
గోషామహల్‌లో ఉప ఎన్నిక రాదన్న ఎమ్మెల్యే
బీజేపీ నాయకత్వం పిలిస్తే కలవడానికి సిద్ధమని వ్యాఖ్య
సాక్షి, హైదరాబాద్: గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తిరిగి కమలం గూటికి చేరడానికి ప్రయత్నిస్తున్నారా? బీజేపీ జాతీయ నాయకత్వం ఆహా్వనిస్తే కలవడానికి సిద్ధమవుతున్నారా.. అంటే ఆయన వ్యాఖ్యలను బట్టి చూస్తే అవుననే అనిపిస్తోంది. పార్టీ అధిష్టానంపై ధిక్కార స్వరం వినిపించి బహిష్కరణ వేటుకు గురైన రాజాసింగ్ మళ్లీ కాషాయతీర్థం పుచ్చుకునే దిశగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.
హైకమాండ్ పిలిస్తే రాజీనామా చేయడానికి గల కారణాలు, రాష్ట్ర పార్టీ నాయకుల తీరు గురించి వివరించేందుకు సిద్ధంగా ఉన్నానంటూ రాజాసింగ్ ఆసక్తికరమైన వాఖ్యలు చేశారు. ‘నా వైపు నుంచి కూడా కొన్ని తప్పులు దొర్లాయి. అధిష్టానానికి కొందరు నాపై తప్పుడు సమాచారం చేరవేశారు’అని తాజాగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ అన్నారు. ఈ వ్యాఖ్యలను పరిశీలిస్తే ఆయన మనసు మార్చుకునేందుకు, తిరిగి బీజేపీ గూటికి చేరడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది.
పార్టీకి మాత్రమే రాజీనామా చేశా..
‘ఉప ఎన్నిక వస్తుందని కొంత మంది పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని అంటున్నారు. నేను పార్టీకి మాత్రమే రాజీనామా చేశాను. ఎమ్మెల్యే పదవికి కాదు. స్పీకర్‌కు లేఖ ఇవ్వలేదు. బీఆర్‌ఎస్ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరితే అక్కడెక్కడా ఉప ఎన్నిక రాలేదు. గోషామహల్‌లో ఎలా వస్తుందో నాకు తెలియడంలేదు. మరో మూడేళ్లు నేనే ఎమ్మెల్యేగా ఉంటాను. ఉప ఎన్నిక ప్రసక్తే రాదు’అని రాజాసింగ్ స్పష్టం చేశారు.
పార్టీలో మిత్రులతోపాటు శత్రువులు ఉన్నారని, వాళ్లే మీడియాకు లీకులిస్తూ, వాటిని ఢిల్లీలో ఫిర్యాదు చేస్తారని, ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తనకు ఫోన్ చేశారంటూ సామాజిక మాద్యమాల్లో జరిగిన తప్పుడు ప్రచారంతో నా రాజీనామాను అధిష్టానం ఆమోదించిందని పేర్కొన్నారు. ఎలాంటి పరిస్థితుల్లో రాజీనామా ఇచ్చాననేది వివరణ ఇచ్చుకునేందుకు సిద్ధంగా ఉన్నానని చెబుతున్నారు. తెలంగాణలో బీజేపీకి ఎవరి వల్ల నష్టం జరుగుతుంది, ఇతర పారీ్టల నుంచి వచి్చన వారికి ఎలాంటి అవమానాలు జరుగుతున్నాయనే అంశాలను వివరిస్తానని రాజాసింగ్ పేర్కొన్నారు.