
నమ్మినవారే నడివీధిలో పొడిచి చంపేశారు
రూ.10 లక్షలు ఇస్తానని.. పక్కకు తప్పించాడని పగ
రియల్టర్ హత్యోదంతంలో వెలుగులోకి పలు విషయాలు
కుషాయిగూడ: కొన్నేళ్ల పాటు తమను వెంట తిప్పుకున్నాడని.. మీ లైఫ్ సెట్ చేస్తా.. మంచి జీవితాన్నిస్తానని.. తీరా పక్కకు తప్పించాడని కక్ష పెంచుకున్నవారు శుక్రవారం నడిరోడ్డుపై ఓ రియల్టర్‌ను దారుణంగా హత్య చేసిన ఘటన కలకలం సృష్టించింది. నమ్మినవారే హత్యకు పూనుకోవడం చర్చనీయాంశంగా మారింది. హత్యకు వ్యాపార లావాదేవీలే కారణమని కొందరు, వాటాల పంచాయితీ అని మరికొందరు అంటుండగా.. అసలు విషయం మరోవిధంగా ఉన్నట్లు సమాచారం.
స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. మీర్‌పేట్– హెచ్‌బీకాలనీ డివిజన్ పరిధిలోని మంగాపురం కాలనీలో నివసించే శ్రీకాంత్‌రెడ్డి రియల్ ఎస్టేట్‌తో పాటు వడ్డీ వ్యాపారం కూడా చేసేవారు. లాలాపేట్‌కు చెందిన ఓ రౌడీషిటర్.. శ్రీకాంత్‌రెడ్డితో కలిసి వ్యాపారం చేసేందుకు రూ.2 కోట్లు పెట్టుబడి పెట్టాడు. ఈ క్రమంలో కొంత కాలం క్రితం పెట్టుబడి పెట్టిన రౌడీషిటర్ చనిపోయాడు. దీంతో అతడి కుటుంబ సభ్యులు డబ్బుల కోసం శ్రీకాంత్‌రెడ్డిని అడగసాగారు.
తనకు వ్యాపారంలో నష్టం వచి్చందని నెట్టుకువచ్చాడు. విసిగి వేసారిపోయిన రౌడీషిటర్ సంబంధీకులు మిన్నకుండిపోయినట్లు తెలిసింది. రూ.2 కోట్ల పెట్టుబడి, మిగిలిపోయిన విషయాలు శ్రీకాంత్‌రెడ్డి వెంట ఉండేæ ధన్‌రాజ్, జోసెఫ్‌లకు కూడా తెలుసు. ఈ విషయంపై పలుమార్లు మాట్లాడుకున్నారు. రూ.2 కోట్లు మిగిలాయి కదా.. తమకు రూ.10 లక్షలు ఇవ్వాలని వారు అడిగినట్లు సమాచారం. ఆ సమయంలో శ్రీకాంత్‌రెడ్డి సరే అనడంతో వారు ఆశలు పెంచుకున్నారు.
బీరు తాగించి..
రూ.10 లక్షల విషయాన్ని ధన్‌రాజ్, జోసెఫ్‌లు పలుమార్లు ప్రస్తావించడంతో విసుగుచెందిన శ్రీకాంత్‌రెడ్డి.. మీతో నాకు సంబంధం లేదంటూ వారిని పక్కకు పెట్టినట్లు తెలిసింది. దీంతో వారు పగ పెంచుకున్నారు. పది రోజుల క్రితం మరోసారి శ్రీకాంత్‌రెడ్డిని ఆశ్రయించారు. డబ్బుల కోసం వేడుకున్నారు. అయినా శ్రీకాంత్‌రెడ్డి తీరులో మార్పు రాకపోవడంతో «ధన్‌రాజ్, జోసెఫ్‌లు శుక్రవారం మధ్యాహ్నం నుంచే మద్యం తాగారు. మద్యం మత్తులో హెచ్‌బీకాలనీ, మంగాపురంలోని శ్రీకాంత్‌రెడ్డి ఆఫీసుకు వెళ్లారు. వారితో పాటు తీసుకువచి్చన బీరులోంచి ఓ గ్లాసు శ్రీకాంత్‌రెడ్డికి పోసి తాగించారు. చివరి ప్రయత్నంగా మరోసారి డబ్బులు ఇవ్వాలని బతిమిలాడారు. అప్పటికీ శ్రీకాంత్‌రెడ్డి మాట తీరులో ఏ మాత్రం మార్పు కనిపించకపోవడంతో ఆగ్రహానికి లోనై అతడి గల్లా పట్టుకొని ఆఫీసు బయటికి ఈడ్చుకు వచ్చి కాలనీలో అందరూ చూస్తుండగానే కత్తితో పొడిచి హత్య చేశారు. వీరిద్దరితో పాటు మూడో వ్యక్తి సైతం శ్రీకాంత్‌రెడ్డి ఆఫీసుకు వచి్చనట్లు తెలిసింది. ఆ మూడో వ్యక్తి ఎవరనేది ఆసక్తికరంగా మారింది. శ్రీకాంత్‌రెడ్డి హత్య కేసు నిందితులు ధన్‌రాజ్, జోసెఫ్‌తో పాటు మరో వ్యక్తి పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.