హైదరాబాద్‌ అభివృద్ధిని.. ఏ శక్తులూ అడ్డుకోలేవు | Grand Sadar celebrations under the leadership of Anjankumar Yadav | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ అభివృద్ధిని.. ఏ శక్తులూ అడ్డుకోలేవు

Oct 28 2024 3:48 AM | Updated on Oct 28 2024 3:48 AM

Grand Sadar celebrations under the leadership of Anjankumar Yadav

మూసీ పునరుజ్జీవంపై దృఢ సంకల్పంతో సాగుతున్నాం: సీఎం రేవంత్‌రెడ్డి 

హైదరాబాద్‌ అభివృద్ధిలో యాదవుల పాత్ర ఎనలేనిది 

సదర్‌ ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటన 

టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అంజన్‌కుమార్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో ఘనంగా సదర్‌ ఉత్సవాలు

కవాడిగూడ (హైదరాబాద్‌): మురికి కూపంగా మారిన మూసీ నదికి పునరుజ్జీవం కల్పి0చాలనే దృఢ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. మూసీ పరీవాహక ప్రాంత ప్రజల జీవన ప్రమా ణాలను మెరుగుపరుస్తామని తెలిపారు. హైదరాబాద్‌ అభివృద్ధిని ఏ శక్తులూ అడ్డుకోలేవని.. నగరాన్ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసే బాధ్యత కాంగ్రెస్‌ ప్రభుత్వానిదని పేర్కొన్నారు. 

దీపావళి పండుగ నేపథ్యంలో యాదవులు హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించే సదర్‌ ఉత్సవాలు ఆదివారం ఇందిరాపార్కు ధర్నాచౌక్‌ వద్ద ఘనంగా జరిగాయి. టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో.. ఉదయం 10  నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించిన ఈ ఉత్సవంలో సీఎం రేవంత్‌రెడ్డి, పలువురు మంత్రులు, స్పీకర్‌ ప్రసాద్‌కుమార్, నేతలు పాల్గొన్నారు. 

శ్రీకృష్ణుడి విగ్రహానికి సీఎం రేవంత్, స్పీకర్‌ ప్రసాద్‌కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్‌ పూజలు చేసి ఉత్సవాలను ప్రారంభించారు. డప్పు వాయిద్యాలకు అనుగుణంగా దున్నపోతుల విన్యాసాలు, యాదవుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. జంట నగరాలలోని యాదవులు దున్నపోతులను ప్రత్యేకంగా అలంకరించి బ్యాండ్‌మేళాలతో ఊరేగింపుగా తీసుకువచ్చి ఉత్సవాల్లో పాల్గొన్నారు. వివిధ జిల్లాల నుంచి వేల మంది యాదవులు కూడా హాజరయ్యారు. 

యాదవులకు రాజకీయాల్లో సముచిత స్థానం
హైదరాబాద్‌ మహానగర అభివృద్ధిలో యాదవుల పాత్ర ఎనలేనిదని సీఎం రేవంత్‌ కొనియాడారు. సదర్‌ అంటే యాదవుల ఖదర్‌ అని.. యాదవులు రాజకీయంగా ఎదగాలనే అనిల్‌కుమార్‌ యాదవ్‌ను రాజ్యసభకు పంపామని చెప్పారు. రాబోయే రోజుల్లో యాదవ సామాజిక వర్గానికి రాజకీయాల్లో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. యాదవ సామాజిక వర్గం ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరారు. 

ఇక నుంచి ఏటా సదర్‌ సమ్మేళనాన్ని అధికారికంగా నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కాగా.. శ్రీకృష్ణుడు యాదవులను ఆశీర్వదించినట్టుగానే రాష్ట్ర ప్రభుత్వ హామీలు అమలు చేసే విధంగా సీఎం రేవంత్‌రెడ్డికి ఆశీస్సులు అందజేయాలని కోరుతున్నానని స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ పేర్కొన్నారు. 

తెలంగాణలో పూర్వకాలం నుంచీ వ్యవసాయమే ప్రధాన జీవనాధారంగా ఉందని, అందుకు తోడ్పడే పశువులను యాదవులు ప్రాణసమానంగా పూజించడం గొప్ప సంస్కృతి అని మంత్రి పొన్నం ప్రభాకర్‌ కొనియాడారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వివేక్‌ వెంకటస్వామి,, కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు మైనంపల్లి హన్మంతరావు, కృష్ణాయాదవ్, ఏపీ మాజీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement