సాక్షి, హైదరాబాద్: తమ అమ్ముల పొదిలో అనేక అస్త్రాలున్నాయని, వాటిని ఒక్కొక్కటిగా ప్రజల్లోకి తీసుకెళ్తామని ఇటీవల శాసనసభ సమావేశాల సందర్భంగా చెప్పిన బీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు.. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆ అస్త్రాలకు పదును పెడుతున్నారు. హ్యాట్రిక్ విజయం సాధించి వరుసగా మూడోమారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన దక్షిణాది నేతగా రికార్డును నెలకొల్పేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు.
వివిధ వర్గాల ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకతను తగ్గించడం, ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఓట్లను గంప గుత్తగా బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా మలచడం లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడే లోపే పలు నిర్ణయాలు తీసుకోవడంపై కేసీఆర్ దృష్టి సారించారు. గెలుపునకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకోవడం ద్వారా విపక్షాలకు ఏవిధమైన ఎన్నికల అస్త్రాలు దొరక్కుండా చూడాలని కేసీఆర్ భావిస్తున్నారు. మరోవైపు అభ్యర్థుల ఎంపిక, ప్రచార వ్యూహానికి రూపకల్పనతోపాటు పార్టీ మేనిఫెస్టోపైనా కసరత్తు చేస్తున్నారు.
అక్టోబర్‌లో ఎన్నికల షెడ్యూల్ వెలువడే సూచనలు కనిపిస్తుండటంతో వచ్చే నెల చివరి నాటికి వివిధ అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రారం¿ోత్సవాలు, శంకుస్థాపనలు వంటి కార్యక్రమాలను వేగవంతం చేయడంపై సీఎం దృష్టి సారించారు. ఇప్పటికే వివిధ దశల్లో ఉన్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను గాడిన పెట్టేలా వరుస సమీక్షలు నిర్వహించాలని మంత్రులను ఆదేశించారు.
మేనిఫెస్టోకు తుది మెరుగులు
పేదలు మరింత పేదరికంలోకి కూరుకుపోకుండా సంక్షేమ పథకాలు తోడ్పడతాయని గట్టిగా నమ్ముతున్న కేసీఆర్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో వాటికి ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నారు. సామాజిక భద్రతకు పెద్దపీట వేస్తూ పలు అభివృద్ధి చెందిన దేశాల్లో అమలవుతున్న సంక్షేమ పథకాలను ఇక్కడి పరిస్థితులకు అనుగుణంగా బడ్జెట్ పరిమితులను దృష్టిలో పెట్టుకుని అమలు చేయా లని నిర్ణయించారు.
ముఖ్యంగా ఇప్పటివరకు సంక్షేమ పథకాలు అందని వర్గాలను వెతికి మరీ వారి కోసం ప్రకటించాల్సిన తాయిలాలపై కసరత్తు జరుగుతోందని బీఆర్‌ఎస్ వర్గాలు చెప్తున్నాయి. సామాజిక పింఛన్లు మరో రూ.1,000 పెంపు, గిరిజన బంధు వంటి అస్త్రాలను చివరి నిమిషంలో ప్రయోగించే సూచనలు కనిపిస్తున్నాయి. దళితబంధు, బీసీ, మైనారిటీల ఆర్థిక సాయం, గృహలక్ష్మి వంటి పథకాలను ఎన్నికల తర్వాత మరింత పకడ్బందీగా విస్తృత స్థాయిలో అమలు చేస్తామని మేనిఫెస్టోలో భరోసా ఇవ్వనున్నారు.
రైతులు, పేదలు, కులవృత్తులు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, ప్రభుత్వ ఉద్యోగులు లక్ష్యంగా ఇప్పటికే పలు సంక్షేమ పథకాలను కేసీఆర్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రతి ఓటరూ ప్రభుత్వ పథకం లబ్ధిదారుడే అనే లెక్కలతో వారి ఓట్లను వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా మలుచుకోవడానికి ప్రాధాన్యతనిస్తున్నారు. వీరి ఓట్లను గంపగుత్తగా పొందేందుకు అనుసరించాల్సిన కార్యాచరణపై పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేస్తూ వస్తున్నారు.
అన్ని విధాలుగా సన్నాహాలు
రైతురుణ మాఫీ ప్రకటనతో విపక్షాల స్పీడ్‌కు అడ్డుకట్ట వేసిన కేసీఆర్.. వారికి మరే ఇతర ఎన్నికల ప్రచార అస్త్రాలు దొరక్కుండా చేయాలని భావిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ మేనిఫెస్టోలో చేర్చేందుకు అవకాశమున్న పథకాలు, ఆ పార్టీలు ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించే అంశాలపైనా దృష్టి పెట్టారు. ఆ పారీ్టల ఎత్తుగడలను ఎన్నికల మేనిఫెస్టో, ప్రచార పర్వంలో తిప్పికొట్టేందుకు వీలుగా అవసరమైన అస్త్రాలను కూడా సిద్ధం చేసుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారు.
డబుల్ బెడ్ రూం ఇళ్ల పథకం, నిరుద్యోగ భృతి, ఉద్యోగాల భర్తీ, కుటుంబ పాలన, ప్రాజెక్టుల్లో అవినీతి, తొమ్మిదేళ్లలో పాలన వైఫల్యం వంటి అంశాలను విపక్షాలు ప్రధానంగా ఎత్తి చూపుతాయని బీఆర్‌ఎస్ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో వాటిని ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన ఎత్తుగడలపై కేసీఆర్ వ్యూహరచన చేస్తున్నట్లు తెలిసింది. మరోవైపు గెలుపు గుర్రాలకే ప్రాధాన్యతనిస్తూ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కూడా వేగంగా నిర్వహిస్తున్నారు.
అనేక స్థానాల్లో నేతల వారసులు, కొత్త అభ్యర్థులు, పార్టీలో అసంతృప్తులు, ఇప్పటికే ఎంపీ, ఎమ్మెల్సీ వంటి అధికారిక పదవుల్లోఉన్న వారు టికెట్లు ఆశిస్తున్న నేపథ్యంలో సిట్టింగుల వైపు కేసీఆర్ మొగ్గు చూపుతున్నారు. సుమారు 13 నుంచి 15 మంది సిట్టింగులకు టికెట్లు దక్కే సూచనలు కనిపించడం లేదని బీఆర్‌ఎస్ నేతలు చెబుతున్నారు.
కాగా 2018 ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్‌లోకి వచ్చిన సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇచ్చేందుకు కేసీఆర్ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు విపక్షాలను కకావికలం చేసే వ్యూహంలో భాగంగా కాంగ్రెస్, బీజేపీ నుంచి ఒకరిద్దరు బలమైన నేతలను కూడా పార్టీలో చేర్చుకుని వారికి టికెట్లు కేటాయించే సంకేతాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్‌కు చెందిన ఓ ముఖ్య నేత కీలక సమయంలో పార్టీని వీడి వస్తారని బీఆర్‌ఎస్ వర్గాలు వెల్లడించాయి.


