కొత్త రకం కరెంట్‌ బిల్లు బాదుడు.. ఏసీడీ పేరిట భారీ వసూళ్లు

High Electricity Bills Collected Name Of ACD Charge In Nizamabad - Sakshi

ఏసీడీ పేరిట రూ. వేలల్లో బిల్లు 

అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న వినియోగదారులు  

జిల్లాలో 4 లక్షల 80 వేల భవనాలకు విద్యుత్‌ కనెక్షన్‌లు 

రెంజల్‌ (బోధన్‌): ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలోని విద్యుత్‌ వినియోగారులకు ఆ సంస్థ సంక్రాంతి పండగ షాకిచ్చింది. ఈ నెలలో ఏసీడీ డ్యూ పేరుతో కొత్త రకం వసూళ్లకు పూనుకుంది. బిల్లులు చూసి వినియోగదారులు షాకవుతున్నారు. ఇదేం బాదుడంటూ ట్రాన్స్‌కో అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ప్రతి నెల వచ్చే సాధారణ బిల్లుతో పాటు అదనపు బిల్లు రావడంతో మొదట్లో అర్థం కాక వదిలేశారు. బిల్లులు కట్టేందుకు వెళ్లిన వినియోగదారులకు సిబ్బంది ఏసీడీ డ్యూ చెల్లించాలని చెప్పడంతో ఖంగుతింటున్నారు. 

కొంత మందికి రూ. వందల్లో ఏసీడీ బిల్లు రాగా, మరి కొందరికి రూ. వేలల్లో బిల్లులు వచ్చాయి. దీంతో కొత్త రకం చార్జీలు ఎందుకు చెల్లించాలని వినియోగదారులు సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. ముందుగా వినియోగదారులకు అవగాహన కల్పించాల్సిన ట్రాన్స్‌కో అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోక పోవడంతో బిల్లులు చెల్లించేందుకు ఆందోళన చెందుతున్నారు. డిసెంబర్‌లో వినియోగించిన విద్యుత్‌ బిల్లును జనవరిలో విద్యుత్‌ వినియోగదారులకు అందించారు. అందులో ఏసీడీ డ్యూపేరుతో బిల్లుతో పాటు అదనపు బిల్లును వేశారు. గత సంవత్సరం వినియోగదారుల నుంచి అభివృద్ధి చార్జీల పేరుతో అదనంగా వసూలు చేసిన విద్యుత్‌ పంపిణీ సంస్థ ఈ యోడు మరో పిడుగు వేసింది. 

ఏసీడీ డ్యూ అంటే.. 
ఏసీడీ (అడిషనల్‌ కన్జమ్షన్‌ డిపాటిజ్‌) పేరు బిల్లుల్లో చేరడంతో వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. వినియోగంతో సంబంధం లేకుండా వేలల్లో బిల్లులు రావడంతో లబోదిబోమంటున్నారు. జిల్లాలో 4 లక్షల 80 వేల వరకు గృహావసరాల విద్యుత్‌ కనెక్షన్‌లు ఉన్నాయి. వినియోగదారు వినియోగించిన యూనిట్లతో సంబంధం లేకుండా చిన్నా, పెద్దా తేడాలేకుండా వినియోగదారైతే చాలు అన్నట్లు విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఎన్‌పీడీసీఎల్‌) వ్యవహరించిందనే విమర్శలు వస్తున్నాయి. గత సంవత్సరం గృహావసరాల వినియోగదారులకు యూనిట్‌కు 50 పైసలు, వ్యాపార సముదాయాలకు రూ. 1 చొప్పున పెంచారు. దీంతో పాటు కస్టమర్, డెవలప్‌మెంట్‌ చార్జీలు వసూలు చేశారు. తాజాగా సంస్థ ఏసీడీ పేరుతో మరో రకం బాదుడుతో వినియోగారులు విలవిల్లాడుతునారు.  

అడ్జస్ట్‌ చేస్తాం..
తర్వాత విడతల వారీగా నెలవారి యూనిట్లలో వచ్చే బిల్లుల్లో తగ్గించడం జరుగుతుంది. వినియోగదారులు సంవత్సరం పాటు వినియోగించిన యూనిట్లను యావరేజ్‌గా తీసుకుని ఈ నెల బిల్లులో వేయడం జరిగింది. ప్రతి నెలా చెల్లించే బిల్లులో అడ్జస్ట్‌ చేస్తాం 
–రాపెల్లి రవీందర్, ఎస్‌ఈ  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top