హైదరాబాద్‌లో దంచికొడుతున్న వాన.. ఫుల్‌ ట్రాఫిక్‌ జామ్‌ | Heavy Rain Fall In Hyderabad And Telangana News Updates, Check Out Weather Condition Headlines | Sakshi
Sakshi News home page

Hyderabad Rains: హైదరాబాద్‌లో కుండపోత వర్షం.. సీఎం రేవంత్‌ కీలక ఆదేశాలు

Sep 26 2025 7:38 AM | Updated on Sep 26 2025 10:27 AM

Heavy Rain Fall In Hyderabad And Telangana Updates

తెలంగాణ వర్షాలు అప్‌డేట్స్‌.. 

👉హైదరాబాద్‌లో ఎడతెరిపిలేని కుండపోత వర్షం కురుస్తోంది. రానున్న రెండు గంటల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. 

 

 👉పశ్చిమ వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం కారణంగా తెలంగాణలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. రాగల 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని హైదరాబాద్​ వాతావరణ కేంద్రం(Telangana Rains) ప్రకటించింది. అల్పపీడన ప్రభావంతో ఇవాళ, రేపు, ఎల్లుండి రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.

 

👉నేడు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రేపు, ఎల్లుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అల్పపీడన ప్రభావంతో గురువారం రాత్రి నుంచే హైదరాబాద్‌(Hyderabad Rains) సహా పలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లో కుండపోత వర్షం కురుస్తోంది. ఇక, నేడు ఆదిలాబాద్​, మంచిర్యాల, కుమురం భీం ఆసిఫాబాద్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. హనుమకొండ, వరంగల్​, మహబూబాబాద్​ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ మేరకు ఉత్తర తెలంగాణ జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్​ హెచ్చరికలు జారీ చేసింది.

సీఎం రేవంత్ ఆదేశాలు.. 
👉రానున్న రెండు రోజుల పాటు భారీ వర్షాల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఆదేశించారు. జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని సూచించారు. అవసరమైతే లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని, వరద నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి ముందస్తుగా ట్రాఫిక్‌ నిలిపివేయాలని అన్నారు. వర్షం కురిసే సమయంలో ప్రజలు అనవసరంగా రోడ్లపైకి రావొద్దని సీఎం సూచించారు. జీహెచ్ఎంసీ, హైడ్రా, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తంగా ఉండాలని వెల్లడించారు.

వాన ముసురు..
హైదరాబాద్‌లో రాత్రి నుంచి ముసురు వీడడం లేదు. జూబ్లీహిల్స్​, బంజారాహిల్స్​, ఫిల్మ్‌నగర్‌, పంజాగుట్ట, అమీర్‌పేట​, ఖైరతాబాద్​, రాజేంద్రనగర్​, కిస్మత్​పూర్​, గండిపేట్​, అత్తాపూర్​, ఆరాంఘర్​, శంషాబాద్​, దిల్​సుఖ్​నగర్​, చైతన్యపురి, కుత్బుల్లాపూర్, సుచిత్ర, కొంపల్లి, గండిమైసమ్మ, దుండిగల్​, గుండ్లపోచంపల్లి, బహుదూర్​పల్లి, సూరారం, జీడిమెట్ల, చింతల్​, షాపూర్​నగర్​, గాజులరామారం, జగద్గిరిగుట్ట, బాలానగర్​, శంకర్​పల్లి, మోకిలలో తెల్లవారుజాము 3 గంటల నుంచి వర్షం కురుస్తూనే ఉంది. రోడ్లపై వరదనీరు పారుతోంది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. అక్కడి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

ఇది కూడా చదవండి: ఇక తెలంగాణ సర్కార్‌ వారి మెట్రో..

15 జిల్లాలకు అతి భారీ వర్ష సూచన..
రాష్ట్రంలో 15 జిల్లాలకు వాతావరణశాఖ అతి భారీ వర్ష సూచన చేసింది. శుక్రవారం ఈ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 10 నుంచి 20 సెం.మీ. వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో నిర్మల్​, నిజామాబాద్​, జగిత్యాల, సిరిసిల్ల, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్​, వరంగల్​, వికారాబాద్​, సంగారెడ్డి, మెదక్​, కామారెడ్డి, మహబూబ్​నగర్​, వనపర్తి, నాగర్‌ కర్నూల్​ జిల్లాలకు ఆరెంజ్​ హెచ్చరికలు జారీ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement