
‘తెలంగాణ తల్లి’ బోర్డు తెర తీశారు
సాక్షి, హైదరబాద్: తెలంగాణ తల్లి ఫ్లై ఓవర్ బోర్డుకు సంబంధించి జీహెచ్‌ఎంసీ తీరు ప్రజలకు అంతుచిక్కడం లేదు. ఫ్లై ఓవర్ ఒకవైపు (పాత సచివాలయం వైపు) ప్రవేశ మార్గంలో గత మంగళవారం ప్రజలకు దర్శనమిచ్చిన బోర్డును సాయంత్రానికి అక్షరాలు కనిపించకుండా తెర వేశారు. తెలుగుతల్లిగా ఉన్న పేరును తెలంగాణ తల్లిగా మార్చడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న తరుణంలో జీహెచ్‌ఎంసీ చేసిన ఆ పనితో పలు సంశయాలు వెల్లువెత్తాయి.
సోషల్‌మీడియాలో వైరల్‌గా మారడంతో ఫ్లై ఓవర్ రెండో వైపు(లోయర్‌ట్యాంక్‌బండ్) ప్రవేశమార్గంలో కూడా బోర్డు ఏర్పాటు చేశాక రెండింటినీ కలిపి ఒకేసారి ప్రారంభిస్తామని జీహెచ్‌ఎంసీ బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. రెండు రోజుల్లో రెండింటినీ కలిపి ఒకేసారి ప్రారంభిస్తామని పేర్కొంది. కానీ.. రెండో వైపు బోర్డు ఏర్పాటు కాకుండానే సచివాలయం వైపు బోర్డుకు వేసిన తెరను తొలగించి, తిరిగి అక్షరాలు కనిపించేలా చేసింది.
ఇంతమాత్రానికి ఈ తతంగమంతా ఎందుకు? అన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. తొలుత ఒకవైపు మాత్రమే ఏర్పాటు చేస్తే ఎవరైనా కాదన్నారా? ఎందుకు మూసేశారు? రెండోవైపు ఏర్పాటు కాకున్నా మళ్లీ ఎందుకు తెర తీశారు? రెండూ ఒకేసారి ప్రారంభిస్తామని ఎందుకు ప్రకటించారు? అంటూ పలువురు జీహెచ్‌ఎంసీ చర్యల్ని తప్పుపడుతున్నారు.