శివలింగాన్ని తాకిన సూర్యకిరణాలు
వెంకటాపురం(ఎం): ములుగు జిల్లా వెంకటాపురం(ఎం) మండలంలోని రామప్ప దేవాలయంలో అద్భుతం చోటుచేసుకుంది. గురువారం ఉదయం 6.30 గంటలకు గర్భగుడిలోని శివలింగాన్ని సూర్యకిరణాలు తాకాయి. సహజసిద్ధమైన వెలుతురులోనే కాంతివంతంగా దర్శనమిచ్చే రామలింగేశ్వరస్వామిపై సూర్యకిరణాలు పడటంతో గర్భగుడి మరింత కాంతివంతంగా కళకళలాడింది.
శివలింగంపై పడుతున్న సూర్యకిరణాలను చూసి భక్తులు అనుభూతికి లోనయ్యారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రామప్ప ఆలయ ప్రధాన పూజారి కోమల్లపల్లి హరీశ్ శర్మ మాట్లాడుతూ.. ఏటా ఏదో ఒక మాసంలో శివలింగంపై సూర్యకిరణాలు రెండు నుంచి మూడు రోజులు పడతాయని వెల్లడించారు. కాకతీయుల కాలంలోనే శివలింగంపై సూర్యకిరణాలు పడేలా రామప్ప ఆలయాన్ని నిర్మించారని తెలిపారు.


