సునీల్‌ కనుగోలుకు హైకోర్టులో చుక్కెదురు

High Court Of Telangana Rejects Sunil Kanugolu Petition - Sakshi

హైదరాబాద్‌:  కాంగ్రెస్‌ వార్‌ రూమ్‌ కేసులో తెలంగాణ కాంగ్రెస్‌ వ్యూహకర్త సునీల్ కనుగోలుకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. సైబర్‌ క్రైం పోలీసుల ఎదుట హాజరు కావాల్సిందేనని సునీల్‌ కనుగోలుకు ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. పోలీసుల విచారణకు సహకరించాలని మంగళవారం విచారణ సందర్భంగా హైకోర్టు పేర్కొంది. ఈ నెల8వ తేదీన విచారణకు హాజరు కావాలని సునీల్‌ కనుగోలును తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.

కాగా, తెలంగాణ గళం పేరుతో సోషల్‌ మీడియాలో సర్క్యులేట్‌ అయిన మీమ్స్‌ వీడియోల కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఆ పార్టీ వ్యూహకర్త సునీల్‌ కనుగోలుకు సిటీ సైబర్‌క్రైమ్‌ పోలీసులు ఇటీవల నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. సీఆర్పీసీ 41 (ఏ) కింద పోలీసులు నోటీసులు ఇచ్చారు.

తుకారాంగేట్‌ ప్రాంతానికి చెందిన ప్రైవేట్‌ ఉద్యోగి ఆర్‌.సామ్రాట్‌ ఫిర్యాదుతో గతేడాది నవంబర్‌ 24న హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. దీని దర్యాప్తులో లభించిన క్లూ ఆధారంగా పోలీసులు ఈ నెల 13న రాత్రి మాదాపూర్‌లోని మైండ్‌షేర్‌ యునైటెడ్‌ ఫౌండేషన్‌లో ఉన్న కార్యాలయంపై దాడి చేశారు. అప్పుడే ఇది కాంగ్రెస్‌ పార్టీ వార్‌ రూమ్‌గా తెలిసింది.

అక్కడ పట్టుబడిన ముగ్గురి విచారణలో సునీల్‌ కనుగోలు పేరు వెలుగులోకి వచ్చింది. విచారణకు రాకపోతే అరెస్టు సహా ఇతర చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో పోలీసులు స్పష్టం చేశారు. దీనిపై హైకోర్టుకు వెళ్లారు సునీల్‌ కనుగోలు. 41 ఏ సీఆర్‌పీసీ సెక్షన్ కింద ఇచ్చిన నోటీసుపై స్టే ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈరోజు(మంగళవారం) విచారణ జరిపిన హైకోర్టు..కచ్చితంగా పోలీసుల ఎదుట విచారణకు హాజరు కావాలని స్పష్టం చేసింది. అదే సమమంలో సునీల్‌ కనుగోలును అరెస్ట్‌ చేయవద్దని పోలీసుల్ని ఆదేశించింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top