ను, తాయత్తు ఏదీ వద్దు.. 
విద్యార్థులు అడ్మిట్‌ కార్డు, ఇతర పత్రాలను పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లాలి. పాస్‌పోర్టు సైజు ఫొటో,  ఐడీ ప్రూఫ్‌ తీసుకెళ్లాలి. పాన్‌ కార్డు, ఆధార్‌ కార్డు, ఓటర్‌ ఐడీ, డ్రైవింగ్‌ లైసెన్స్, పాస్‌పోర్టు, రేషన్‌ కార్డు వంటివి తీసుకెళ్లొచ్చు. కరోనా నేపథ్యంలో ముఖానికి మాస్కు తప్పనిసరి. వాటర్‌ బాటిల్, 50 మి.లీ. శానిటైజర్‌ బాటిల్‌ తీసుకువెళ్లొచ్చు. ప్రవేశద్వారం వద్ద థర్మల్‌ స్కానింగ్‌ ఏర్పాటు చేస్తారు. అభ్యర్థులు ఆభరణాలు ధరించకూడదు. ఉంగరాలు, బ్రాస్‌లెట్లు, చెవిపోగులు, ముక్కు పోగులు, చైన్, నెక్లెస్, లాకెట్లు, బ్యాడ్జ్‌ మొదలైనవి పెట్టుకొని రాకూడదు.

కాగితాల ముక్కలు, పెన్సిల్‌ బాక్స్, ప్లాస్టిక్‌ పర్సు, కాలిక్యులేటర్, పెన్, స్కేల్, పెన్‌ డ్రైవ్‌లు, రబ్బరు, ఎలక్ట్రానిక్‌ పెన్, స్కానర్‌ మొదలైనవి వెంటతీసుకొని రాకూడదు. ఫోన్, బ్లూటూత్, ఇయర్‌ఫోన్లు, మైక్రోఫోన్, పేజర్, హెల్త్‌ బ్యాండ్, చేతి గడియారం, కెమెరా లాంటివి ఏవీ తీసుకెళ్లొద్దు. అలాగే వాలెట్, గాగుల్స్, హ్యాండ్‌ బ్యాగులు, హెయిర్‌పిన్లు, హెయిర్‌ బ్యాండ్, తాయెత్తులు పెట్టుకొని రావొద్దని స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చారు. 

అడ్మిట్‌ కార్డు ట్యాంపరింగ్‌ చేయకూడదు.. 
సెప్టెంబర్‌ 12న ఆఫ్‌లైన్‌ మోడ్‌లో 11 భాషల్లో నీట్‌ పరీక్ష నిర్వహిస్తారు. ఆ మేరకు వచ్చే నెల 9న neet.nta.nic.in లో అడ్మిట్‌ కార్డు విడుదల చేస్తారు. ఈసారి దుబాయ్‌లో కూడా పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. కాగా, అభ్యర్థులు పరీక్ష హాల్‌ లోపల ఇతర విద్యార్థులతో మాట్లాడొద్దు. ఎలాంటి అక్రమాలకు సహకరించొద్దు. 

విద్యార్థులు జవాబు బుక్‌లెట్‌ నుంచి ఏ పేజీనీ చించకూడదు. 

నీట్‌ అడ్మిట్‌కార్డు వంటి డాక్యుమెంట్లపై ట్యాంపరింగ్‌ చేయకూడదు. దరఖా స్తు ఫారం నింపేటప్పుడు, అడ్మిట్‌ కార్డుపై అతికించే ఫొటోలో ఎలాంటి మార్పులు చేయరాదు. 

నిబంధనలు పాటించకపోయినా, ఎలాంటి అక్రమాలకు పాల్పడినా వారిని మూడేళ్లు డిబార్‌ చేయడానికి ఆస్కారముంది. 

సంప్రదాయ దుస్తులు తప్పక ధరించాల్సిన అభ్యర్థులు రిపోర్టింగ్‌ సమయానికి కనీసం గంట ముందు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. 

నీట్‌ పరీక్ష కేంద్రాల్లో మాస్కులు అందిస్తారు. అభ్యర్థులు నిర్ణీత సమయానికి ఒక గంటలోపు పరీక్ష హాల్‌కు చేరుకోవాలి. 

పరీక్ష కేంద్రంలోనే అభ్యర్థులకు పెన్ను ఇస్తారు. 

పరీక్ష రాసే సమయంలో ఏ కారణంతోనూ గదిని వదిలి వెళ్లకూడదు. కేటాయించిన సమయం ముగిసిన తర్వాత మాత్రమే అభ్యర్థులు బయటకు వెళ్లాల్సి ఉంటుంది. 

పరీక్ష కేంద్రం వద్ద రద్దీని నివారించేందుకు విద్యార్థులకు నిర్ణీత టైం స్లాట్‌ కేటాయిస్తారు. ఆ ప్రకారం పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. ఆ మేరకు వారికి సమాచారం ఇస్తారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement