Hyderabad: సిటీలో షుగర్‌ విజృంభిస్తోంది.. జర మేల్కోండి | Hyderabad City Get 4th rank in Diabetes | Sakshi
Sakshi News home page

Hyderabad: సిటీలో షుగర్‌ విజృంభిస్తోంది.. జర మేల్కోండి

Nov 12 2022 4:45 PM | Updated on Nov 12 2022 4:45 PM

Hyderabad City Get 4th rank in Diabetes - Sakshi

దేశంలో మధుమేహం ప్రమాదకర స్థాయిలో పెరుగుతోంది. ఈ విషయాన్ని హెల్త్‌కేర్‌ కంపెనీ ప్రాక్టో తాజా అధ్యయనం వెల్లడించింది. మధుమేహ సమస్యలతో వైద్యులను సంప్రదిస్తున్నవారి సంఖ్యలో భారీ పెరుగుదల కనిపిస్తోందని తేల్చింది. దేశవ్యాప్తంగా నగరాల వారీగా ఈ పెరుగుదల చూస్తే బెంగళూరు అగ్రస్థానంలో ఉండగా, హైదరాబాద్‌ 4వ స్థానంలో ఉన్నట్టు స్పష్టం చేసింది.   

శారీరకశ్రమ లేని జీవనశైలి, లోపభూయిష్ట ఆహారపు అలవాట్లతో మధుమేహం విజృంభిస్తోంది. చిన్న వయసువారిలోనూ ఇది పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. గత అక్టోబరు 2020–సెప్టెంబరు 2021కీ అదే విధంగా అక్టోబర్‌ 2021–సెప్టెంబర్‌ 2022 కీ మధ్య వ్యక్తిగత మధుమేహ సంప్రదింపులకు సంప్రదించి ప్రాక్టో అధ్యయనం పలు విశేషాలను వెల్లడించింది. వాటిలో... 

►ఒక ఏడాదిలో మధుమేహం గురించిన సంప్రదింపులలో మొత్తం 44 శాతం పెరుగుదల నమోదైంది.  
►ఈ రకమైన సంప్రదింపులలో 25– 34 సంవత్సరాల మధ్య వయసు కలిగిన యువకులదే అత్యధిక పెరుగుదల కావడం విశేషం. యువకుల సంప్రదింపుల వాటా ఒక్క ఏడాదిలో 46 శాతం పెరిగింది. అదే విధంగా 35–44 సంవత్సరాల వయస్కుల్లో 23 శాతం 45–54 సంవత్సరాల వయస్కులలో 18శాతం పెరుగుదల కనిపించింది.  
►మధుమేహం గురించిన సంప్రదింపులలో బెంగళూరు 77 శాతం పెరుగుదలతో అగ్రస్థానంలో ఉండగా, 72% పెరుగుదలతో ముంబై, 46% పెరుగుదలతో ఢిల్లీ, 24 శాతంతో హైదరాబాద్‌ వరుసగా తర్వాత స్థానాలలో నిలిచాయి.   
►అయితే మొత్తంగా సంప్రదించిన రోగుల వారీగా చూస్తే 40 శాతంతో ఢిల్లీ తొలి స్థానంలో ఉండగా, 29శాతంతో బెంగుళూరు 2వ స్థానంలో, 24శాతంతో చెన్నై 3వ స్థానంలో,  21శాతంతో హైదరాబాద్‌ 4వస్థానంలో,  9శాతంతో ముంబై 5వ స్థానంలో ఉన్నాయి. మెట్రోలు, ప్రధాన నగరాల తీరు ఇలా ఉన్నాయి.  
►మరోవైపు మధుమేహ రోగుల సంప్రదింపులకు సంబంధించి ద్వితీయశ్రేణి నగరాల వాటా 5 శాతం మాత్రమే కావడం విశేషం. గతంతో పోలిస్తే అదే ఏడాదిలో ఈ నగరాలు 24 శాతం తరుగుదల నమోదు చేయడం గమనార్హం.   

ఆహారపు అలవాట్లలో మార్పు అవసరం 
గతంతో పోలిస్తే ఇప్పుడు యువతలో ఎక్కువగా డయాబెటిస్‌ పెరుగుదల కనిపిస్తోంది. మధుమేహం లక్షణాలతో మమ్మల్ని సంప్రదిస్తున్నవారు రోజురోజుకూ పెరుగుతున్నారు. ఇది నిజంగా ఆందోళనకర పరిణామం. జీవనశైలి మార్పులు, శారీరక శ్రమ, పనివేళలు సరిగా లేకపోవడం, అన్ని రకాల జంక్‌ ఫుడ్‌ సులభంగా లభ్యమవడం వల్ల ఒబెసిటీ, టైప్‌ 2 డయాబెటిస్‌ వంటివి ముఖ్యంగా యువతలో బాగా పెరిగాయి. ఒత్తిడి, ఆల్కహాల్, పొగతాగడం, నైట్‌ షిఫ్ట్స్, నిద్రలేమి కూడా వ్యాధి ముదరడానికి దోహదం చేస్తున్నాయి. ముందుగా ఆహారపు అలవాట్లు సరిదిద్దుకోవడం అవసరం. క్రమబద్ధమైన వ్యాయామం కూడా డయాబెటిస్‌ను దూరం చేయడానికి ఉపకరిస్తుంది.  
–డా. సందీప్‌ దేవిరెడ్డి, కన్సల్టెంట్‌ 
ఎండ్రోక్రైనాలజిస్ట్, కిమ్స్‌ ఆసుపత్రి  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement