‘కోత’ల డ్రామాలతో సమస్య గట్టెక్కగలరా? | Kommineni Srinivasa Rao Comments On Yellow Media | Sakshi
Sakshi News home page

‘కోత’ల డ్రామాలతో సమస్య గట్టెక్కగలరా?

Apr 28 2026 11:09 AM | Updated on Apr 28 2026 12:02 PM

 Kommineni Srinivasa Rao Comments On Yellow Media

తెలంగాణలో మంత్రుల జీతాలు సగానికి కోశారు. రాజకీయ డ్రామానా? ఆదర్శంగా నిలిచే ప్రయత్నమా? ఎమ్మెల్యేల జీతాల్లోనూ కోతలు పెట్టి తద్వారా మిగిలిన డబ్బును రిటైర్డ్‌ ఉద్యోగుల బకాయిలు చెల్లించేందుకు వాడతారని సమాచారం. మామూలుగానైతే ఈ చర్యలను అందరూ ప్రశంసించాల్సిందే కానీ... రిటైర్డ్‌ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు, ఎమ్మెల్యేల జీతాల్లో కోతతో మిగిలే డబ్బును పరిగణలోకి తీసుకుంటే దీన్ని డ్రామా అనే అనాల్సి వస్తుంది. బకాయేమో కొండంత.. మిగిలేది పిసరంత మాత్రమే మరి. దేశంలోని పలు రాష్ట్రాలు ఇప్పుడు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, హిమాచల్‌ ప్రదేశ్‌ వంటి చోట్ల అప్పు చేయకపోతే రోజు గడవని స్థితి. అదే సమయంలో అధికారం కోసం ఇచ్చిన అడ్డమైన హామీల అమలు బరువూ ఆయా ప్రభుత్వాలపై పడుతోంది. 

ప్రజలను ఏమార్చి అధికారం సాధించిన తర్వాత అనేక పిల్లిమొగ్గలు వేయాల్సి వస్తోంది. తెలంగాణలో రిటైర్డ్, సాధారణ ఉద్యోగులకు ప్రభుత్వం చెల్లించవలసిన బకాయి సుమారు రూ.14 వేల కోట్లు మంత్రులు, ఎమ్మెల్యేల జీతాలు నెలకు రూ.పది కోట్లు కూడా కాకపోవచ్చు. ఇందులో సగం ఆపుకుని ఉద్యోగులకు చెల్లిస్తామని చెబితే హాస్యాస్పదం అనిపించదా? పోనీ వీరు పూర్తిగా తమ జీతాలు తగ్గించుకుంటే అది వేరే విషయం. అభినందించవచ్చు. కాని హిమాచల్ ప్రదేశ్ లో ముఖ్యమంత్రి, మంత్రులు, ఉన్నతాధికారుల జీతాలు ఆరు నెలలపాటు సగం తీసుకకోకుండా ఆగుతారట. అంటే ఆ తర్వాత మొత్తం బకాయిలతోసహా తీసుకుంటారనే కదా?. ఏపీలో తెలుగుదేశం తరపున భజన చేసే ఎల్లో మీడియాకు అక్కడి ప్రభుత్వం ఒక  లీకు ఇచ్చింది. హిమాచల్‌లో మాదిరి సంక్షోభం రాకుండా ఉండాలంటే ఆర్థిక క్రమశిక్షణ అవసరమని ఆ మీడియా పేర్కొంది. 

 ఇందుకోసం ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, సంక్షేమ స్కీములలో అనర్హుల ఏరివేత, దుబారా వ్యయం నియంత్రణ ఆవశ్యం అంటూ ఆ మీడియా ప్రచారం చేసింది. బహుశా ఆ మీడియా వారిని సంతోషపరచడానికో  ఏమో కాని, ఏపీ కన్నా ముందుగా తెలంగాణలో దానిని పాటించడానికి రేవంత్ సర్కార్ సిద్దం అయిందన్న  భావన కలుగుతోంది.  అందులో భాగంగా మంత్రులు, ఎమ్మెల్యేల జీతాలు కొంతకాలం సగం చొప్పునే తీసుకుంటారట. ఇతర ఆదాయ మార్గాలు  కూడా అన్వేషించాలని తలపెట్టారు. అది తప్పు కాదు. కాని  అసలు సమస్య తెలంగాణ లో కాంగ్రెస్, ఏపీలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఇచ్చిన  హామీల భారం అన్నది వాస్తవం కాదా? దానిని కప్పిపుచ్చుకోవడానికి తమకు మద్దతు ఇచ్చే మీడియాను అడ్డుపెట్టుకుని ప్రభుత్వాలు కొత్త డ్రామా నడపాలని చూస్తున్నట్లుగా  అనిపిస్తుంది. 

తెలంగాణ తర్వాత ఏపీలో కూడా ఈ తరహా సీన్ ను చూస్తామేమో తెలియదు. ఏపీలో ప్రభుత్వం సుమారు రూ.40 వేల కోట్ల మేరకు ఉద్యోగులకు బకాయిపడినట్లు వార్తలు వస్తున్నాయి. తెలంగాణలో రిటైరైన  వారికి రావల్సిన ఫైనల్ మొత్తాలు సకాలంలో చెల్లించకపోవడంపై హైకోర్టు కూడా పలుమార్లు  ప్రభుత్వాన్ని ఆక్షేపించింది. అయినా ఈ విషయంలో ఎలా ముందుకు వెళ్లాలో తెలియని స్థితిలో ప్రభుత్వం ఉందనిపిస్తుంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఉద్యోగులకు, ఆర్టీసీ సిబ్బందికి, అలాగే అన్ని వర్గాల ప్రజలకు అనేక హామీలు  ఇచ్చింది. ఉదాహరణకు వృద్దాప్య ఫించన్‌ను రూ.రెండు వేల నుంచి రూ.నాలుగు వేలు చేస్తామని, ప్రతి ఆడబిడ్డకు నెలకు రూ.2500 చొప్పున చెల్లిస్తామని.. ఇలా అనేక వాగ్దానాలు చేసింది.పైగా ఇవన్ని వంద రోజుల్లో నెరవేర్చుతామని కూడా ప్రజలను నమ్మించే యత్నం చేసింది. ప్రజలు విశ్వసించారా? లేక ఇతర కారణాల వల్లనా అన్నది చెప్పలేం కాని, కాంగ్రెస్ అధికారంలోకి అయితే రాగలిగింది. 

