ప్రభుత్వం చెప్పినా వినట్లే.. ‘ప్రైవేటు’ రూటే సపరేటు.. 

Hyderabad: Private Schools Conducting Exams Not Obey Government Order - Sakshi

సాక్షి, వెంగళరావునగర్‌: ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా అమలు చేస్తామని లైసెన్స్‌లు తీసుకున్న కొన్ని ప్రైవేటు పాఠశాలలు మచ్చుకైనా పాటించడం లేదు. ఖైరతాబాద్‌ విద్యాశాఖ పరిధిలోని యూసుఫ్‌గూడ, వెంగళరావునగర్, బోరబండ, రహమత్‌నగర్, ఎర్రగడ్డ డివిజన్లలో 17 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, 50 లోయర్‌క్లాస్, 190 ప్రైవేటు స్కూల్స్‌ ఉన్నట్లుగా అధికారిక లెక్కలు చెబుతున్నాయి.

అందులో మొత్తం 1 నుంచి 10 తరగతుల వరకు 95,913 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. కాగా ప్రభుత్వం గత రెండ్రోజుల కిందట 1 నుంచి 9 తరగతుల విద్యార్థులను ప్రమోట్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అదేవిధంగా పదో తరగతి విద్యార్థులను కూడా పాస్‌ చేస్తున్నట్టు ప్రకటించింది. దీంతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హమ్మయ్య... అంటూ కరోనా నుంచి తమను తప్పించినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.  

‘ప్రైవేటు’ రూటే సపరేటు.. 
ఖైరతాబాద్‌ విద్యాశాఖ పరిధిలో ఉన్న ప్రైవేటు పాఠశాలల రూటే సపరేటుగా నడుస్తుంది. ఆయా డివిజన్ల పరిధిల్లోని కొన్ని ప్రైవేటు పాఠశాలల్లో (10వ తరగతి మినహా) ఇంకా పరీక్షలను కొనసాగిస్తున్నారు. దీంతో అటు తల్లిదండ్రులు, ఇటు విద్యార్థులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. మొత్తం 95 వేల మంది వరకు 1 నుంచి 9వ తరగతి విద్యార్థులు ఉండగా, ఇప్పటికే లోయర్‌ క్లాస్‌ పిల్లలకు పరీక్షలను పూర్తి చేయగా, ప్రస్తుతం హైస్కూల్‌ విద్యార్థులకు పరీక్షలను కొనసాగిస్తున్నారు.

దీంతో ప్రభుత్వం తమ పిల్లలను ప్రమోట్‌ చేస్తూ నిర్ణయం తీసుకున్నప్పటికీ వార్షిక పరీక్షలను పెట్టడం విడ్డూరంగా ఉందంటూ కొంతమంది తల్లిదండ్రులు ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రైవేటు స్కూల్స్‌ కనుక ఏమీ అనలేకపోతున్నామని వారు పేర్కొంటున్నారు. సోమవారం వరకు స్కూల్స్‌లో ఈ వార్షిక పరీక్షలను నిర్వహించగా మంగళవారం సైతం కొన్ని పాఠశాలల్లోని విద్యార్థులకు ప్రశ్నా పత్రాలను ఇచ్చి ఇంటి వద్ద జవాబులు రాసుకుని రావాలని సూచించారు. దీంతో ఇళ్ల వద్ద కుస్తీలు పడుతూ పరీక్షలను ముగించి ప్రశ్నా, జవాబుల పత్రాలను ఆయా పాఠశాలల్లో అప్పజెప్పడం జరిగింది. ఇంకా మరో మూడు పరీక్షలు మాత్రమే మిగిలి ఉన్నాయని, వాటిని కూడా పూర్తి చేయాల్సి ఉందని కొంతమంది విద్యార్థుల తల్లిదండ్రులు తెలుపుతున్నారు.  

 (చదవండి: 1 నుంచి 9వ తరగతి విద్యార్థులందరూ ప్రమోట్‌ )

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top