హైదరాబాద్: పార్లమెంట్ వేదికగా బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును భారత్-పాకిస్థాన్ విభజనతో పోలుస్తూ చేసిన వ్యాఖ్యలు అత్యంత హేయమైనవని, ఇది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్రంగా ఖండించారు.
"తెలంగాణ రాష్ట్రం వందలాది మంది విద్యార్థులు, యువకుల ప్రాణత్యాగాల ఫలితం. దశాబ్దాల పోరాటం, ప్రజాస్వామ్యబద్ధంగా పార్లమెంట్‌లో ఆమోదించిన చట్టం ద్వారా ఏర్పడిన రాష్ట్రాన్ని, రక్తపాతంతో కూడిన దేశ విభజనతో పోల్చడం తేజస్వి సూర్య అజ్ఞానానికి పరాకాష్ఠ. ఇది అమరుల త్యాగాలను కించపరచడమే." అని మంత్రి మండిపడ్డారు.
"భారత రాజ్యాంగం ప్రకారం జరిగిన రాష్ట్ర విభజనకు తేడా తెలియని వారు పార్లమెంట్‌లో ఉండటం దురదృష్టకరం. కోట్లాది మంది ప్రజలను అవమాన పరిచేలా మాట్లాడిన తేజస్వి సూర్యపై లోక్ సభ స్పీకర్ గారు చర్యలు తీసుకోవాలనీ డిమాండ్ చేస్తున్న. రాజకీయ లబ్ధి కోసం దేశ సమగ్రతను, ప్రాంతీయ సామరస్యాన్ని దెబ్బతీసేలా మాట్లాడటం భావ్యం కాదు."
"తెలంగాణ సమాజాన్ని కించపరిచిన తేజస్వి సూర్య తన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోవాలి. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు ఆయన బహిరంగంగా క్షమాపణ చెప్పాలి" తెలంగాణ అభివృద్ధిని చూసి ఓర్వలేకనే బీజేపీ ఇలాంటి విషపూరిత వ్యాఖ్యలు చేస్తోందని, ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని మంత్రి హెచ్చరించారు.
ఇదీ చదవండి: ఏపీ విభజనపై ఎంపీ తేజస్వీ సూర్య వివాదాస్పద వ్యాఖ్యలు


