చెరువులకు హెల్త్‌ చెకప్‌! | Health survey for ponds in Telangana | Sakshi
Sakshi News home page

చెరువులకు హెల్త్‌ చెకప్‌!

Apr 27 2026 4:13 AM | Updated on Apr 27 2026 4:13 AM

Health survey for ponds in Telangana

రాష్ట్రంలోని చెరువులకు ఆరోగ్య సర్వే

డిజిటల్‌గా ఎఫ్‌టీఎల్, నీటి విస్తరణ, ఆయకట్టు నిర్ధారణ 

ఆ తర్వాత పూడికతీత.... కార్పొరేట్‌ సంస్థలు, ఎన్జీవోలకు చెరువుల దత్తత 

రాష్ట్రంలో నీటి వినియోగ సంఘాల పునరుద్ధరణ 

చెరువుల పరిరక్షణ కమిటీల ఏర్పాటు.. నీటి వివాదాల పరిష్కార బాధ్యత కమిటీదే 

ప్రభుత్వానికి వ్యవసాయ కమిషన్‌ నివేదిక

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని చిన్న నీటి వనరులను కాపాడేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. ముఖ్యంగా గతంలో ఉన్న నీటి వినియోగదారుల సంఘాలను పునరుద్ధరించనుంది. ఈ మేరకు కొత్తగా నామినేటెడ్‌ పద్ధతిలో చెరువుల పరిరక్షణ కమిటీ (టీపీసీ)లను ఏర్పాటు చేసే దిశలో కీలక అడుగుపడింది. చిన్న నీటిపారుదల రంగంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు ఏం చేయాలన్న దానిపై అధ్యయనం చేసి రూపొందించిన నివేదికను తెలంగాణ రాష్ట్ర రైతు సంక్షేమ కమిషన్‌ ఇటీవల ప్రభుత్వానికి సమర్పించింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ నివేదికలో పలు కీలకాంశాలను ప్రస్తావించిన కమిషన్‌.. సాగునీటి చెరువుల సమగ్ర పునరుద్ధరణ, నిర్వహణ, సంరక్షణ కోసం స్వయంసంవృద్ధితో కూడిన నమూనాను రూపొందించింది. ఏఐసీసీ కిసాన్‌ సెల్‌ జాతీయ నాయకుడు ఎం.కోదండరెడ్డి నేతృత్వంలో ఏర్పాటైన రైతు కమిషన్‌ పలు సిఫారసులు చేసింది. ప్రభుత్వం త్వరలోనే కీలక నిర్ణయాలు తీసుకోనుంది.  

నివేదికలోని ముఖ్యాంశాలు 
చెరువుల పరిరక్షణ కమిటీలను ప్రత్యేక జీవో ద్వారా ఏర్పాటు చేయాలి. ప్రతి మైనర్‌ ఇరిగేషన్‌ చెరువు, దాని ఆయకట్టు పరిధిలో ఈ కమిటీ పనిచేస్తుంది. సాగునీటి శాఖ చీఫ్‌ ఇంజనీర్‌ సలహా మేరకు జిల్లా కలెక్టర్లు ఈ కమిటీ సభ్యులను నామినేట్‌ చేస్తారు. చైర్మన్‌తోపాటు కన్వీనర్‌ లేదా మెంబర్‌ సెక్రటరీ, 9 మంది సభ్యులు ఉంటారు. పదవీకాలం రెండేళ్లు. 
⇒ ఈ కమిటీ చెరువుల పూడికతీత, కట్ట పటిష్టం చేయడం, తూముల మరమ్మతులకు ప్రణాళికలు రూపొందిస్తుంది. సాంకేతికేతర పనుల కోసం సమాజ భాగస్వామం దిశలో శ్రమదానం నిర్వహణ, రైతుల మధ్య నీటి వివాదాల పరిష్కారం, ఆర్థిక లావాదేవీలు, నీటి వినియోగ రికార్డుల నిర్వహణ, పనుల సోషల్‌ ఆడిట్‌ నిర్వహించి గ్రామపంచాయతీలకు సమర్పించడం లాంటి విధులు నిర్వహిస్తాయి.  

⇒ చెరువు గర్భం, ముంపు ప్రాంతాల్లో ఆక్రమణల నిరోధం కోసం ఈ కమిటీ చెరువు పోలీస్‌గా పనిచేస్తుంది. ఈ కమిటీతోపాటు వ్యవసాయ శాఖ నిర్దేశించిన విధంగా ఆ చెరువుల పరిధిలోని రైతులు పంటలు సాగు చేసుకోవాలి. చెరువుల్లో చెత్త, పూడిక వేయకుండా నివారించాలి. ఈ కమిటీలకు పంచాయతీరాజ్, వ్యవసాయ, నీటి పారుదలశాఖలు సహకరిస్తాయి.  
⇒ చెరువులను నాలుగు రకాలుగా వర్గీకరించాలి. సాగునీటి చెరువు, బహుళ ప్రయోజన జీవనోపాధి చెరువు, పట్టణ శివారు/రీచార్జ్‌ చెరువు, ఎకోటూరిజం లేదా జీవవైవిధ్య చెరువులుగా వర్గీకరించి నిర్వహణ లక్ష్యాన్ని పెట్టుకుంటారు.  

⇒ ప్రతి చెరువుకు ఆరోగ్య సర్వే నిర్వహిస్తారు. అంటే ఆయా చెరువుల్లో పూడిక, కట్ట పరిస్థితి, తూము లేదా అలుగు స్థితి నిర్ధారించేందుకు నీటిపారుదల శాఖతో కలిసి ఉమ్మడి సర్వే నిర్వహించాలి. డ్రోన్లు లాంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చెరువు పూర్తిస్థాయి నీటి మట్టం (ఎఫ్‌టీఎల్‌), నీరు విస్తరించే ప్రాంతం, ఆయకట్టును డిజిటల్‌ మ్యాపింగ్‌ చేయాలి.  
⇒ పోషకాలు అధికంగా ఉండే పూడిక మట్టిని స్థానిక రైతులకు ఉచితంగా ఇస్తారు. రవాణా ఖర్చులు రైతులు భరించాలి. ఇటుకబట్టీలు, రహదారుల నిర్మాణానికి పోషకాలు లేని మట్టిని ఉపయోగించుకోవచ్చు. పనికిరాని పూడిక విక్రయం ద్వారా వచ్చిన సొమ్మును టీపీసీ ఖాతాలో జమ చేయాలి. 

⇒ చెరువు కట్టలకు మరమ్మతులు చేయడంతోపాటు కోతను నిరోధించేందుకు వెటివర్, ఇతర లోతైన వేర్లు కలిగిన గడ్డి మొక్కలను నాటాలి. తూము గేట్లు, అలుగులు, ఇన్‌లెట్, అవుట్‌లెట్‌ చానెళ్లకు మరమ్మతు చేయాలి. 
⇒ పనుల పురోగతిని సమీక్షించేందుకు ప్రతి నెలా టీపీసీ సమావేశమవుతుంది. టీపీసీ స్థాయిలో పరిష్కారం కాని సమస్యలను మండలపరిషత్‌ అధికారి నేతృత్వంలోని గ్రీవెన్స్‌ సెల్‌ పర్యవేక్షిస్తుంది.  
⇒ అడాప్ట్‌ ఎ ట్యాంక్‌ విధానంలో చెరువు అభివృద్ధి కోసం కార్పొరేట్‌ సంస్థలు, ఎన్‌ఆర్‌ఐలు, స్వచ్ఛంద సంస్థలు, రెసిడెంట్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్లకు దత్తత ఇవ్వొచ్చు. విద్యాసంస్థల భాగస్వామ్యంతో చెరువుల పట్ల అవగాహన కల్పించడం, చెరువు రక్షణ దళం (స్టూడెంట్స్‌ క్లబ్‌) ఏర్పాటు చేయడం, ఎన్‌ఎస్‌ఎస్, ఎన్‌సీసీ లాంటి విభాగాల సహకారంతో మొక్కలు నాటడం, విశ్వవిద్యాలయాల ద్వారా మరిన్ని పరిశోధనలు, వార్షిక చెరువు మేళాల నిర్వహణ లాంటి కార్యక్రమాలను నిర్వహించాల్సి ఉంటుంది.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement