చంపేస్తామని బెదిరిస్తున్నారు.. హైదరాబాద్‌ మేయర్‌ విజయలక్ష్మిపై ఆరోపణ 

Man Accusing HYD Mayor Vijayalakshmi Illegally Grabbing His Land - Sakshi

సాక్షి, వికారాబాద్‌: హైదరాబాద్‌ మేయర్‌ గద్వాల విజయలక్ష్మి తమ భూమిని అక్రమంగా లాక్కుంటున్నారని ఓ వ్యక్తి బుధవారం మీడియా ఎదుట ఆరోపించాడు. ఇందుకు సంబంధించి అతడి వివరాలు ఇలా ఉన్నాయి.. పూడూరు మండలం మీర్జాపూర్‌లోని సర్వే నంబర్‌ 20లో పదెకరాల భూమిని గ్రామానికి చెందిన కొనింటి వడ్డె మల్లేశ్‌ కుటుంబ సభ్యులు సాగు చేసుకుంటున్నారు. తాతల కాలం నుంచి ఈ భూమిలో తామే కబ్జాలో ఉన్నామని చెప్పాడు.

సంగారెడ్డి ప్రాంతానికి చెందిన దొరసాని రాములమ్మ నుంచి తమ పెద్దలు ఈ భూమిని కొనుగోలు చేశారన్నారు. ఇందుకు సంబంధించిన పత్రాలు సైతం ఉన్నాయని వెల్లడించాడు. 2004 వరకు సదరు భూమి కబ్జా రికార్డుల్లో తమ తాత వడ్డె ఎల్లయ్య పేరునే నమోదై ఉందని తెలిపారు. అయితే 2005లో దొరసాని సంబంధీడైన నర్సింహారెడ్డి అప్పటి తహసీల్దార్‌ సహకారంతో భూమిని తన పేరున రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నాడని ఆరోపించారు.

ఇదిలా ఉండగా ప్రస్తుతం తమ భూమి చుట్టూ పాతిన కడీలను నగర మేయర్‌ విజయలక్ష్మి దగ్గరుండి తొలగించేయిస్తున్నారని, అడిగితే చంపేస్తామని గన్‌తో బెదిరిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కూడా వారికి వత్తాసు పలుకుతున్నారని వాపోతున్నారు. ఇదిలా ఉండగా పరిగి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి సదరు భూమిని పరిశీలించి వెళ్లినట్లు సమాచారం. ఈ విషయమై మేయర్‌ విజయలక్ష్మిని వివరణ అడిగేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు. 
చదవండి: పుల్లారెడ్డి స్వీట్స్‌ అధినేత కోడలి మెయిల్‌కు రిప్లై ఇచ్చిన రాష్ట్రపతి భవన్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top