రాష్ట్ర సరిహద్దులపై పోలీసుల నిఘా

Maoist Martyrs Week Police Tighten Security At Telangana And Chattisgarh Border - Sakshi

28 నుంచి మావోయిస్టు అమరవీరుల వారోత్సవాలు 

సాక్షి, హైదరాబాద్‌/వెంకటాపురం(కె): తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. సీపీఐ (మావోయిస్టు) పార్టీ ఈనెల 28వ తేదీ నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు నిర్వహించనున్న అమరుల సంస్మరణ వారోత్సవాల నేపథ్యంలో పోలీసులు ఆయా ప్రాంతాల్లో నిఘాను ముమ్మరం చేశారు. ముఖ్యంగా గోదావరి, ప్రాణహిత నది పరీవాహక ప్రాంతాల మీదుగా మావోయిస్టులు రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉండటంతో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం జిల్లాల్లో పోలీసులు అప్రమత్తమయ్యా రు. ఈ ప్రాంతాల్లో సాధారణ తనిఖీలతోపాటు సరిహద్దులు, అడవుల్లో కూంబింగ్‌ను ముమ్మరం చేశారు. కాగా గోదావరి, ప్రాణహితలు ఉధృతంగా ప్రవహిస్తున్నందున మావోయిస్టులు నదులను దాటే ప్రయత్నం చేయకపోవచ్చని పోలీసులు భావిస్తున్నారు.  

‘మావో’పోస్టర్ల కలకలం 
ములుగు జిల్లా వెంకటాపురం మండలం విజయపురి కాలనీ పరిసర ప్రాంతాల్లో ఆదివారం మావోయిస్టు పోస్టర్లు వెలిశాయి. ఈనెల 28 నుంచి ఆగస్టు 3 వరకు జరిగే మావోయిస్టు అమర వీరుల సంస్మరణ వారోత్సవాలను విజయవంతం చేయాలని అందులో పేర్కొన్నారు. ‘గ్రామ గ్రామాన వారోత్సవాలు నిర్వహించి, అమర వీరుల ఆశయాలను కొనసాగించాలి. శత్రు సాయుధ బలగాలు చేస్తున్న సమాధాన్‌ ప్రహార్‌ దాడిని ఓడిద్దాం. ప్రపంచ సోషలిస్టు విప్లవం వర్ధిల్లాలి’అని చర్ల – శబరి ఏరియా కమిటీ పేరున పోస్టర్లు వెలిశాయి. ఈ పోస్టర్ల వ్యవహారం స్థానికంగా కలకలం సృష్టిస్తోంది.  

ఛత్తీస్‌గఢ్‌లో ఎదురు కాల్పులు 
చర్ల: ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని సుకుమా జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఎదురు కాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందాడు. జిల్లా ఎస్పీ సునీల్‌ శర్మ కథనం ప్రకారం.. ఈనెల 28 నుంచి ఆగస్టు 3 వరకు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలకు మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చిన నేపథ్యంలో చింతగుఫ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోగల అటవీ ప్రాంతంలో డీఆర్‌జీ, ఎస్టీఎఫ్, సీఆర్‌పీఎఫ్‌ బలగాలు కూం బింగ్‌ ఆపరేషన్‌ చేపట్టాయి. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున పోలీసులకు తారసపడిన మావోయిస్టులు బలగాలపైకి కాల్పులు జరిపారు. పోలీసులు కూడా ఎదురు కాల్పుల కు దిగారు. ఈ ఘటనలో ఒక మావోయిస్టు మృతి చెందగా, పలువురు తప్పించుకొని పారిపోయారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top