అనగనగా గేటెడ్‌ కమ్యూనిటీ.. 24/7వలంటీర్లు

Hyderabad: Bachupally Hill County Association Fight Against Covid 19 - Sakshi

వైరస్‌పై పోరుకు సమష్టి నిర్ణయాలు   

వైద్య నిపుణులతో సూచనలు, సలహాలు 

ఇంటి ముంగిట్లోకి అత్యవసర సేవలు 

సామూహిక కార్యకలాపాల నిలిపివేత 

కరోనా మహమ్మారిని కలిసికట్టుగా ఎదుర్కొనేందుకు బాచుపల్లిలోని హిల్‌కౌంటీ అసోసియేషన్‌ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. కోవిడ్‌కు గురైన వారికి కొండంత ధైర్యాన్నిస్తూ.. వారి ఆరోగ్యం కోసం చర్యలు చేపడుతోంది. వైరస్‌ బాధితులను కంటికి రెప్పలా కాపాడుతూ.. సేవలను ఇంటి వద్దకే సమకూర్చుతోంది. కుత్బుల్లాపూర్‌ బాచుపల్లిలోని హిల్‌కౌంటీ గేటెడ్‌ కమ్యూనిటీకి ఓ ప్రత్యేకత ఉంది. సుమారు 65 ఎకరాల విస్తీర్ణంలో నిర్మితమైన హిల్‌కౌంటీ అపార్ట్‌మెంట్స్‌లో 840 ఫ్లాట్స్, 320 విల్లాలు ఉన్నాయి. వందలాది కుటుంబాలు ఇక్కడ నివాసం ఉంటున్నాయి. కరోనా బాధితులకు మందులతో పాటు అవసరమైన వారికి ఆక్సిజన్‌.. అత్యవసరమైన వారికి ఆస్పత్రుల్లో బెడ్‌లు సమకూరుస్తున్నారు అసోసియేషన్‌ సభ్యులు.     – నిజాంపేట్‌ 

కట్టడి చర్యలు ఇలా..  

  • గేటెడ్‌ కమ్యూనిటీలోని సభ్యులంతా సమష్టి నిర్ణయాలు తీసుకుంటున్నారు. కోవిడ్‌ విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు అత్యవసర సేవలను అందుబాటులో ఉంచారు. 
  • రెండు రోజులకోసారి కాలనీలోని ప్రతి వీధిలో నిజాంపేట్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ సహకారంతో బ్లీచింగ్, సోడియం హైసో క్లోరైట్‌ పిచికారీ చేయిస్తున్నారు. 
  • హిల్‌కౌంటీలోకి వచ్చే ప్రతిఒక్కరినీ థర్మల్‌ స్కానింగ్‌తో టెంపరేచర్‌ పరీక్షిస్తున్నారు.  
  • సామూహిక కార్యకలాపాలకు చెక్‌ పెడుతున్నారు. క్లబ్‌ హౌస్, స్విమ్మింగ్‌ పూల్, జిమ్‌ ఇతర గేమ్స్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు.  
  • రెండు నెలల నుంచి 250 మందికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా.. ఐసోలేషన్‌ అయిన వారందరికీ అవసరమైన సేవలను అందజేశారు. 
  • కోవిడ్‌కు గురైన వారికి కూరగాయలు, మందులు, ఆహార పదార్థాలు అందించేందుకు 24 గంటలు వలంటీర్లను అందుబాటులో ఉంచారు. 
  • హిల్‌కౌంటీ డాక్టర్స్‌ గ్రూపులో అన్ని రకాల వైద్య నిపుణులు ఉన్నారు. పాజిటివ్‌ వచ్చిన వారికి లక్షణాలను బట్టి సంబంధిత వైద్యులు సూచనలు, సలహాలు అందజేస్తూ అవసరమైన మందులను రిఫర్‌ చేస్తున్నారు. కరోనా బాధితులకు 24 గంటల పాటు వైద్య సేవలు అందించేందుకు డాక్టర్‌ సునీల్‌ ఆధ్వర్యంలో అసోసియేషన్‌ కృషి చేస్తోంది.   

మీరూ స్పందించండి.. 
∙కరోనా సెకండ్‌వేవ్‌ ఉద్ధృతితో మీ అపార్ట్‌మెంట్‌/కాలనీలో ఎలాంటి నివారణ చర్యలు తీసుకుంటున్నారు?
∙మహమ్మారి వ్యాప్తిని నిరోధించేందుకు వినూత్నంగా, విభిన్నంగా ఎలా ముందుకెళ్తున్నారు?
∙కోవిడ్‌కు ఎదురొడ్డి ఏ విధంగా నిలువరిస్తున్నారు? 
∙మీ అపార్ట్‌మెంట్‌/కాలనీలో ఎవరికైనా కోవిడ్‌ వస్తే ఎలా చేయూతనిస్తున్నారు?
∙వారిలో ధైర్యాన్ని ఎలా నింపుతున్నారు? .... అయితే ‘సాక్షి’ మీకు తోడుగా నిలుస్తుంది. 
మీ మీ అపార్ట్‌మెంట్లలో చేపట్టిన కోవిడ్‌ కట్టడిని ఫొటోతో సహా మాతో పంచుకోండి. దిగువ తెలిపిన నంబర్లకు వాట్సాప్‌/మెయిల్‌ చేయండి.   

చదవండి: అనగనగా సొసైటీ.. ఒక్క కేసు కూడా నమోదు కాని వైనం

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top