ఫోర్బ్స్‌ జాబితాలో నల్లగొండ వాసి

Nalgonda Man Placed In Forbes list - Sakshi

రామగిరి (నల్లగొండ) : నల్లగొండ పట్టణానికి చెందిన కోణం సాందీప్‌.. ఫోర్బ్స్‌ జాబితాలో స్థానం దక్కించుకున్నాడు. హెల్త్‌కేర్‌ సెక్టార్‌కు సంబంధించి వినూత్న రీతిలో వైద్య, ఆరోగ్య సేవలందిస్తున్న సాందీప్‌.. ఈ నెల 1న ప్రతిష్టాత్మక ఫోర్బ్స్‌ పత్రిక విడుదల చేసిన అండర్‌– 30 పదవ వార్షిక జాబితాలోని 30 మందిలో మొదటి వరుసలో నిలిచాడు. కోణం సాందీప్‌ 2018 ఫిబ్రవరిలో డాక్టర్‌ శివ్‌రావ్‌తో కలసి అమెరికాలోని పిట్స్‌బర్గ్‌లో అబ్రిడ్జ్‌ పేరుతో యాప్‌ సృష్టించి హెల్త్‌కేర్‌ రంగంలో రాణిస్తున్నాడు. ఇప్పటివరకు తమ కంపెనీకి 15 మిలియన్‌ డాలర్ల పెట్టుబడులు వచ్చినట్లు సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.

ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీలో బీటెక్‌ నల్లగొండ పట్టణానికి చెందిన కోణం శ్రీనివాస్, అనురా ధ దంపతుల కుమారుడు సాందీప్‌ ఏపీలోని కడప జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీలో ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ ఇంజనీరింగ్‌లో బీటెక్‌తోపాటు కంప్యూటర్‌ సైన్స్‌లో మైనర్‌ డిగ్రీ పూర్తి చేశాడు. అమెరికాలోని కార్నెగీ మెలన్‌ యూనివర్సిటీలో రోబోటిక్స్‌లో ఎంఎస్‌ పూర్తి చేశాడు. సాందీప్‌ డ్రోన్లు, రోబోటిక్స్‌ రంగంలో పలు ఆవిష్కరణలు చేశాడు. హెల్త్‌కేర్‌ టెక్నాలజీకి సంబంధించి వివిధ అప్లికేషన్స్‌ని కూడా రూపొందించాడు. పాతికేళ్ల వయసులోనే అమెరికా ఫోర్బ్స్‌ జాబితాలో స్థానం దక్కించుకున్న కోణం సాందీప్‌ను పలువురు అభినందిస్తున్నారు.

చాలా సంతోషంగా ఉంది: సాందీప్‌
ఫోర్బ్స్‌ అండర్‌ 30 జాబితాకు ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉంది. మా యాప్‌ అబ్రిడ్జ్‌.. ఈ ఏడాది అమెరికాలో కోవిడ్‌ –19 వైద్య సేవలు అందించే విషయంలో మంచి గుర్తింపు పొందింది. కోణం ఫౌండేషన్‌ పేరుతో చారిటీ సంస్థను స్థాపిం చి పేదలకు సేవలందిస్తున్నాం. విద్యాభివృద్ధికి పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. 
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top