సీఎస్‌ఆర్‌ నిధులపై ప్రత్యేక పాలసీ | Special policy on CSR funds | Sakshi
Sakshi News home page

సీఎస్‌ఆర్‌ నిధులపై ప్రత్యేక పాలసీ

Mar 27 2026 3:20 AM | Updated on Mar 27 2026 3:20 AM

Special policy on CSR funds

సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం 

సమీకరణ, సమర్థ వినియోగమే లక్ష్యం 

ఉత్తమ కార్పొరేట్‌ సంస్థలకు ఏటా సత్కారం 

సాక్షి, హైదరాబాద్‌: కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ (సీఎస్‌ఆర్‌) నిధుల సమీకరణతో పాటు వాటి సమర్థ వినియోగానికి ప్రత్యేక పాలసీ రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సీఎస్‌ఆర్‌ నిధులతో రాష్ట్రంలో అభివృద్ధి, ప్రజోపయోగ కార్యక్రమాలు చేపడుతున్న సంస్థలను ప్రభుత్వం తరఫున అభినందించాలని సూచించారు. ప్రతి ఏడాది అత్యుత్తమ భాగస్వామ్యం చూపిన సంస్థల ప్రతినిధులను సత్కరించేందుకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాలని, రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా ఈ అభినందన ఉత్సవాన్ని నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. 

రాష్ట్ర స్థాయిలో సీఎస్‌ఆర్‌ సెల్‌ ఏర్పాటు చేయడంతో పాటు ప్రత్యేక కార్యాలయం ప్రారంభించాలనే నిర్ణయం తీసుకున్నారు. ఈ సెల్‌ ద్వారా కార్పొరేట్‌ సంస్థలు చేపడుతున్న కార్యక్రమాలు, ప్రభుత్వ విభాగాల్లో అందుబాటులో ఉన్న ప్రాజెక్టులు, సీఎస్‌ఆర్‌ ద్వారా చేపట్టదగిన కార్యక్రమాల వివరాలన్నింటిని సమన్వయం చేస్తారని సీఎం వివరించారు. సీఎఎస్‌ ఆర్‌ నిధులపై గురువారం ఆయన సమీక్ష నిర్వహించారు. 

ప్రత్యేక సీఎస్‌ఆర్‌ పోర్టల్‌కు రూపకల్పన 
ప్రభుత్వ, కార్పొరేట్‌ సంస్థల మధ్య అనుసంధానాన్ని బలోపేతం చేయడానికి ప్రత్యేక తెలంగాణ సీఎస్‌ఆర్‌ పోర్టల్‌ రూపొందించాలని సీఎం ఆదేశించారు. ఈ పోర్టల్‌లో సీఎస్‌ఆర్‌ విరాళాలు అందించేందుకు, వివిధ విభాగాల పరిధిలో అమలు చేయదగిన ప్రాజెక్టుల వివరాలను సమగ్రంగా పొందుపరచాలని సూచించారు. 

జాతీయ స్థాయిలో సీఎస్‌ఆర్‌ నిధుల్లో తెలంగాణకు కేవలం 3 శాతం వాటా మాత్రమే ఉందని అధికారులు నివేదించగా, రాష్ట్రంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీలు ఇతర ప్రాంతాల్లో సీఎస్‌ఆర్‌ ఖర్చు చేయడం సరికాదని సీఎం వ్యాఖ్యానించారు. ఇతర రాష్ట్రాల విధానాలను అధ్యయనం చేసి, తెలంగాణకు మరిన్ని సీఎస్‌ఆర్‌ నిధులు రాబట్టేలా కొత్త పాలసీ రూపొందించాలని, కార్పొరేట్‌ సంస్థలను ఆకర్షించే చర్యలు తీసుకోవాలని సూచించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement