సాహో.. శాటిలైట్‌ టెర్మినల్‌!

India First AC Satellite Bus Terminal at LB Nagar - Sakshi

ఎల్‌బీనగర్‌లోని ‘క్రీడా’ సమీపంలో

రూ.9 కోట్ల అంచనాతో టెండర్లు

వచ్చే ఏప్రిల్‌ నాటికి పనులు పూర్తి

మే మాసం నుంచి అందుబాటులోకి

ప్రయాణికులకు అత్యాధునిక వసతులు

సాక్షి, హైదరాబాద్‌: దేశంలోనే తొలి ఏసీ శాటిలైట్‌ బస్‌ టెర్మినల్‌ నిర్మాణం ఎల్‌బీనగర్‌లో రూపుదిద్దుకోనుంది. దీనికోసం హెచ్‌ఎండీఏ రూ.9 కోట్లతో టెండర్లను ఆహ్వానించింది. మొదటి దశలో 10 బస్‌బేల నిర్మాణం చేపట్టి.. అనంతరం మరో 14 బస్‌బేలను నిర్మించేందుకు నిర్ణయించింది. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా ఆధునిక హంగులతో నిర్మించేందుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. తొలుత రూ.18 కోట్లతో అంచనా వేసినా.. హరిణ వనస్థలిపురం వద్ద కేంద్ర అటవీశాఖ అనుమతులు అవసరం కావడంతో విస్తరణకు ఆటంకం ఏర్పడింది. దీంతో అంచనాలు తగ్గించి మొదటి దశ పనులకు రూ.9 కోట్లు హెచ్చిస్తున్నారు. ఈ బస్‌ టెర్మినల్‌కు తెలంగాణ ఉద్యమంలో అమరుడైన శ్రీకాంత్‌చారి బస్‌ టెర్మినల్‌గా పేరుపెట్టనున్నారు. (చదవండి: హైదరాబాద్‌ నలుదిక్కులా ఐటీ పరిశ్రమ విస్తరణ)

680 మీటర్ల మేర విస్తరణ..

  • ఎల్‌బీనగర్‌ మార్గం మీదుగా ఏపీతో పాటు తెలంగాణలోని ఖమ్మం, భద్రాచలం, నల్లగొండ, సూర్యాపేటకు నిత్యం సుమారు 20 వేల నుంచి 25 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారు. వీరికి  మెరుగైన వసతులు కల్పించాలనే ఉద్దేశంతో సుమారు 680 మీటర్ల వరకు అధునాతన బస్‌బేలను నిర్మించాలని ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అధికారులతో ప్రణాళికలు సిద్ధం చేయించారు.   
  • రోజువారీగా ఆర్టీసీ, ప్రైవేటు బస్సులు 500– 600 వరకు వెళ్తుంటాయి. రద్దీకనుగుణంగా బస్సు స్టాండ్లు లేకపోవడంతో ఇక్కడి చౌరస్తాలో ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. ట్రాఫిక్‌ సమస్య సైతం వేధిస్తోంది.  
     
  • దీంతో ఇక్కడి బస్సుస్టాండ్‌ను తొలగించి ఆటోనగర్‌ సమీపంలోని క్రీడా వద్ద బస్‌ టెర్మినల్‌ నిర్మించాలని నిర్ణయించారు.   

ప్రాజెక్టు అంచనా ఇలా....

  • ఏసీ బస్‌బేల నిర్మాణానికి రూ.9 కోట్ల అంచనా. ఇందులో 10 బస్‌బేలకు రూ.4.50 కోట్లు. మరో రూ.4.5 కోట్లు సోలార్‌ ప్లాంట్, డ్రైనేజీ, ప్రయాణికుల వసతులకు ఖర్చు పెట్టనున్నారు.  
  • బస్‌బే నర్మాణంతో ఇక్కడి నుంచి ఒకేసారి వంద బస్సులు ఇలా వచ్చి అలా వెళ్తాయి. దీంతో ట్రాఫిక్‌ సమస్యతో పాటు ప్రయాణికులకు ఇబ్బందులు తొలగనున్నాయి.

సౌకర్యాలు ఇలా..  

  • దూర ప్రాంతాలకు వెళ్లేందుకు ఒక మార్గం, సిటీ ప్రయాణికులకు మరో మార్గం ఉంటుంది.  
  • ఏసీ, నాన్‌ఏసీ నిరీక్షణ గదులు ఉంటాయి. కరోనా నిబంధనలు  పాటిస్తూ ఏసీ గదుల్లో ప్రయాణికులు 21 మంది, నాన్‌ ఏసీ ప్రాంగణాల్లో 48 మంది కూర్చునే ఏర్పాటు.  
  • నిరంతర విద్యుత్‌ కోసం 490 కిలోవాట్స్‌ సౌరవిద్యుత్‌ ప్లాంట్, నిరంతరం వైఫై, నీటిశుద్ధి కేంద్రం, పార్కింగ్‌ వసతులు.  
  • ఏటీఎం కేంద్రాలు, ఫుడ్‌ కోర్టులు, బుక్‌ షాపు, ఆరోగ్య కేంద్రం  ఏర్పాటు కానున్నాయి.  
  • బస్‌ టెర్మినల్‌ పనులు వచ్చే జనవరిలో ప్రారంభించి ఏప్రిల్‌లో పూర్తి చేస్తారు. మే మొదటి వారంలో అందుబాటులోకి వస్తుందని  అధికారులు అంచనా వేస్తున్నారు.  

నా డ్రీమ్‌ ప్రాజెక్టు..  బస్‌ టెర్మినల్‌
నా డ్రీమ్‌. ప్రాజెక్టు రూపకల్పనకు నేనే స్వయంగా డిజైన్లు, అంచనాలు చేశా. దేశంలోనే మొదటి ఏసీ బస్‌బే ఎల్‌బీనగర్‌లో నిర్మించడం అదృష్టంగా భావిస్తున్నాను.   
– దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, ఎల్‌బీనగర్‌ ఎమ్మెల్యే

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top