ఫీజులు గుంజేసి.. బకాయిలు మింగేసి! హైదరాబాద్‌లో ఎన్టీఆర్‌ ట్రస్టు నిర్వాకాలు..

Hyderabad NTR Trust Cheating Staff Complaint To Telangana Govt - Sakshi

కరోనా సాకుతో టీచర్లకు సగం జీతాలే 

విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు కాగానే బకాయిలన్నీ చెల్లిస్తామంటూ మోసం 

న్యాయ పోరాటానికి దిగిన అధ్యాపకులు

ప్రధాని కార్యాలయం, తెలంగాణ ప్రభుత్వానికి ఫిర్యాదు

సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: కరోనా విపత్తులోనూ విద్యార్థుల నుంచి ముక్కుపిండి మరీ ఫీజులు వసూలు చేసిన ఎన్టీఆర్‌ ట్రస్టు యాజమాన్యం అధ్యాపకులకు మాత్రం బకాయిలు చెల్లించకుండా ఎగ్గొట్టడంపై ప్రధాని కార్యాలయంతోపాటు తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్, ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉన్నతాధికారులకు బాధితులు ఫిర్యాదు చేశారు. మరోవైపు దీనిపై న్యాయ పోరాటానికి కూడా దిగారు.

ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని గండిపేట సమీపంలో హైస్కూలు, జూనియర్, డిగ్రీ కాలేజీలు నడుస్తున్నాయి. కాలేజీల్లో 900 మందికి పైగా, హైసూ్కల్‌లో 500 మంది వరకు విద్యార్థులున్నారు. విద్యార్థుల నుంచి ఏటా రూ.1.50 లక్షల నుంచి రూ.1.75 లక్షల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో జీతాల్లో 50 శాతం తాత్కాలికంగా కోత విధిస్తున్నామని, ఫీజులు వసూలయ్యాక మినహాయించిన మొత్తాన్ని తిరిగి చెల్లిస్తామని 2020 మే 20వ తేదీన జూమ్‌ మీటింగ్‌లో ఎనీ్టఆర్‌ ట్రస్టు సీఈవో రాజేంద్రకుమార్‌ సిబ్బందికి హామీ ఇచ్చారు.

వంద మంది బోధనా సిబ్బంది, 20 మందికి పైగా బోధనేతర సిబ్బంది ఇక్కడ పని చేస్తుండగా రూ.పది వేలకు మించి జీతాలు చెల్లిస్తున్న వారికి 16 నెలలు కోత విధించారు. పలువురు అధ్యాపకులకు రూ.2 లక్షల నుంచి రూ.5.25 లక్షల వరకు జీతాల బకాయిలను ట్రస్టు చెల్లించాల్సి ఉంది.  కరోనా కష్టకాలంలోనూ కళాశాల నుంచే ఆన్‌లైన్‌ ద్వారా తరగతులు నిర్వహించిన తమకు కనీసం హెల్త్‌కార్డులు ఇవ్వలేదని, గ్రాట్యుటీ ఊసే లేదని ఉద్యోగులు వాపోతున్నారు.

వసూలు చేసుకుని.. సిబ్బందికి చెల్లించలేదు.. 
కరోనా సమయంలో ఫీజులు రాలేదని పేర్కొన్న యాజమాన్యం ఆ తర్వాత విద్యార్థుల నుంచి వసూలు చేసుకున్నా.. సిబ్బందికి మాత్రం బకాయిలు చెల్లించలేదు..  ట్రస్టు సీఈవో, డీన్, ప్రిన్సిపాల్, ట్రస్టీలకు మొరపెట్టుకున్నా స్పందన శూన్యం.. చివరకు చంద్రబాబు, భువనేశ్వరి, లోకేష్కు తెలియజేసినా కూడా పట్టించుకోలేదు.. అంటూ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారో చెప్పాలని నిర్వాహకులను కోరినందుకు ఓ లెక్చరర్‌ను రెండు గంటల్లో ఇంటికి సాగనంపారు. మరో లెక్చరర్‌ నుంచి క్షమాపణ లేఖ తీసుకుని హెచ్చరించారు.  

9 మందికి లీగల్‌ నోటీసులు
బకాయిల గురించి యాజమాన్యం స్పందించకపోవడంతో తొమ్మిది మంది లెక్చరర్లు ట్రస్టు సీఈవోతో సహా నిర్వాహకులకు లీగల్‌ నోటీసులు పంపారు. ఏ నెల జీతంలో ఎంత కోత విధించారనే వివరాలను నోటీసుల్లో పొందుపరిచారు.
చదవండి: ‘డెక్కన్‌’లో అగమ్యగోచరం! నాలుగో రోజూ లభించని ఆ ఇద్దరి అవశేషాలు 

మరిన్ని వార్తలు :

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top