
ఎన్‌ఐఏ వెబ్‌సైట్‌లో మరణించిన మావోయిస్టుల పేర్లు
నంబాల కేశవరావు, గాజర్ల రవి సహా కీలక నేతల పేర్లు
దేశంలోని 317 మందితో ఎన్‌ఐఏ హిట్‌లిస్టు
గణపతి, హిడ్మా సహా తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌లోని కీలక క్యాడర్
సాక్షిప్రతినిధి, వరంగల్: దేశంలో మావోయిస్టు ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేస్తూ టాప్ నక్సలైట్ నేతలందరినీ ఎన్‌కౌంటర్లలో చంపేసినా.. వారి పేర్లు ఇంకా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) మోస్ట్ వాంటెడ్ జాబితాలోనే కొనసాగుతున్నాయి. గత ఏడాది మేలో ఛత్తీస్‌గఢ్‌లోని దండకారణ్యంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు మరణించారు. అదే రాష్ట్రంలో గత ఏడాది డిసెంబర్‌లో మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మొబైల్ పొలిటికల్ స్కూల్ ఇన్‌చార్జిగా ఉన్న అగ్రనేత బల్మూరి నారాయణరావు అలియాస్ ప్రభాకర్ కూడా బలగాల ఎన్‌కౌంటర్‌లో చనిపోయారు. వీరి పేర్లు ఇంకా ఎన్‌ఐఏ వెబ్‌సైట్‌లో మోస్ట్ వాంటెడ్ లిస్టులోనే ఉండటం గమనార్హం.
జాబితాలో 317 పేర్లు
దేశవ్యాప్తంగా ఉగ్రవాద, తీవ్రవాద, వేర్పాటువాద, తీవ్ర ఆర్థిక నేరాలతో సంబంధం ఉన్న 317 మంది పరారీలో ఉన్నట్లు ఎన్‌ఐఏ గుర్తించింది. వారందరి పేర్లు, ఫొటోలతో కూడిన వివరాలను వెబ్‌సైట్‌లో మోస్ట్‌వాంటెడ్ లిస్టులో చేర్చింది. ఇందులో నంబాల కేశవరావుతోపాటు పలువురి పేర్లు ఉన్నాయి. దండకారణ్యం జోనల్ కమిటీ సభ్యుడు అన్నె సంతోష్ అలియాస్ సాగర్ బీజాపూర్ జిల్లాలో 2024 ఏప్రిల్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతిచెందాడు. ఆంధ్ర– ఒడిశా కమిటీ కార్యదర్శిగా పనిచేసిన గాజర్ల రవి అలియాస్ గణేశ్ ఈ ఏడాది జూన్ 17న ఏపీ– ఒడిశా సరిహద్దులోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో చనిపోయాడు. ఆయనతో పాటు మరో కీలక నేత వెంకటరవి లక్ష్మీ చైతన్య అలియాస్ అరుణ కూడా మృతి చెందారు.
నల్లగొండ జిల్లా చండూరు మండలం పుల్లెంలకు చెందిన పాక హన్మంతు ఏడాది జనవరి 25న ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించాడు. అగ్రనేత మల్లోజుల కోటేశ్వర్‌రావు అలియాన్ కిషన్ జీ భార్య పోతుల కల్పన అలియాస్ సుజాత మహబూబ్‌నగర్‌లో రెండేళ్ల క్రితం అరెస్టయ్యారు. దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలు కోడి మంజుల అలియాస్ నిర్మల 2024 నవంబర్‌లో వరంగల్ పోలీసు కమిషనర్ ఎదుట లొంగిపోయారు.
మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం మడగూడెం గ్రామానికి చెందిన యాప నారాయణ అలియాస్ హరిభూషణ్ సీపీఐ (మావోయిస్టు) రాష్ట్ర కార్యదర్శిగా ఉండి 2021 జూన్ 21న ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ అడవుల్లో కోవిడ్ వ్యాధితో మరణించారు. మరో కేంద్ర కమిటీ సభ్యుడు అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ (ఆర్కే) అనారోగ్యంతో 2021 అక్టోబర్ 14న దక్షిణ బస్తర్ జిల్లాలో మృతి చెందాడు. వీరందరి పేర్లు ఇంకా మోస్ట్‌వాంటెడ్ లిస్టులో ఉండటం గమనార్హం. అయితే, మావోయిస్టు పారీ్టలో ఇంకా కీలకంగా ఉన్నారని భావిస్తున్న సుమారు 40 మంది ఎన్‌ఐఏ హిట్‌లిస్టులో ఉన్నట్లు సమాచారం.
వారిలో కేంద్ర కమిటీ కార్యదర్శిగా పని చేసిన ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి, మడావి హిడ్మా, మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ భూపతి, కడారి సత్యనారాయణ రెడ్డి అలియాస్ సాధు, మల్లా రాజిరెడ్డి, మోడం బాలకృష్ణ, పుల్లూరు ప్రసాదరావు అలియాస్ చంద్రన్న, తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న, తిప్పిరి తిరుపతి తదితర అగ్రనేతలు ఉన్నట్లు తెలిసింది.