భారీగా పెరిగిన మటన్, చేపల ధరలు

Mutton And Fish Rates Highly Increase In Hyderabad - Sakshi

మటన్‌ ధర కిలో రూ.800

చేపల ధరలు రవ్వ, బొచ్చ రూ.200..కొరమీను 500

పట్టించుకోని అధికారులు..సామాన్యుడిపై తీవ్ర భారం

సాక్షి, హైదరాబాద్‌ : పప్పులు, నూనెలే కాదు..మటన్, చేపల ధరలు మార్కెట్‌లో మండిపోతున్నాయి. సామాన్య ప్రజానీకం ఒక కిలో కొనుక్కుని వండుకోవాలన్నా అందనంత దూరానికి వెళ్లిపోయాయి. మామూలుగా కిలో రూ.500 అంతకంటే కొంచెం ఎక్కువ ఉండే మటన్‌ ధర ఇప్పుడు ఏకంగా రూ.800 అయింది. ఎట్టి పరిస్థితుల్లోనూ మటన్‌ ధర కిలో రూ.700 దాటకూడదన్న రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలు కూడా ప్రస్తుత పరిస్థితుల్లో మటన్‌ ధరను అదుపు చేయలేకపోతున్నాయి. పరిస్థితిని బట్టి మటన్‌ రూ.1000 వరకు కిలో అమ్ముతుండటం గమనార్హం. ఇక, చేపల ధరలు కూడా కొండెక్కాయి. రవ్వ, బొచ్చె, కొరమీను..ఏదైనా కిలోకు మూడొంతుల ధర పెరగడంతో మత్స్య ప్రియులు కూడా వెనక్కు తగ్గాల్సి వస్తోంది.  

కొరమీను కిలో రూ.650 వరకు 
చేపల ధరలు సైతం రోజురోజుకూ పైపైకి వెళ్లుతున్నాయి. రవ్వ, బొచ్చలు మామూలుS రోజుల్లో అయితే కిలో రూ.120 నుంచి రూ.150 వరకు అమ్ముతారు. ఇప్పుడు కిలో రూ.180 నుంచి రూ.220 వరకు అమ్ముతున్నారు. కొరమీను అయితే కిలో రూ. 600 నుంచి రూ.700 వరకు అమ్ముతున్నారు. పండుగ సమయంలో ఆంధ్రప్రదేశ్‌ నుంచి దిగుమతి తక్కువగా ఉండటం, తెలంగాణలో ప్రభుత్వం ఉచితంగా విడుదల చేసిన చేపలు ఇంకా పెరగకపోవడం వంటి అంశాలు కూడా ధరలు పెరిగేందుకు కారణమయ్యాయి.  

వినియోగం పెరిగింది.. ధరలు పెరిగాయి 
గతంలో జీహెచ్‌ఎంసీ పరిధిలో మటన్‌ కనీసంగా రోజుకు 60 టన్నుల నుంచి 70 టన్నుల వరకు అమ్మేవారు. పండుగ సమయంలో అయితే ఇది 100 టన్నులకు పైగానే అమ్ముతారు. పోయిన వారంలో ఏకంగా మటన్‌ 170 టన్నుల వరకు వెళ్లిందని అధికారులు చెబుతున్నాయి. ప్రజల్లో ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని కిలో మటన్‌ రూ. 700లకు మించి అమ్మొద్దని నిబంధనలు ఉన్నా అధికారులు మాటలకే పరిమితం కావడంగమనార్హం. 

చేపల ధరలు గతంలో, ఇప్పుడు
చేపలు     రవ్వ    బొచ్చెలు    కొరమీను     రొయ్యలు 
                (కిలోకు రూపాయల్లో) 
గతంలో    150    160    500–600    250–350 
ఇప్పుడు    200    220    600–700    350–450 

ఎక్కువకు అమ్మితే కఠిన చర్యలే 
మార్కెట్‌లో మాంసం ధరలు పెంచి అమ్ముతున్నట్లు మా దృష్టికి వచ్చింది. అధికారులు కూడా ఈ విషయంపై దృష్టి సారించారు. సోమవారం దీనిపై ప్రకటన చేస్తామన్నారు. మార్కెట్‌లో డిమాండ్‌ ఉంది కదా అని ఎక్కువకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటాం.    మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top