
మూడు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక
బలమైన అభ్యర్థి కోసం పార్టీల వెతుకులాట
తెలుగు రాష్ట్రాల్లో జూబ్లీహిల్స్‌పై చర్చ
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి చెందడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో ప్రధాన పార్టీలు ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. అభ్యర్థి ఎంపికపై దృష్టిసారిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న అవరోధాలను అధిగమించేందుకు సమాలోచనలు చేస్తున్నాయి. జూబ్లీహిల్స్ అంటే రిచ్ ఏరియా అని గుర్తింపు.. అక్కడ పాగా వేయాలని అధికార కాంగ్రెస్‌తో పాటు సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని బీఆర్‌ఎస్, గ్రేటర్‌లో తమ బలం నిరూపించుకోవాలని బీజేపీలు ఉప ఎన్నికకు సై అంటున్నాయి. ఈ క్రమంలోనే అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారిస్తున్నాయి. ఇక్కడ ఏ పార్టీ నుంచి ఎవరు సీటు దక్కించుకుంటారా అనేది రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రాజకీయంగా ఆసక్తికరమైన అంశంగా మారింది.
ఉప ఎన్నికల్లో దాదాపుగా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పారీ్టకి చెందిన వ్యక్తులే గెలుపొందుతారనే వాదనలు ఉన్నాయి. మొన్న జరిగిన కంటోన్మెంట్ ఉప ఎన్నికలోనూ ఇదే జరిగింది. అయితే గతంలో జరిగిన దుబ్బాక, ఇతర కొన్ని సంఘటనలు బలమైన అభ్యర్థి ఉంటే అధికార పార్టీకి చెక్ పెట్టడం పెద్ద కష్టం కాదని చెబుతున్నాయి. గతంలో ఇక్కడ నుంచి పోటీ చేసిన అజారుద్దీన్‌కు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇచ్చారు. దీంతో ఆయన రేసులో లేరనేది స్పష్టమైంది. ప్రస్తుతం నవీన్ యాదవ్ పేరు వినిపిస్తోంది. అన్ని వర్గాలకు అందుబాటులో ఉంటాడని, గతంలో ఇక్కడ పోటీ చేసిన అనుభవం ఉండటం ఆయన సానుకూల అంశాలు. మరికొంత మంది నేతలు సైతం తమకే సీటు వస్తుందంటూ డివిజన్ నాయకులతో నిత్యం మంతనాలు సాగిస్తున్నారు. ఎంఐఎం కాంగ్రెస్‌కు సహకరిస్తుందని చర్చ సాగుతోంది.
బీఆర్‌ఎస్ సానుభూతి పనిచేస్తుందా?
జూబ్లీహిల్స్ నుంచి హ్యాట్రిక్ విజయాలు సొంతం చేసుకున్న మాగంటి గోపీనాథ్ మరణానంతరం ఆయన కుటుంబ సభ్యులకు టికెట్ ఇస్తే ఎలా ఉంటుందనేది బీఆర్‌ఎస్ పరిశీలిస్తోంది. మాజీ ఎమ్మెల్యే మాగంటి సతీమణికి టికెట్ ఇస్తే సెంటిమెంట్ వర్క్‌అవుట్ అవుతుందని సీనియర్ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఆమెకు దాదాపు టికెట్ ఖరారనే చర్చ కొనసాగుతున్న తరుణంలో గోపీనాథ్ సోదరుడు మాగంటి వజ్రనాథ్ రేసులో నేనున్నానంటూ నియోజక వర్గంలో గట్టిగా తిరుగుతూ తన బలాన్ని కూడగట్టుకుంటున్నారు. కుటుంబంలో ఏం జరుగుతుందనేది పార్టీ అధిష్టానానికి వివరించినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్‌పై వ్యతిరేకత, మాగంటిపై సానుభూతి కలిసొస్తుందని బీఆర్‌ఎస్ నేతలు భావిస్తున్నారు.
కూటమి కడతారా..
జీహెచ్‌ఎంసీ పరిధిలో బీజేపీ బలం పుంజుకుంటోందని ఆ పార్టీ నేతలు గట్టిగా నమ్ముతున్నారు. గతంలో ఊహించిన దానికి మించి 48 కార్పొటర్లను గెలుపొందడమే వారిలో ఆత్మవిశ్వాసానికి కారణంగా కనిపిస్తోంది. అయితే సరైన అభ్యర్థి కోసం పార్టీ నేతలు సమాలోచనలు చేస్తున్నారు. 2023 ఎన్నికల్లో పోటీ చేసిన దీపక్‌రెడ్డికి బదులు వేరే వ్యక్తిని నిలబెట్టాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఉంది. దీంతో టీడీపీ, జనసేనతో కలిసి బరిలోకి దిగాలని బీజేపీ భావిస్తోందని చర్చ జరుగుతోంది.
సామాజిక వర్గాలను ప్రాధాన్యత క్రమంలో ఆలోచన చేయాలని నేతలు సూచిస్తున్నారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే టీడీపీ నుంచి ఎనీ్టఆర్ కుటుంబ సభ్యురాలు సుహాసిని పేరు తెరమీదకు తెస్తున్నారు. ఇదే పారీ్టకి చెందిన మరో వ్యక్తి జీవీ నాయుడు టికెట్ ఆశిస్తున్నారన్న చర్చ సాగుతోంది. బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి, మాధవీలత, కిలారి మనోహర్ తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి.
వెంగళరావునగర్, రాజీవ్‌నగర్ కాలనీ తదితర ప్రాంతాల్లో షెటిలర్స్ అధికంగా ఉండటంతో కూటమిగా పోటీ చేస్తే గెలిచే అవకాశం ఎక్కువ ఉంటుందని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు.