కాంగ్రెస్‌ ముసుగులో మజ్లిస్‌ పోటీ చేస్తోంది | Kishan Reddy Comments on KCR and Congress Party | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ ముసుగులో మజ్లిస్‌ పోటీ చేస్తోంది

Oct 29 2025 5:33 AM | Updated on Oct 29 2025 5:33 AM

Kishan Reddy Comments on KCR and Congress Party

శ్రీనగర్‌కాలనీలో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

కేసీఆర్‌ గంట పాదయాత్ర చేసి ఓట్లు అడగాలి: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక ప్రచారంలో బీజేపీ జోరు పెంచించింది. మంగళవారం ఉత్తరాది తరహా కార్పెట్‌ బాంబింగ్‌ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఏకకాలంలో 50 ప్రాంతాల్లో బీజేపీ నేతలు ప్రచారంలో పాల్గొన్నారు. ఎర్రగడ్డ డివిజన్‌లో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు రాంచందర్‌రావు, శ్రీనగర్‌కాలనీలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, నియోజకవర్గవ్యాప్తంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ...‘గత ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ కుటుంబపాలన, అవినీతి, దుర్మార్గపు పాలన పోవాలని, ఇచ్చిన హామీలు అమలు చేయనందుకు నిరసనగా కాంగ్రెస్‌కు ఓటు వేశారు. కేసీఆర్‌ రహదారులను అద్దంలా తయారు చేస్తా అన్నారు.

బోరబండ, రహ్మత్‌నగర్, షేక్‌పేట్, శ్రీనగర్‌ కాలనీ, ఎక్కడైనా గంట పాదయాత్ర చేసి ఓట్లు అడగాలి’అని కిషన్‌రెడ్డి సవాల్‌ విసిరారు. పేరుకే జూబ్లీహిల్స్‌ ఇక్కడ రోడ్డుపై అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి ఉందన్నారు. ఈ సమస్యలకు బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ ప్రభుత్వాలదే బాధ్యత కాదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ముసుగులో మజ్లిస్‌పోటీ చేస్తోందన్నారు. ఎంఐఎం నేతలు వచ్చి ప్రచారం చేస్తున్నారని, హైదరాబాద్‌ను కబ్జా చేయడానికి మజ్లిస్‌ పార్టీ ప్రయత్నిస్తోందని చెప్పారు.

ఎర్రగడ్డ డివిజన్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీ ఏకైక ప్రత్యామ్నాయంగా మారిందని తెలిపారు. ఈ ఎన్నికల్లో దీపక్‌రెడ్డిని గెలిపిస్తే తెలంగాణలో డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ రావడానికి అది నాందిగా నిలుస్తుందన్నారు. బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం అలవికాని బూటకపు హామీలు ఇచ్చి గద్దెనెక్కిందని, రెండేళ్లు కావొస్తున్నా హామీల అమలులో చిత్తశుద్ధి లేదని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement