
పనులకు సిద్ధమవుతున్న జీహెచ్‌ఎంసీ
అంచనా వ్యయం రూ.2.95 కోట్లు
సాక్షి,హైదరాబాద్ : దీని పేరు లండన్ బ్రిడ్జి. కానీ ఇది ఉన్నది మాత్రం పాతబస్తీ యాకుత్‌పురా నియోజకవర్గంలో. ముర్కి నాలా మీద నిర్మించిన ఈ బ్రిడ్జి.. ఎస్సార్టీ కాలనీ, మదీనా నగర్ ప్రాంతాల మధ్య వారధిగా ఉంది. ఎంతో కాలం క్రితం నిర్మించిన ఈ బ్రిడ్జి దెబ్బతింది. ప్రతి రోజూ వేలాదిమంది రాకపోకలు సాగిస్తారు. ఈ బ్రిడ్జి శిథిలావస్థకు చేరుకోవడంతో ప్రమాదకరంగా మారింది. ఈ బ్రిడ్జి నుంచి రైల్వే బ్రిడ్జి వరకు పక్కనే ఉన్న నాలా రిటైనింగ్ వాల్ సైతం దెబ్బతింది. దీనివల్ల కూడా ప్రమాదాలకు ఆస్కారం ఉంది. ముఖ్యంగా, వర్షాకాలంలో పొంగిపొర్లే వరదనీటితో పరిసర ప్రాంతాల ప్రజలకు ముప్పు వాటిల్లే ప్రమాదం పొంచి ఉంది. ప్రమాదాలు జరగకముందే తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా, బ్రిడ్జిని పునరి్నరి్మంచాల్సిందిగా స్థానిక ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ చేసిన విజ్ఞప్తి మేరకు జీహెచ్‌ఎంసీ మెయింటనెన్స్, ప్రాజెక్ట్స్ విభాగాల చీఫ్ ఇంజినీర్లు క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
బ్రిడ్జిని పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని గుర్తించారు. పునరుద్ధరణ పనులకు దాదాపు రూ. 2.95 కోట్లు ఖర్చు అవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు. డీటైల్ డిజైన్, ఎస్టిమేషన్, ఇన్వెస్టిగేషన్ పనుల కోసం కన్సల్టెంట్ నియామకానికి సిద్ధమయ్యారు. నిర్మాణాన్ని పేరుకు తగ్గట్లుగా చేయాలని ఎమ్మెల్యే సూచించారు. రెండు వైపులా అప్రోచెస్ సహా పనులు చేసేందుకు సిద్ధమయ్యారు. మేజర్ వరద కాలువల అభివృద్ధి పనుల పద్దు కింద జీహెచ్‌ఎంసీ నిధులతో పనులు చేపట్టాలని నిర్ణయించారు. ఆమోదం కోసం స్టాండింగ్ కమిటీ ముందుంచుతున్నారు. వచ్చే మంగళవారం జరగనున్న స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఆమోదం లభించగానే వెంటనే పనులు ప్రారంభించనున్నారు.
మరికొన్ని పనులు
అల్వాల్ సర్కిల్‌లో చిన్నరాయుని చెరువు నుంచి దినకర్‌నగర్ వరకు రూ.2.95 కోట్లతో బాక్స్ డ్రెయిన్ నిర్మాణం, రూ.4.85 కోట్లతో మల్లేపల్లి ఫుట్ బాల్ గ్రౌండ్ ఆధునీకరణ, తదితర పనుల్ని కూడా ఆమోదం కోసం స్టాండింగ్‌కమిటీ ముందుంచుతున్నారు.
కార్పొరేటర్ల కుటుంబాలకు మెడికల్ ఇన్సూరెన్స్‌ను వారి పదవీ కాలమున్న వచ్చే ఫిబ్రవరి వరకు పొడిగిస్తూ కమిషనర్ తీసుకున్న నిర్ణయానికి, వర్షాకాలంలో అవసరమైన చర్యల కోసం జీహెచ్‌ఎంసీ నుంచి హైడ్రాకు వెంటనే రూ.20 కోట్లు విడుదల చేసేందుకు స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలపనుంది.