Malabar Group: తెలంగాణలో భారీ పెట్టుబడి

Malabar Group To Invest 750 Crore in Telangana - Sakshi

రాష్ట్రంలో గోల్డ్‌ రిఫైనరీ

రూ.750 కోట్లతో ఏర్పాటు చేయనున్న ‘మలబార్‌’ ఆభరణాల సంస్థ

2,500మందికిపైగా నైపుణ్యం కలిగిన స్వర్ణకారులకు ఉపాధి 

సాక్షి, హైదరాబాద్‌: ఆభరణాల రంగంలో అంతర్జాతీయంగా పేరొందిన దేశీయ దిగ్గజసంస్థ మలబార్‌ గ్రూప్‌ తెలంగాణలో భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. రూ.750 కోట్లతో బంగారు, వజ్రాభరణాల తయారీ ఫ్యాక్టరీ, గోల్డ్‌ రిఫైనరీ యూనిట్లను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. రాష్ట్రంలో నైపుణ్యం కలిగిన సుమారు 2,500 మంది స్వర్ణకారులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపింది. మలబార్‌ గ్రూప్‌ అధినేత ఎంపీ అహ్మద్‌తో కూడిన ప్రతినిధి బృందం బుధవారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్‌తో భేటీ అయింది. రాష్ట్రంలో వ్యాపార అనుకూలతలు, నాణ్యమైన మానవ వనరులు అందుబాటులో ఉండటంతో భారీ పెట్టుబడులు పెట్టాలని నిర్ణయిం చినట్లు అహ్మద్‌ వెల్లడించారు.

మలబార్‌ గ్రూప్‌నకు ప్రపంచవ్యాప్తంగా 260 స్టోర్లు ఉన్నాయని, రాష్ట్రంలో తమసంస్థ పెట్టుబడుల ద్వారా ఆభరణాల తయారీ రంగం మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సులభతర వాణిజ్యానికి అనుకూలమైన విధానాలు ఉన్నం దున వివిధ రంగాలకు చెందినవారు భారీ పెట్టుబడులతో రాష్ట్రానికి వస్తున్నారని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఈ నేపథ్యంలోనే మలబార్‌ గ్రూప్‌ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిందంటూ హర్షం వ్యక్తం చేశారు. అద్భుతమైన కళానైపుణ్యం కలిగిన స్వర్ణకారులు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నారని, వీరి నైపుణ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మరింత మందికి ఉపాధి కల్పించాలని కోరారు. ప్రభుత్వపరంగా బంగారు, వజ్రాభరణాల తయారీ రంగానికి అన్ని విధాలా సహకరిస్తామని ప్రతినిధి బృందానికి హామీ ఇచ్చారు. ఈ భేటీలో ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్‌ పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top