ఎంట్రీ, ఎగ్జిట్‌ల వద్ద రాకపోకలతోనే..
ఎడ్జ్ బేస్డ్ ఏఐ ఆధారిత అధునాతన సాంకేతికత
పనితరుతోనే వేతనాల చెల్లింపులు
సాక్షి,హైదరాబాద్: జీహెచ్‌ఎంసీలోని బోగస్ ఉద్యోగులను, బోగస్ హాజరును అరికట్టడంతోపాటు ఎవరెవరు ఏ సమయానికి కార్యాలయాలకు వస్తున్నారు..ఎప్పుడు వెళ్తున్నారు? తదితర అంశాలను ఆటోమేటిక్‌గానే తెలుసుకునేందుకు జీహెచ్‌ఎంసీ సిద్ధమైంది. ఇందుకుగాను ఉద్యోగుల ఫేస్ రికగి్నషన్ హాజరుకు మరింత సాంకేతికత జోడించి జీహెచ్‌ఎంసీ అన్ని జోనల్, సర్కిల్ కార్యాలయాల్లో అమలు చేసేందుకు నిర్ణయించారు. తద్వారా రికార్డుల్లో లేకుండానే వేతనాలు కాజేస్తున్న వారిని గుర్తించడం ద్వారా జీహెచ్‌ఎంసీ ఆదాయానికి గండికొడుతున్న దొంగల భరతం పట్టనున్నారు. మరోవైపు ఇష్టానుసారం వచ్చి పనులు చేయకున్నా, కార్యాలయాల్లో ఉండకున్నా వేతనాలు పొందుతున్న వారి ఆటలు ఆగిపోనున్నాయి.
ఇందుకుగాను జీహెచ్‌ఎంసీలోని 6 జోనల్, 30 సర్కిల్ కార్యాలయాల్లో ఎడ్జ్ బేస్డ్ ఏఐ ఆధారిత హాజరు నమోదు విధానాన్ని అందుబాటులోకి తేనుంది. ఈ విధానం వల్ల ఉద్యోగులు ఫేస్ రికగి్నషన్ హాజరు కోసం ఎక్కడా ఆగాల్సిన పనిలేదు. ఒకసారి ఉద్యోగి తన పేరు, ఐడీ నెంబరు, పనిచేస్తున్న విభాగం, హోదా తదితర వివరాలతో రిజిస్ట్రేషన్ చేసుకుంటే కార్యాలయంలోకి సాధారణంగా నడుస్తూ వచ్చే సమయంలోనే ఎంట్రీ వద్ద, వెళ్లేటప్పుడు ఎగ్జిట్ వద్ద ఆటోమేటిక్‌గానే ఫేస్ రికగి్నషన్‌తో హాజరు నమోదు కానుంది. అందుకోసం ఆగాల్సిన పనిలేదు. ఆమేరకు ప్రత్యేకంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తారు. తొలుత ఎంట్రీ వద్ద వచ్చిన సమయాన్ని ఎగ్జిట్ వద్ద చివరగా వెళ్లిన సమయాన్ని ప్రాతిపదికన ఎన్నిగంటలు కార్యాలయంలో ఉన్నదీ తెలుసుకోగలుగుతారు.
ఉద్యోగి ఎన్నిగంటలు పనిచేసిందీ రంగుల కోడ్‌తో విశ్లేషిస్తారు. అందుకుగాను 6 గంటలు అంతకంటే ఎక్కువ సేపు పనిచేసేవారికి గ్రీన్ కలర్, 5–6 గంటలు పనిచేసే వారికి ఆరెంజ్, 5 గంటలు, అంతకంటే తక్కువ పనిచేసే వారికి రెడ్ కలర్, దీర్ఘకాలం సెలవులో ఉండేవారికి యాష్ కలర్ సూచిస్తాయి. తద్వారా వారి పనితీరును బట్టే వేతనాల చెల్లింపులు సైతం చేయనున్నారు. తద్వారా పారదర్శకత, ఉద్యోగుల బాధ్యత, సమర్థత పెంచేందుకు ఉపకరించగలదని భావిస్తున్నారు.
ఈ వ్యవస్థ ద్వారా..
ఉద్యోగులు నడుచుకుంటూ వెళ్లే సమయంలోనే హాజరు నమోదు అవుతుంది.
జీహెచ్‌ఎంసీ హెచ్‌ఆర్‌ఎంఎస్, పేరోల్ వ్యవస్థలతో అనుసంధానం.
ఇంటర్నెట్ ఉన్నా, లేకున్నా పనిచేసే విధానం.
జీహెచ్‌ఎంసీ అన్ని కార్యాలయాల హాజరు డేటాను ఒకే డాష్‌బోర్డ్‌లో వీక్షించే అవకాశం.
జోన్ల వారీగా రంగుల కోడ్‌తో పనితీరు విశ్లేషణ.
మానవ తప్పిదాలు, హాజరు నివేదికల్లో ఆలస్యానికి తావుండదు.
మొబైల్, టాబ్లెట్ ఫోన్‌లతో పనిలేదు. రియల్‌టైమ్ హాజరు నమోదవుతుంది.
నగర పాలనలో ఆధునీకరణకు ఏఐ వినియోగం, స్మార్ట్ గవర్నెన్స్ అమలు కోసం జీహెచ్‌ఎంసీ ఇందుకు సిద్ధమైంది.
రియల్‌టైమ్ పర్యవేక్షణ
ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో అమలవుతున్న ఫేస్ రికగి్నషన్ అటెండెన్స్ కంటే ఆధునిక సాంకేతికతతో పనిచేసే ఈ ‘ఎడ్జ్ బేస్డ్ ఫేషియల్ రికగి్నషన్ అటెండెన్స్ మేనేజ్‌మెంట్ సిస్టమ్’ కోసం జీహెచ్‌ఎంసీ టెండర్లను ఆహా్వనించింది. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంతో సహ అన్ని జోనల్, సర్కిల్ కార్యాలయాలకు ఒకే సురక్షిత వెబ్ యూఆర్‌ఎల్‌తో డ్యాష్‌బోర్డు పనిచేసేలా ఉండాలని కోరింది. తద్వారా జీహెచ్‌ఎంసీ అన్ని కార్యాలయాల్లోని ఉద్యోగులు, సిబ్బంది హాజరును ప్రధాన కార్యాలయంలోని ఉన్నతాధికారులు రియల్‌టైమ్‌లో చూడగలుగుతారు.


