‘పార్లమెంట్‌’ సన్నాహాలతో..బీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో చైతన్యం | Sakshi
Sakshi News home page

‘పార్లమెంట్‌’ సన్నాహాలతో..బీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో చైతన్యం

Published Sun, Jan 28 2024 9:21 AM

Lack of political momentum BRS Party - Sakshi

సాక్షి, హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ పరిధిలోని బీఆర్‌ఎస్‌ శ్రేణులు విచిత్ర పరిస్థితుల్లో ఉన్నాయి. గ్రేటర్‌లోని 24 అసెంబ్లీ నియోజకవర్గాలకుగాను 16 స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులే గెలిచినా, అంతటా ఉన్నది తమ ఎమ్మెల్యేలే అయినా రాజకీయంగా ఊపు లేక ఉనికిపైనే అనుమానాలు నెలకొనే పరిస్థితులేర్పడ్డాయి. అందుకు కారణం నగరంలో  బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు భారీ మెజారీ్టలతో గెలిచినప్పటికీ పార్టీ అధికారంలోకి రాకపోవడమే. పార్టీ అధికారంలోకి వస్తే తమకు నామినేటెడ్‌ పోస్టులు దక్కగలవని ఎన్నో ఆశలు పెట్టుకొని ఎదురు చూసిన వారు డీలా పడ్డారు. గ్రేటర్‌ నగరంలో ఎమ్మెల్యేలతో పాటు దాదాపు 60 మంది కార్పొరేటర్లు బీఆర్‌ఎస్‌ వారే అయినా పార్టీ శ్రేణుల్లో గెలుపు ఉత్సాహమే కనిపించలేదు. 

మరోవైపు ఎంతమంది కార్పొరేటర్లు  ఇతర పారీ్టల్లోకి వెళ్తారోననే చర్చలు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలో పార్లమెంట్‌ ఎన్నికల సన్నాహక చర్యల్లో భాగంగా అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా పార్టీ కార్యకర్తలతో విస్తృతస్థాయి సమావేశాలు శనివారం నుంచి ప్రారంభమయ్యాయి. తొలి రోజు జరిగిన జూబ్లీహిల్స్‌ నియోజకవర్గ సమావేశానికి హాజరైన మాజీ మంత్రి, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారకరామారావు పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు. జిల్లాల్లో గెలిచిన కాంగ్రెస్‌ పార్టీ చాలా ప్రాంతాల్లో స్వల్ప మెజారిటీతో మాత్రమే గెలిచిందని, గ్రేటర్‌లో గెలిచిన మన ఎమ్మెల్యేలు భారీ మెజారీ్టతో గెలిచారంటూ వారికంటే మన బలమే ఎక్కువన్నారు. 

త్వరలో జరగబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో సికింద్రాబాద్‌ నియోజకవర్గంలో మన పార్టీ అభ్యరి్థని భారీ మెజారీ్టతో గెలిపించాలని పిలుపునిచ్చారు. అలా జరిగితేనే మనమంటే  కాంగ్రెస్‌కు భయం ఉంటుందని, మన బలం తగ్గలేదని తెలుస్తుందని అన్నారు. మనకు అధికారం లేకపోవడం తాత్కాలిక బ్రేక్‌ మాత్రమేనని, ప్రజాభిమానం మనకే మెండుగా ఉందని పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపడంతో కార్యకర్తల్లో కొంత ఊపు కనిపించింది.  

జీహెచ్‌ఎంసీలో ఏం జరగనుంది? 
ఇదిలా ఉండగా జీహెచ్‌ఎంసీలో పరిస్థితులు ఎలా మారనున్నాయో అంతుపట్టడం లేదు. పోటీ చేసినప్పుడు అధికార పార్టీ అభ్యర్థులుగా గెలిచారు. ఇప్పుడు బీఆర్‌ఎస్‌ రాష్ట్రంలో ప్రతిపక్షంగా మారింది. మూడు నెలలకోమారు జరగాల్సిన సర్వసభ్య సమావేశాలు ఆగస్టు తర్వాత ఇంతవరకు తిరిగి జరగలేదు. అంతేకాదు, పదవీకాలం ముగిసిపోయిన స్టాండింగ్‌ కమిటీకి సైతం కొత్త కమిటీ ఎన్నిక కాలేదు.

 కొత్త ఆరి్థక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ తొలుత స్టాండింగ్‌ కమిటీ సమావేశంలో, తర్వాత సర్వసభ్య సమావేశంలో ఆమోదం పొందాక ప్రభుత్వానికి పంపించాల్సి ఉండగా, ఇప్పటి వరకు ఏ సమావేశమూ జరగలేదు. సంప్రదాయానికి భిన్నంగా జీహెచ్‌ఎంసీ పాలకమండలి ఆమోదం పొందకుండానే అధికారులే నేరుగా ప్రభుత్వానికి పంపిస్తారా ?అనే అనుమానాలు సైతం నెలకొన్నాయి. ఏం చేయనున్నారనేదానిపై అధికారులు కూడా ఏమీ చెప్పలేకపోతున్నారు. మొత్తానికి ప్రభుత్వమార్పుతో జీహెచ్‌ఎంసీలోనూ విచిత్ర పరిస్థితులేర్పడ్డాయి.   

Advertisement
 
Advertisement