
భగవద్గీత పారాయణంలో ప్రతిభ
ఏడాది శ్రమతో బంగారు పతకం సాధించిన తోటికోడళ్లు
ముస్తాబాద్ (సిరిసిల్ల): మామ ఆలపించే భక్తిగీతాలు వారికి ప్రేరణనిచ్చాయి. భజనలు వారిలో స్ఫూర్తినింపాయి. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో ఏడాదిలోనే భగవద్గీతలోని 18 అధ్యాయాల్లో 700 శ్లోకాలను కంఠస్థం చేయడమే కాకుండా మైసూరులోని శ్రీదత్త పీఠం ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన భగవద్గీత పారాయణ పోటీల్లో ఏకంగా 20 వేల మందితో పోటీపడి బంగారు పతకాలు సాధించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం ఆవునూర్ గ్రామానికి చెందిన తోటి కోడళ్లు కట్కం లక్ష్మి, కట్కం విజయలక్ష్మిల స్ఫూర్తిదాయక ఆధ్యాత్మిక ప్రయాణం ఇది.
భజన మండలి, మామయ్య స్ఫూర్తి
కట్కం లక్ష్మి, కట్కం విజయలక్ష్మి 30 మంది స్నేహితులతో కలిసి 20 ఏళ్ల క్రితం శ్రీ వేంకటేశ్వర భజన మండలిని ఏర్పాటు చేసుకున్నారు. ఆవునూర్ గ్రామంలోని రామాలయంతోపాటు ఇళ్లలో జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భజనలు చేసేవారు. లక్ష్మి, విజయలక్ష్మిల మామయ్య కట్కం రాజేశం నిత్యం భక్తిగీతాలు ఆలపించేవారు. ఈ క్రమంలో హైదరాబాద్‌కు చెందిన కొట్ర అనురాధతో ఏర్పడిన పరిచయం ఆన్‌లైన్‌లో శిక్షణ తీసుకొనేలా చేసింది.
ఇటీవల మైసూరులోని శ్రీదత్తపీఠం ఆధ్వర్యంలో ఆన్‌లైన్ ద్వారా 20 వేల మందితో నిర్వహించిన భగవద్గీత శ్లోకాల పారాయణం పోటీల్లో పాల్గొన్న లక్ష్మి, విజయలక్ష్మి తమ ప్రతిభను చాటి ఫైనల్‌కు చేరుకున్నారు. ఈ నెల 19న 2 వేల మందికి జరిగిన ఆన్‌లైన్ ఫైనల్ పోటీల్లో విజేతలుగా ఎంపికైన 500 మందిలో వారిద్దరూ నిలిచారు. దత్త పీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానందస్వామి చేతుల మీదుగా లక్ష్మి, విజయలక్ష్మి బంగారు పతకాలు, ప్రశంసా పత్రాలు అందుకున్నారు.
శ్లోకాలకు తాత్పర్యం చెబుతాం
భగవద్గీత పారాయణాన్ని జీవిత లక్ష్యంగా పెట్టుకున్నా. భర్త, పిల్లల సహకారంతో ఏడాదిపాటు సాధన చేశా. అనురాధ మేడం మమ్మల్ని గుర్తించి మా బృందంలోని 10 మందికి శిక్షణ ఇచ్చారు. భవిష్యత్‌లో శ్లోకాలకు అర్థాలు చెప్పి, భగవద్గీత మహత్మ్యాన్ని పంచుతాం. – కట్కం లక్ష్మి
భజన మండలితో అంకురార్పణ
మా భజన మండలి సభ్యులు, ఆన్‌లైన్‌లో శిక్షణ ఇచి్చన అనురాధ మేడం ప్రోత్సాహంతోనే పతకాలు సాధించాం. భవిష్యత్‌లో మరింత మందికి శ్లోకాలను నేర్పి భగవద్గీత గొప్పదనాన్ని పంచుతాం. – కట్కం విజయలక్ష్మి