భగ్గుమంటున్న కూరగాయల ధరలు

Highly Increase Vegetables Rates - Sakshi

సగానికిపైగా పడిపోయిన సాగు

రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి

గత ఏడాది 1.32 లక్షల ఎకరాల్లో పంటలు

ఈ ఏడాది 61 వేల ఎకరాల్లోనే సేద్యం

సాక్షి ప్రతినిధి, సూర్యాపేట :  రాష్ట్ర వ్యాప్తంగా కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. కరోనాతో ఆర్థికంగా దెబ్బతిన్న కుటుంబాలకు కూరగాయల కొనుగోళ్లు భారంగా మారాయి. రూ.200 పెట్టినా.. సగం సంచి నిండడం లేదు. గత ఏడాదితో పరిశీలిస్తే.. ఈ ఏడాది వానాకాలం అంతటా కూరగాయల సాగు పడిపోవడమే ఇందుకు కారణం. నీటి పారుదల వనరులతో మెట్ట ప్రాంతాల్లో తరి పంటలే ఎక్కువగా సాగయ్యాయి. వరి సాగుకు రైతులు మొగ్గు చూపడంతో కూరగాయల సాగు పడిపోయింది. గత ఏడాది 1,32,610 ఎకరాల్లో కూరగాయలు, ఆకుకూరలు సాగయితే, ఈ ఏడాది 61,153 ఎకరాల్లోనే ఈ పంట సాగు విస్తీర్ణం నమోదైంది. ఈ పరిస్థితితో కూరగాయల ధరలు పెరిగాయి.

రాజధాని చుట్టూ తగ్గిన సాగు 
రాజధాని చుట్టు పక్కల ఉన్న జిల్లాల్లో కూరగాయల సాగు విస్తీర్ణం భారీగా తగ్గింది. రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట, నల్లగొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జిల్లాల్లో గత ఏడాది సాగు విస్తీర్ణం కన్నా ఈసారి 50 శాతం లోపే సాగు చేశారు. ఈ వానాకాలం రాష్ట్రంలో భారీ వర్షాలు పడటంతో భూగర్భ జలాలు అనూహ్యంగా పైకివచ్చాయి. దీంతో రైతులు మెట్ట పంటలను వదిలి తరి పంటల సేద్యం బాట పట్టారు. టమాట, బెండకాయ, వంకాయ, దొండకాయ, దోసకాయ, పచ్చిమిర్చి, సొరకాయ వంటి కూరగాయలు ప్రతి గ్రామాల్లో కొన్ని ఎకరాల్లోనైనా పండేవి. నీటి వనరుల కళతో రైతులు కూరగాయల సాగును పక్కన పెట్టి ఎక్కువగా వరి సాగు చేశారు. ఎస్సారెస్పీ, కాళేశ్వరం జలాలతో మెట్ట ప్రాంతమంతా తరిగా మారడంతో ఈ ప్రాజెక్టుల ఆయకట్టు ప్రాంతాల్లోనూ కూరగాయల సాగు విస్తీర్ణం తగ్గింది.

కూరగాయల సాగు విస్తీర్ణం తగ్గడంతో దీని ప్రభావం ధరలపై పడింది. ఏ కూరగాయలను కొనుగోలు చేయాలన్నా ధరను చూసి సామాన్య ప్రజలకు దడ పుడుతోంది. పచ్చి మిర్చి కేజీ రూ.100, బెండకాయ, వంకాయ, టమాట రూ.60 పైనే పలుకుతోంది. గత ఏడాది కన్నా రెండు, మూడు రెట్లు పెరిగాయి. ఐదు నెలలుగా కూరగాయల ధరలు పెరుగుతూనే ఉన్నాయనీ కానీ దిగి రావడం లేదు. అయితే ఈ పంటలు కొద్దిగొప్పో సాగు చేసిన రైతులకు మాత్రం దండిగా ఆదాయం సమకూరుతోంది. ఒకప్పుడు మార్కెట్‌లో టమాటకు కిలో రూ. 2 కూడా పెట్టలేదని, గత ఐదు నెలలుగా కేజీ హోల్‌సేల్‌గా తోట వద్దే రూ.40కి పైగా అమ్ముతున్నట్లు రైతులు పేర్కొంటున్నారు.  

గత ఏడాది, ఈ ఏడాది పలు జిల్లాల్లో 
కూరగాయల సాగు విస్తీర్ణం (ఎకరాల్లో) .. 

 జిల్లా         గత ఏడాది    ఈ ఏడాది 
రంగారెడ్డి     37,579     13,652 
వికారాబాద్‌   5,664      6,328 
సంగారెడ్డి     6,823      3,535 
నల్లగొండ     4,269      1,191 
సిద్దిపేట      9,902       4,696 
సూర్యాపేట    2,418       825 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top