చిన్న పరిశ్రమల కోసం కొత్త క్లస్టర్లు

Govt Set Up To Support For Development Msme Telangana - Sakshi

ఎంఎస్‌ఎంఈలను ప్రోత్సహించేందుకు సర్కారు చర్యలు 

ప్రధాన పారిశ్రామికవాడల్లో మౌలిక వసతుల కల్పన వేగవంతం

సాక్షి, హైదరాబాద్‌: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను (ఎంఎస్‌ఎంఈ) ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త పారిశ్రామిక క్లస్టర్లు ఏర్పాటు చేయనుంది. దీంతో పాటు వ్యవస్థాపకులు తమ యూనిట్లను యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేసేందుకు వీలుగా ప్రధాన పారిశ్రామికవాడల్లో మౌలిక వసతుల కల్పనను వేగవంతం చేయనుంది. మరోవైపు రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఎంఎస్‌ఎంఈల నడుమ పోటీ తత్వాన్ని పెంచేందుకు ప్రోత్సాహకాలతో పాటు అవార్డులు కూడా ఇవ్వాలని నిర్ణయించింది. ఎంఎస్‌ఎంఈలో ఉత్పాదకత, సృజనాత్మకత, భద్రతకు సంబంధించిన కృషిని గుర్తిస్తూ రాష్ట్ర స్థాయితో పాటు 33 జిల్లాల్లో అవార్డులు ఇవ్వాలని పరిశ్రమల శాఖ నిర్ణయించింది. ‘తెలంగాణ ముత్యాలు’పేరిట ఇచ్చే ఈ అవార్డు కోసం 2022–23 బడ్జెట్‌లో రూ.50 లక్షలు కేటాయించింది.  

ఉత్పాదకత, నాణ్యత మెరుగు పరిచేలా.. 
ఎంఎస్‌ఎంఈ రంగాన్ని బలోపేతం చేసేందుకు ఏర్పాటు చేస్తున్న క్లస్టర్లలో ఉమ్మడి సదుపాయాల కేంద్రాలను పరిశ్రమల శాఖ నెలకొల్పుతుంది. తద్వారా ఉత్పాదకత, నాణ్యతను మెరుగు పరుచుకోవంతో పాటు ముడిసరుకు కొనుగోలు, మార్కెటింగ్‌లో సంప్రదింపులు బలోపేతం చేసుకునే వెసులుబాటు ఆయా పరిశ్రమల యాజమాన్యాలకు లభిస్తుంది.  

కేంద్ర సర్కారు భాగస్వామ్యం 
క్లస్టర్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌లో భాగంగా రాష్ట్రాల్లో ఏర్పాటయ్యే పారిశ్రామిక క్లస్టర్లకు కేంద్ర ఎంఎస్‌ఎంఈ మంత్రిత్వ శాఖ సాయం అందిస్తోంది. రాష్ట్రాలు కూడా తమ వంతు వాటాగా క్లస్టర్ల అభివృద్ధికి నిధులు కేటాయించాల్సి ఉంటుంది. ఇప్పటికే రాష్ట్రంలో 12 క్లస్టర్లు ఈ పథకంలో భాగంగా పురోగతిలో ఉండగా, వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరో 19 జిల్లాల్లో పారిశ్రామిక క్లస్టర్లను అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఒక్కో క్లస్టర్‌ ఏర్పాటుకు రూ.10 కోట్లు చొప్పున అవసరమవుతాయని అంచనా వేయగా, ఇందులో కేంద్రం వాటాగా రూ.8 కోట్లు, రాష్ట్రం వాటాగా రూ.2 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తన వంతు వాటాగా రూ.38 కోట్లు ఇచ్చేందుకు సన్నద్ధమవుతోంది.

పరిశ్రమల ఏర్పాటుకు పెట్టుబడిదారులు ముందుకు వస్తున్నా కొన్ని సందర్భాల్లో పారిశ్రామిక వాడల్లో మౌలిక వసతులు లేక యూనిట్ల స్థాపన ఆలస్యమవుతోంది. దీంతో పెట్టుబడిదారులపై అదనపు భారం పడటంతో పాటు అనుమతులు ఉన్నా ఉత్పత్తి దశకు చేరేందుకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో ప్రధాన పారిశ్రామిక వాడల్లో ప్లగ్‌ అండ్‌ ప్లే (వాడుకోవడానికి సిద్ధంగా ఉండేలా) సౌకర్యాలను అభివృద్ధి చేయడం ద్వారా పెట్టుబడిదారులు తమ యూనిట్లను యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేసేందుకు మార్గం సుగమమవుతుంది. ఈ నేపథ్యంలో పారిశ్రామిక వాడల్లో మౌలిక వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ఓ ప్రత్యేక పథకాన్ని (ప్లాటెడ్‌ ఫ్యాక్టరీ కాంపెŠల్‌క్స్‌) ప్రకటించింది. ఈ పథకం నిబంధనల మేరకు ఒక్కో పారిశ్రామికవాడకు తన వంతు వాటాగా కేంద్రం రూ.12 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.3 కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది. రాష్ట్రంలో 27 పారిశ్రామికవాడల్లో మౌలిక వసతులు మెరుగు పరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం తన వంతు వాటాగా రూ.81 చెల్లించేందుకు సుముఖత చూపుతోంది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top