రెండు బైపాస్‌ రోడ్ల నిర్మాణం చకచకా | Key progress in the expansion of Appa junction Manneguda Highway | Sakshi
Sakshi News home page

రెండు బైపాస్‌ రోడ్ల నిర్మాణం చకచకా

Jul 10 2025 3:57 AM | Updated on Jul 10 2025 3:57 AM

Key progress in the expansion of Appa junction Manneguda Highway

అప్పా కూడలి–మన్నెగూడ హైవే విస్తరణలో కీలక పురోగతి

11 కి.మీ. మేర 60 మీటర్ల వెడల్పుతో మొయినాబాద్, చేవెళ్లల వద్ద నిర్మాణం 

ప్రధాన క్యారేజ్‌వే విస్తరణపై ఉన్న ఎన్‌జీటీ స్టే తొలగించేలా చర్యలు 

జడ్‌ఎస్‌ఐ–బీఎస్‌ఐ నిపుణుల ఆధ్వర్యంలో పర్యావరణ ప్రభావ అంచనా సర్వే మొదలు

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌–బీజాపూర్‌ జాతీయ రహ దారి విస్తరణలో భాగంగా కీలక బైపాస్‌ రోడ్ల నిర్మాణం మొ దలైంది. నగర శివారులోని అప్పా కూడలి నుంచి మన్నెగూడ వరకు 46 కి.మీ. నిడివిని ఎన్‌హెచ్‌ఏఐ నాలుగు వరుసలుగా విస్తరించనున్న విషయం తెలిసిందే. ప్రధాన రోడ్డుపై ఉన్న 915 మర్రి వృక్షాలను సంరక్షించే విషయంలో ఎన్‌హెచ్‌ఏఐ సరైన ప్రణాళిక ఇవ్వకపోవటంతో..జాతీయ హరిత ట్రిబ్యునల్‌లో కేసు దాఖలు కావటంతో రోడ్డు నిర్మాణంపై స్టే ఇచి్చ న విషయం తెలిసిందే. దీంతో ప్రధాన రోడ్డు విస్తరణ పనులు మొదలుకాలేదు. కానీ విస్తరణలో కీలకంగా ఉండే 11 కి.మీ. నిడివితో ఉండే బైపాస్‌ రోడ్ల నిర్మాణం మొదలై వేగంగా జరుగుతోంది.  

మొయినాబాద్, చేవెళ్ల వద్ద..: ఈ రోడ్డును 60 మీటర్ల వెడల్పుతో విస్తరించాల్సి ఉంది. మొయినాబాద్, చేవెళ్ల పట్టణాల వద్ద అంతమేర రోడ్డు విస్తరణ జరగాలంటే భారీగా ప్రైవేట్‌ భవనాలను తొలగించాల్సి ఉంటుంది. దీంతో ఆ రెండు చోట్ల బైపాస్‌ రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.  

» తొలుత మొయినాబాద్‌ పట్టణం ముందు జేబీఐటీ వద్ద తొలి బైపాస్‌ రోడ్డు మొదలవుతుంది. ఇది పట్టణం దాటిన తర్వాత తాజ్‌ హోటల్‌ కూడలి వద్ద ముగుస్తుంది. దాదాపు 4.8 కి.మీ. నిడివితో సాగుతుంది. 

» చేవెళ్ల శివారులోని కేసారం గ్రామం వద్ద మొదలయ్యే బైపాస్‌ రోడ్డు దాదాపు 6 కి.మీ. మేర కొనసాగి చేవెళ్ల దాటిన తర్వాత ఇబ్రహీంపల్లి గ్రామ సమీపంలో ప్రధాన రోడ్డును కలుస్తుంది.  

» రెండు బైపాస్‌ల నిర్మాణానికి 135 హెక్టార్ల భూమిని సేకరించిన అధికారులు రూ.200 కోట్ల మొత్తాన్ని పరిహారంగా చెల్లించారు. చేవెళ్ల బైపాస్‌లో కొంత భాగంలో పరిహారం వివాదం కొన సాగుతుండటంతో ఆ భాగం మినహా మిగతా భా గం పనులు వేగంగా జరుగుతున్నాయి. భూమిని 60 మీటర్ల వెడల్పుతో చదును చేసి గ్రావెల్‌ పరిచి కంప్రెస్‌ చేసే పని పూర్తయ్యింది. మొయినాబాద్‌ నుంచి సురంగల్, శ్రీరామ్‌నగర్‌ గ్రామాల మీదుగా షాబాద్‌ రోడ్డుకు కలిసే రోడ్డు క్రాస్‌ చేసే చోట విశాలమైన అండర్‌పాస్‌ నిర్మాణం జరుగుతోంది. 

మరో నాలుగు చోట్ల కల్వర్టులు నిర్మిస్తున్నారు. ఈ బైపాస్‌ సిద్ధమైతే సురంగల్, శ్రీరామ్‌నగర్‌ ప్రాంతాల వైపు వెళ్లే వాహనాలు మొయినాబాద్‌ కూడలి నుంచి రావాల్సిన అసవరం లేకుండా దీనిమీదుగా వచ్చే వీలుంటుంది. బైపాస్‌ నుంచి దిగువ రోడ్డుకు అనుసంధానించే లింక్‌ రోడ్లు కూడా నిర్మిస్తున్నారు. దీంతో తక్కువ సమయంలోనే అప్పా కూడలి నుంచి అక్కడకు చేరుకోవచ్చు. 

ఇక చేవెళ్ల బైపాస్‌లో చేవెళ్ల–షాద్‌నగర్‌ రోడ్డు, దామరగిద్ద గ్రామానికి వెళ్లే దారిలో అండర్‌పాస్‌ల నిర్మాణం మొదలైంది. మరో ఆరు కల్వర్టుల పనులు కూడా ప్రారంభించారు. మార్చి నాటికి ఈ రెండు బైపాస్‌ పనులు పూర్తి చేసి వాహనాల రాకపోకలను అనుమతిస్తామని ఎన్‌హెచ్‌ఏఐ పేర్కొంటోంది.  

పర్యావరణ ప్రభావ అంచనా సర్వే మొదలు.. 
ప్రధాన రహదారిపై మర్రి వృక్షాల రక్షణకు ఎన్‌హెచ్‌ఏఐ నడుంబిగించింది. ఆ వృక్షాల రక్షణకు పక్కా ప్రణాళికను అందజేయాలని ఇప్పటికే జాతీయ హరిత ట్రిబ్యునల్‌ ఆదేశించింది. దీనికి సంబంధించి పర్యావరణ ప్రభావ అంచనా (ఎన్విరాన్‌మెంటల్‌ ఇంపాక్ట్‌ అసెస్‌మెంట్‌ స్టడీ) సర్వే చేయాలని చెప్పింది. 

గతంలో ఈ సర్వే జరిగినా, అది పక్కాగా లేదని ఇటీవల ఆక్షేపించింది. దీంతో తాజాగా ఎన్‌హెచ్‌ఐఏ జడ్‌ఎస్‌ఐ–బీఎస్‌ఐల నిపుణుల ఆధ్వర్యంలో ఆ సర్వే కూడా ప్రారంభమైంది. త్వరలో నివేదిక అందించనున్నారు. దాన్ని హరిత ట్రిబ్యునల్‌కు అందించి, రోడ్డు నిర్మాణంపై ఉన్న స్టే తొలగించేలా ఎన్‌హెచ్‌ఏఐ ఏర్పాట్లు చేస్తోంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement