కేసీఆర్‌ చెంతకు కామ్రేడ్స్‌! 

Kerala CM Vijayan Meets CM KCR Pragati Bhavan Hyderabad - Sakshi

సీఎంతో సీపీఐ, సీపీఎం అగ్రనేతల భేటీ

వేర్వేరుగా ప్రగతిభవన్‌కు వెళ్లి కలిసిన నాయకులు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో శనివారం ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. సీపీఎం, సీపీఐ పార్టీల జాతీయ అగ్రనేతలు ఒకరి తర్వాత ఒకరుగా ప్రగతిభవన్‌కు వెళ్లి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును కలుసుకోవడం ఆసక్తిగా మారింది. శుక్రవారం నుంచి ప్రారంభమైన మూడు రోజుల కేంద్ర కమిటీ సమావేశాల్లో పాల్గొనేందుకు సీపీఎం జాతీయ నేతలు హైదరాబాద్‌కు రాగా.. తమ పార్టీ అనుబంధ విభాగం ‘అఖిల భారత యువజన సమాఖ్య (ఏవైఎఫ్‌)’జాతీయ మహాసభల్లో పాల్గొనేందుకు సీపీఐ నేతలూ వచ్చారు.

వీరిలో తొలుత శనివారం మధ్యాహ్నం సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి నేతృత్వంలో ఆ పార్టీ అగ్రనేతలు కేరళ సీఎం పినరై విజయన్, త్రిపుర మాజీ సీఎం మాణిక్‌ సర్కార్, కేంద్ర పొలిట్‌బ్యూరో సభ్యులు రామచంద్రన్‌ పిళ్లై, బాలకృష్ణన్, ఎంఏ బేబీ తదితరుల బృందం ప్రగతిభవన్‌కు వెళ్లి సీఎం కేసీఆర్‌తో భేటీ అయింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ వారికి ప్రగతిభవన్‌లో మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు. ఇక సాయంత్రం సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, ఆ పార్టీ పార్లమెంటరీపక్ష నేత, కేరళ ఎంపీ బినయ్‌ విశ్వం, కేరళ రెవెన్యూ మంత్రి రాజన్, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, రాష్ట్ర సహాయ కార్యదర్శులు పల్లా వెంకటరెడ్డి, కూనంనేని సాంబశివరావు తదితరులు ప్రగతిభవన్‌కు వెళ్లి కేసీఆర్‌ను కలిశారు.

ఇలా ఉభయ కమ్యూనిస్టు పార్టీల అగ్రనేతలు ఒకే సమయంలో హైదరాబాద్‌కు రావడం, ఒకరి తర్వాత మరోపార్టీ నేతలు కేసీఆర్‌ను కలిసి చర్చలు జరపడం చర్చనీయాంశంగా మారింది. ఈ భేటీలకు సంబంధించి అటు సీఎం కార్యాలయంగానీ, కమ్యూనిస్టు పార్టీలుగానీ అధికారికంగా పూర్తి వివరాలేవీ వెల్లడించలేదు. కేవలం జాతీయ రాజకీయాలు, రాష్ట్రాభివృద్ధి తదితర అంశాలపై చర్చించినట్టు మాత్రమే సీఎం కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. కాగా.. ఈ సమావేశాల్లో రాష్ట్ర మంత్రులు కేటీఆర్, మహమూద్‌ అలీ, వేముల ప్రశాంత్‌రెడ్డి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ కుమార్, ఎంపీ సంతోష్‌కుమార్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి కూడా పాల్గొన్నారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top