బీసీలను నమ్మించి మోసగించొద్దు | BRS Deputy Floor Leader Talasani Srinivas Yadav in the debate on the BC bill | Sakshi
Sakshi News home page

బీసీలను నమ్మించి మోసగించొద్దు

Mar 27 2026 3:33 AM | Updated on Mar 27 2026 3:33 AM

BRS Deputy Floor Leader Talasani Srinivas Yadav in the debate on the BC bill

బీసీ పద్దుపై చర్చలో బీఆర్‌ఎస్‌ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్‌ తలసాని శ్రీనివాస్‌యాదవ్‌  

జాతీయస్థాయిలో బీసీల గురించి మాట్లాడిన నాయకుడు రాహుల్‌ అంటూ మంత్రులు శ్రీధర్‌బాబు, శ్రీహరి కౌంటర్‌ 

సాక్షి, హైదరాబాద్‌: బీసీలను నమ్మించి మోసగించొద్దని, 42శాతం రిజర్వేషన్‌ సహా అన్ని హామీలను అమలు చేయాలని బీఆర్‌ఎస్‌ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్‌ తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. గురువారం అసెంబ్లీలో బీసీ పద్దుపై చర్చలో ఆయన మాట్లాడారు. కామారెడ్డి డిక్లరేషన్‌లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ ఇస్తామన్నారని, హామీ అమలు బాధ్యత కాంగ్రెస్‌పై ఉందన్నారు. కులగణన పారదర్శకంగా జరపలేదని, భూసాని కమిషన్‌ రిపోర్ట్‌ నేటి వరకు పబ్లిక్‌ డొమెన్‌లో పెట్టలేదని తలసాని అన్నారు. 

ఢిల్లీలో కాంగ్రెస్‌ పార్టీ ముఖ్యమంత్రి, మంత్రులు ధర్నా చేస్తే ఆ పార్టీ అగ్ర నాయకత్వం హాజరు కాలేదని చెప్పారు. బీసీ బిల్లుకు చట్టబద్ధత కోసం ఆల్‌ పార్టీ ప్రతినిధులను ఢిల్లీ తీసుకెళ్లలేదన్నారు. 42 శాతం రిజర్వేషన్‌ కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉందని చెబుతున్నారని విమర్శించారు. బీసీ సబ్‌ప్లాన్‌ ఎందుకు పెట్టలేదని, మంత్రివర్గంలో బీసీలకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. బీసీలకు బడ్జెట్‌లో సంవత్సరానికి రూ. 20 వేల కోట్లు కేటాయిస్తామన్న హామీ ఏమైందన్నారు. కీలక పోస్టులలో బీసీలను తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని విమర్శించారు. 

తలసాని మాట్లాడుతుండగా..మంత్రులు శ్రీధర్‌బాబు, వాకిటి శ్రీహరి కలుగజేసుకున్నారు. కాంగ్రెస్‌ పార్టీలో బీసీ నాయకులకు ఎంతో ప్రాధాన్యం ఉందని, జాతీయ స్థాయిలో బీసీల అంశాన్ని మాట్లాడిన నాయకుడు రాహుల్‌గాంధీ అని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. బీసీలకు రాజకీయ ప్రాధాన్యం దక్కాలని మల్లికార్జున ఖర్గే, రా హుల్‌గాం«దీలు తమ వైఖరిని ఇప్పటికే స్ప ష్టం చేశారని, వారిచ్చిన మనోధైర్యంతోనే తాము చట్టసభల్లో బీసీ రిజర్వేషన్ల అంశంపై ధీమాగా మాట్లాడుతున్నామన్నారు. రిజర్వేషన్ల సాధనలో అంతా కలిసి రావాలని కోరారు.  

హైడ్రాతో అరాచకాలు సృష్టిస్తున్నారు : వివేకానంద  
రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాతో అరాచకాలు సృష్టిస్తోందని, ఉన్న వారికి ఒక న్యాయం..పేదవారికి ఒక న్యాయం అన్నట్టుగా హైడ్రా పనితీరు ఉందని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఆరోపించారు. హైడ్రా కమిషనర్‌ ప్రజాప్రతినిధుల ఫోన్లు సైతం మాట్లాడడం లేదని, మంత్రులను కలవొచ్చు కానీ, హైడ్రా అధికారిని కలిసే పరిస్థితి లేదన్నారు. ఎంఏయూడీ పద్దులపై చర్చలో వివేకానంద మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మూడు జోన్లు శాస్త్రీయంగా లేవని, భవిష్యత్‌లో ఇబ్బందులు తప్పవన్నారు. 

ఫ్యూచర్‌ సిటీ కేవలం ఇన్‌సైడ్‌ ట్రేడింగ్, రియల్‌ ఎస్టేట్‌ దందా కోసమేనని ఆరోపించారు. ఇదే పద్దుపై చర్చలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్‌ నగర అస్థిత్వానికి వెన్నెముకగా కాంగ్రెస్‌ పార్టీ విధానాలు నిలిచాయన్నారు. కాంగ్రెస్‌ ముఖ్యమంత్రుల హయాంలోనే హైదరాబాద్‌ నగర అభివృద్ధిలో ఎన్నో మైలురాళ్లు నమోదయ్యాయని చెప్పారు. నగర అభివృద్ధి, మూసీ అభివృద్ధితో ముడిపడి ఉందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దూరదృష్టితోనే ఫ్యూచర్‌ సిటీకి అంకురార్పణ చేశారన్నారు. హైదరాబాద్, తెలంగాణను గ్లోబల్‌ డెస్టినేషన్‌గా చేయడమే కాంగ్రెస్‌ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement