లేఅవుట్‌ డెవలపర్లకు గట్టి షాక్‌...రిజిస్ట్రేషన్ల శాఖ కీలక నిర్ణయం..!

Hmda Dtcp Did Not Approved Layout Not for Sale Registration in Telangana - Sakshi

అవి లే‘అవుట్‌’

అనుమతి లేని వెంచర్లలో కొత్తగా రిజిస్ట్రేషన్లు ఉండవు

లేఅవుట్లకు హెచ్‌ఎండీఏ, డీటీసీపీ అనుమతులు ఉండాల్సిందే 

సుప్రీం ఆదేశాల మేరకు ఉత్తర్వులు జారీ చేసిన రిజిస్ట్రేషన్ల శాఖ

సాక్షి, హైదరాబాద్‌: లేఅవుట్‌ డెవలపర్లకు పెద్ద షాక్‌ తగిలింది. హెచ్‌ఎండీఏ, డైరెక్టర్‌ ఆఫ్‌ టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌(డీటీసీపీ) అనుమతులు లేని ప్లాట్ల రిజిస్ట్రేషన్‌ను అంగీకరించేది లేదని రిజిస్ట్రేషన్ల శాఖ తేల్చిచెప్పింది. ఈ మేరకు సుప్రీంకోర్టు తీర్పును ఉటంకిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం లేఅవుట్లలో ఉన్న అనుమతి లేని ప్లాట్లపై క్రయవిక్రయ లావాదేవీలు జరిపే అవకాశం ఉండదు. గతంలోనే ఈ ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ రియల్టర్లకు అనుకూలంగా హైకోర్టు తీర్పు ఇచ్చింది. అనుమతి లేకున్నప్పటికీ లేఅవుట్లలోని ప్లాట్లను రిజిస్ట్రేషన్‌ చేయాలని, సదరు ప్లాట్లకు అనుమతులు లేవని, దీనిపై లావాదేవీలు జరపడం క్రయ, విక్రయదారుల రిస్క్‌ అంటూ ఆ రిజిస్టర్డ్‌ డాక్యుమెంట్‌పై పేర్కొనాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కానీ, ఈ తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానంలో సవాల్‌ చేయడంతో ఈ మేరకు కొట్టివేసింది. ఎట్టి పరిస్థితుల్లో అనుమతుల్లేని ప్లాట్ల క్రయ, విక్రయ లావాదేవీలకు అనుమతి ఇవ్వవద్దని తీర్పునిచ్చింది. ఈ తీర్పుకు అనుగుణంగా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ శుక్రవారం నుంచి సదరు ప్లాట్ల రిజిస్ట్రేషన్లను నిలిపివేసింది. 

అమ్ముడుపోకుండా మిగిలినవాటికే..
అనుమతుల్లేని లేఅవుట్ల ప్లాట్లను క్రమబద్ధీకరించుకోవాలని గతంలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఇందుకోసం స్థలాల రెగ్యులరైజేæషన్‌ స్కీం(ఎల్‌ఆర్‌ఎస్‌)ను ప్రవేశపెట్టింది. ఈ పథకంపట్ల ప్రజల నుంచి వ్యతిరేకత రావడం... హైదరాబాద్‌ నగరపాలక సంస్థ ఎన్నికల్లో అధికారపార్టీకి చేదు ఫలితాలు రావడంతో ఉపసంహరించుకున్న ప్రభుత్వం లేఅవుట్లలో అప్పటికే అమ్ముడైన ప్లాట్లను రిజిస్ట్రేషన్‌ చేయాలని, అప్పటివరకు అమ్మని ప్లాట్లకు అనుమతులు తీసుకోవాలని స్పష్టం చేసింది. తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కూడా అక్రమ లేఅవుట్లలో డెవలపర్ల వద్ద ఉన్న ప్లాట్లకు మాత్రమే వర్తిస్తుందని, ఇప్పటికే క్రయవిక్రయ లావాదేవీలు జరిపిన ప్లాట్లకు వర్తించదని రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు వెల్లడించారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top