ఆ తర్వాత అసలు కథ ఆరంభమైంది. గత కేసీఆర్‌ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని, మిగులు రాష్ట్రాన్ని లోటు రాష్ట్రంగా చేశారని, కాళేశ్వరంపై రూ.లక్ష కోట్లు వృథా చేశారని ఇలా పలు విధాలుగా సమస్యలను డైవర్ట్ చేయడానికి యత్నించారు. ఇవన్నీ తెలియకుండానే ఎన్నికల వాగ్దానాలు చేశారా?  ఎల్ల కాలం అది సాగదు కదా? సడన్ గా ఆర్టీసీ సిబ్బంది రియాక్ట్ అయ్యారు. సమ్మెకు  దిగారు. ఒక కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదంతా ప్రభుత్వానికి పెద్ద కళంకంగా మారింది.దాంతో రేవంత్ ప్రభుత్వం వేగంగా స్పందించాల్సి వచ్చింది.  ప్రస్తుతానికి ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ఒక పరిష్కారం కనుక్కున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి కమిటీ వేస్తామని చెప్పారు. ఇది కొంత సమయం తీసుకునే కసరత్తు  తప్ప ఇంకొకటి కాకపోవచ్చు. ఇలాగే ఆయా వర్గాల వారు తమకు ఇచ్చిన  హామీలు నెరవేర్చాలని కోరుతూ ఆందోళనలకు దిగితే  ప్రభుత్వానికి మరింత ఇరకాట పరిస్థితి ఏర్పడుతుంది.  రైతులలో ఏర్పడిన అసంతృప్తిని కొంతైనా పొగొట్టాలని రేవంత్ సర్కార్ దశల వారిగా రైతు బంధు స్కీమ్ ను అమలు చేస్తోంది.

రుణమాఫీని కొంత మేర చేశారు. అయినా ఇతర సమస్యలు వెంటాడుతూనే ఉంాయి. ఫీజ్ రీయింబర్స్ మెంట్ గురించి ప్రైవేట కాలేజీల వారు కొన్ని నెలల క్రితం ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. అక్కడికి హైదరాబాద్‌లో భూముల అమ్మకం వంటివాటి ద్వారా కొంత డబ్బు  సంపాదిస్తున్నా, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలకు, వస్తున్న ఆదాయానికి సంబంధం ఉండడం లేదు. దానివల్లే  ప్రభుత్వం వేల కోట్ల అప్పులు చేయవలసి వస్తోంది.ఈ ఏడాది కొత్త ఆర్థిక సంవత్సరంలో అంటే  ఏప్రిల్ నుంచి జూన్ మధ్య రూ.18900 కోట్ల అప్పు చేయాలని ప్రబుత్వం నిర్ణయించుకుంది. ప్రతి నెల సగటున రూ.6300 కోట్ల అప్పు చేయాలన్నమాట. అంటే రోజుకు రూ.210 కోట్ల రుణం! రాష్ట్రం అప్పు ఇప్పటికే సుమారు రూ.ఎనిమిది లక్షల కోట్లకు చేరింది. ఈ ఏడాది ఇది ఇంకా పెరుగుతుంది.

అయినా ఇచ్చిన హామీలన్నిటిని నెరవేర్చడం అసాధ్యం అని చెప్పక తప్పదు. ఒకప్పుడు ప్రధానిగా ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి పాకిస్తాన్‌తో యుద్దం నేపథ్యంలో ‘‘జై జవాన్, జై కిసాన్’’ అన్న నినాదం ఇచ్చి ప్రజలు ఒక పూట ఉపవాసం ఉండి ,ఆ డబ్బును  సైనికుల నిధి ఇవ్వాలని కోరారు. దానికి ప్రజల నుంచి పెద్ద ఎత్తున  స్పందన వచ్చింది. కోట్లాది మంది దానిని ఆచరించారు. ఆ రోజుల్లో ఆయన పాటించిన నిరాడంబరత, చిత్తశుద్ధి, దేశ భక్తి మొదలైనవి కారణాలుగా ఉన్నాయి. కాని ప్రస్తుతం ఒకపక్క రాష్ట్ర  ప్రభుత్వాలు  విలాసవంతమైన రీతిలో  ఖర్చులు చేస్తున్నాయి. అవినీతికి కొదవే  లేదు. ప్రజలను మభ్య పెట్టడానికి ఇష్టారీతిన ఎన్నికల ప్రణాళికలను  ప్రకటించడం వంటివి చేస్తున్నాయి. అధికారంలోకి వచ్చాక చేతులు ఎత్తేస్తున్నాయి. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి చాలా ఏళ్ల క్రితం అమెరికాలో చేసిన  ఒక  వ్యాఖ్య అర్థవంతమైందే అనుకోవాలి.  మోసపోవడానికి ప్రజలు  సిద్ధంగా ఉన్నప్పుడు రాజకీయ నేతలుగా మేము చేయకుండా ఉంటామా? అని అన్నారు. చమత్కారం కోసం ఆ మాట చెప్పినా,అది అక్షరసత్యం!


కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement