HYD: నాకిప్పుడే పెళ్లి వద్దు సార్‌ అంటూ పోలీసులకు వీడియో.. పెళ్లిలో ట్విస్ట్‌

Hyderabad Minor Complained To Police She Was Getting Married - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: ‘సార్‌.. నా వయసు 17 సంవత్సరాలు. ఇంటర్మీడియట్‌ రెండో సంవత్సరం చదువుతున్నాను. నాకు ఇష్టం లేకపోయినా 30 ఏళ్ల యువకుడితో పెళ్లి చేసేందుకు మా ఇంట్లో సిద్ధమయ్యారు. ఇప్పుడే పెళ్లొద్దని ఎంత వారిస్తున్నా.. పట్టించుకోవట్లేదు. పెళ్లి చేసుకోవాల్సిందేనని లేకపోతే చచి్చపోతామని బెదిరిస్తున్నారు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. మీరే నాకు హెల్ప్‌ చేయాలి. ఎలాగైనా నా పెళ్లి ఆపించండి ప్లీజ్‌’.. ఇదీ ఓ మైనర్‌ బాలిక ఆవేదన. మరికొన్ని గంటల్లో వివాహం ఉందనగా నూతన వస్త్రధారణలో ఉన్న ఓ పెళ్లి కూతురు వివాహ పత్రిక, ఆధార్‌ కార్డు, ముహూర్తం, పెళ్లి జరిగే ప్రాంతం తదితర వివరాలను వీడియో తీసి రాచకొండ పోలీసులకు పంపించింది.

వెంటనే అప్రమత్తమైన పోలీసులు పెళ్లి మండపానికి చేరుకొని బాల్య వివాహాన్ని అడ్డుకున్నారు. బాలికను వనస్థలిపురంలోని సఖి కేంద్రానికి తరలించారు. ఇరు పక్షాల కుటుంబ పెద్దలకు పోలీసులు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. ఈ ఘటన గురువారం హయత్‌నగర్‌ పోలీసు స్టేషన్‌లో పరిధిలో చోటు చేసుకుంది. రాచకొండ పోలీసు కమిషనర్‌ దేవేంద్రసింగ్‌ చౌహాన్‌.. హయత్‌నగర్‌ ఠాణా డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆర్‌ నిరంజన్, ఎస్‌ఐ ఎన్‌ సూర్య, షీ టీమ్‌ ఏఎస్‌ఐ రాజేందర్‌ రెడ్డి, మహిళా కానిస్టేబుల్‌ అనుష్క, చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ కో–ఆర్డినేటర్‌ నరేష్‌లను అప్రమత్తం చేసి ఘటనా స్థలానికి పంపించి బాల్య వివాహానికి అడ్డుకట్ట వేయడంతో కథ సుఖాంతమైంది.   

ఫోన్‌ చేస్తే అలర్ట్‌ అవుతారని.. 
వీడియో వచి్చన నంబరుకు ఫోన్‌ చేస్తే అమ్మాయి తల్లిదండ్రులు అప్రమత్తమవుతారని ముందుగానే గ్రహించిన పోలీసులు చాకచక్యంగా వ్యవహరించారు. సెల్‌ఫోన్‌ టవర్‌ లొకేషన్‌ ఆధారంగా పెళ్లి జరిగే చోటుకు చేరుకున్నారని వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తంరెడ్డి తెలిపారు. కాగా.. మండపం నుంచి పోలీసులు వెళ్లిపోయే వరకూ పెళ్లి కూతురును బయటికి రానివ్వకుండా 2–3 గంటల పాటు గదిలోనే బంధించారు. భయభ్రాంతులకు గురి చేయడంతో పోలీసులు మైనర్‌ను ప్రశ్నించగా ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. ఉమెన్‌ అండ్‌ చైల్డ్‌ వెల్ఫేర్‌ విభాగం అధికారులు పెళ్లి కూతురితో ఏకాంతంగా మాట్లాడగా.. అసలు విషయం బయటకు చెప్పింది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top