బఫర్ జోన్‌లోని మంత్రుల ఇళ్లను వదిలేసి పేదల ఇళ్లు కూల్చుతున్నారు
బడ్జెట్ పద్దులపై చర్చలో ప్రభుత్వాన్ని ప్రశ్నించి కేటీఆర్ .. ఆరోపణలను తోసిపుచ్చిన మంత్రి శ్రీధర్‌బాబు
సాక్షి, హైదరాబాద్: మూసీ అభివృద్ధి ప్రాజెక్టు డీపీఆర్ సిద్ధంగా ఉంటే శాసనసభ ముందు ఉంచాలని బీఆర్‌ఎస్ సభ్యుడు కేటీఆర్ డిమాండ్ చేశారు. బడ్జెట్ పద్దులపై గురువారం అర్ధరాత్రి శాసనసభలో నిర్వహించిన చర్చలో ఆయన మాట్లాడారు. ప్రాజెక్టు డీపీఆర్ ఉందని మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొనడంపై ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు వ్యయం రూ.1.5 లక్షల కోట్లు ఉంటుందని సీఎం రేవంత్‌రెడ్డి గతంలో ప్రకటించగా, తొలి విడత ప్రాజెక్టు వ్యయం రూ.6–7వేల కోట్లుగా మంత్రి శ్రీధర్‌బాబు ఎలా పేర్కొంటారని ప్రశ్నించారు.
ప్రాజెక్టు వ్యయం రూ.లక్షన్నర కోట్లు అని సీఎం నాలుగుసార్లు ప్రకటించారని, మంత్రి శ్రీధర్‌బాబు డీపీఆర్‌ను సభలో పెట్టకుండా దాచిపెడుతున్నారని ఆరోపించారు. డీపీఆర్ విలువ రూ.50 వేల కోట్లు ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. మూసీ బఫర్ జోన్ 50 మీటర్లు అని చెప్పి 5 కిలోమీటర్ల అవతల వరకు భూముల సేకరణకు ఎందుకు నోటీసులు ఇస్తున్నారు అని నిలదీశారు. చట్టం అంటే పేదలకు భూతం..పెద్దలకు వరం అన్న రీతిలో ప్రభుత్వం వ్యవహరిస్తోందని ..బఫర్ జోన్‌లో ఉన్న మంత్రుల ఇళ్లను వదిలేసి పేదల ఇళ్లను కూల్చుతా అంటోందని ఆరోపించారు.
శంషాబాద్ విమానాశ్రయానికి మెట్రో రైలు ప్రాజెక్టును రద్దు చేసి నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీ సీఎఫ్‌ఓను అరెస్టు చేస్తామని బెదిరించారని తప్పుబట్టారు. ఎల్‌అండ్‌టీ పైన, ఆ సంస్థ కట్టిన మేడిగడ్డ బరాజ్‌పైన కక్ష గట్టారని విమర్శించారు. ఎల్‌అండ్‌టీకి లీజు మీద ఇచ్చిన 280 ఎకరాల స్థలంపై కొందరు పెద్దలు కన్నేసి ఈ పనులు చేశారని ఆరోపించారు. ఫార్మా సిటీకి బీఆర్‌ఎస్ ప్రభుత్వం 14 వేల ఎకరాలను మాత్రమే సేకరించగా, ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టును 30 వేల ఎకరాల్లో నిర్మిస్తున్నట్టు మంత్రి శ్రీధర్ ప్రకటించడాన్ని కేటీఆర్ ప్రస్తావించారు.
మిగిలిన 16 వేల ఎకరాలు ఎక్కడి నుంచి వస్తున్నాయని ప్రశ్నించారు. కేటీఆర్ ఆరోపణలను మంత్రి శ్రీధర్‌బాబు తోసిపుచ్చారు. మూసీ ప్రాజెక్టు డీపీఆర్‌ను సిద్ధం చేసి ఏసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ వెట్టింగ్ కోసం సమర్పించామని, వెట్టింగ్ పూర్తయిన వెంటనే ఆన్‌లైన్‌లో బహిరంగపరుస్తామన్నారు.
పద్దులపై చర్చిస్తుంటే ఆటల పోటీలా? అత్యంత కీలకమైన పద్దులపై అసెంబ్లీలోచర్చలు జరుగుతున్న తరుణంలో ఎమ్మెల్యేలకు ఆటల పోటీలు నిర్వహించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని కేటీఆర్ తప్పుబట్టారు. అసెంబ్లీ లాబీల్లో విలేకరులతో ఆయన మాటాడారు. ఈ విషయాన్ని మంత్రి శ్రీధర్ బాబు దృష్టికి తీసుకెళ్లగా ఆయన వద్ద ఎలాంటి సమాధానం లేదని ఎద్దేవా చేశారు.


