Hyderabad: మెట్రో.. దారి ఎటో! | Hyderabad Metro News Future of Metro Services Uncertain | Sakshi
Sakshi News home page

Hyderabad: మెట్రో.. దారి ఎటో!

Sep 20 2025 8:42 AM | Updated on Sep 20 2025 8:52 AM

Hyderabad Metro News Future of Metro Services Uncertain

ఎలాంటి కదలిక లేని ప్రాజెక్ట్‌ 

వివిధ అంశాలపై కుదరని సయోధ్య  

మొదటి దశ నుంచి వైదొలగితే నిర్వహణ ఎలా? 

సాక్షి,  హైదరబాద్‌: మెట్రో ప్రాజెక్టు భవిష్యత్‌ ప్రశ్నార్థకంగా మారింది. ఒకవైపు మొదటి దశకు సంబంధించి నష్టాలను భరించలేక నిర్వహణ బాధ్యతల నుంచి వైదొలగనున్నట్లు ఎల్‌అండ్‌టీ ప్రకటించింది. మరోవైపు రెండో దశ విషయంలో కేంద్రం నుంచి  ఇప్పటివరకూ అనుమతి లభించలేదు. పైగా ఇప్ప ట్లో ఆ అవకాశం కూడా లేదు. మొదటి దశ రైలు మార్గాలపై సమన్వయం కుదిరే వరకు ఈ ప్రతిష్టంభన ఇలాగే కొనసాగే అవకాశం ఉంది. దీంతో వచ్చే ఎన్నికల నాటికి కూడా పట్టుమని పది కిలోమీటర్ల లైన్‌లు నిర్మాణమయ్యే దాఖలాలు కనిపించడం లేదు. 

ఒకవైపు మెట్రోను వదులుకొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీ ప్రకటించిన వెంటనే హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ఎండీ ఎనీ్వఎస్‌ రెడ్డిని ఆ బాధ్యతల నుంచి తప్పించి హెచ్‌ఎండీఏ కమిషనర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌కు పూర్తి స్థాయి అదనపు బాధ్యతలను అప్పగించడం చర్చనీయాంశంగా మారింది.  మెట్రో రైల్‌ నిర్మాణదశ నుంచి  ఇటీవల వరకు సుమారు 18 సంవత్సరాల పాటు ఈ రంగంలో అపారమైన అనుభవాన్ని ఆర్జించిన  ఎనీ్వఎస్‌ హైదరాబాద్‌ మెట్రోమ్యాన్‌గా గుర్తింపును పొందారు.ఆ స్థాయిలో అనుభవాన్ని సంపాదించడానికి  ప్రస్తుత ఎండీకి కొంత సమయం పట్టవచ్చు. పైగా ఆయనకు ఈ బాధ్యత అనేక సవాళ్లతో కూడుకొని ఉంది. సకాలంలో ఈ సవాళ్లను అధిగమించి  రెండో దశ ప్రాజెక్టును పట్టాలెక్కించడం అంత సులువు కాకపోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. 

రెండు దశలు ‘లింక్‌’ అయ్యేనా..  
రెండో దశపై కేంద్రం లేవనెత్తిన ప్రశ్నలతోనే తాజా పరిణామాలు చోటుచేసుకున్నాయి. మొదటి దశలోని  69 కి.మీ. అలైన్‌మెంట్‌కు కొనసాగింపుగానే ప్రభుత్వం వివిధ దశల్లో రెండోదశ విస్తరణకు ప్రణాళికలను  రూపొందించింది. ఈ క్రమంలో ప్రైవేట్‌ సంస్థ అయిన ఎల్‌అండ్‌టీ నిర్వహణలో ఉన్న మొదటిదశకు, ప్రభుత్వమే చేపట్టి నిర్వహించనున్న రెండో దశకు సమన్వయం ఎలా ఉంటుందని కేంద్రం ప్రశ్నించింది. ఆదాయ, వ్యయాలు, రైళ్ల నిర్వహణ, విద్యుత్‌ వినియోగం, టికెట్‌ చార్జీల పంపకాలు వంటి అంశాలను ప్రస్తావించింది. ఈ క్రమంలో సమన్వయం సన్నద్ధతను తెలియజేయాల్సిన ఎల్‌అండ్‌టీ అందుకు భిన్నంగా ప్రాజెక్టు నుంచి తప్పుకొనేందుకే సిద్ధంగా ఉన్నట్లు సంచలన ప్రకటన చేసింది.  

తీవ్ర నష్టాల్లో ఉన్నట్లు మొదటి నుంచి ఆ సంస్థ ప్రతినిధులు చెబుతూనే ఉన్నారు. అదే నష్టాలను ప్రధాన సాకుగా చూపుతూ  ప్రాజెక్టును వదిలించుకోనున్నట్లు  పేర్కొంది. దీంతో మొత్తం రెండు దశల మెట్రో భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి. మొదటి దశ నిర్వహణ కోసం  ప్రభుత్వం  ఎల్‌అండ్‌టీతో బేరసారాలు, బుజ్జగింపుల పర్వాన్ని కొనసాగించనుందా? లేక  ప్రత్యేకంగా స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌ (ఎస్పీవీ)ని ఏర్పాటు చేసి రెండో దశల నిర్వహణకు అప్పగిచనుందా? అనేది ప్రశార్థకంగా మారింది. ఒకవేళ అలాంటి ఎస్పీవీకి సానుకూలమైతే తిరిగి ఏదో ఒక ప్రైవేట్‌ సంస్థను ఎంపిక చేయాల్సిందే. కానీ.. మెట్రో నిర్మాణంలో, నిర్వహణలో అపారమైన అనుభవం ఉన్న ఎల్‌అండ్‌టీ స్థాయి సంస్థలు లేవనేది నిరి్వవాదమైన అంశం. ఈ క్రమంలో ఎస్పీవీ ఏర్పాటు కూడా ఏ మాత్రం తేలికైన వ్యవహారం కాదు.

చెల్లింపులు ఎలా..?
నిధుల కొరత మరో సవాల్‌గా నిలిచింది. రెండో దశ కోసం అంతర్జాతీయ సంస్థల నుంచి పెద్ద ఎత్తున రుణాలను సేకరించాలనేది ప్రభుత్వ యోచన. కేంద్రం ఈ ప్రాజెక్టును ఆమోదించి తన వాటా నిధులు ఇచి్చనా, ఇవ్వకపోయినా ప్రాజెక్టును  ముందుకు తీసుకెళ్లాలంటే జైకా వంటి అంతర్జాతీయ సంస్థల నుంచి రుణాలను సేకరించాల్సిందే. రెండో  దశలో ‘ఎ’ విభాగం కింద ప్రతిపాదించిన 76.4 కి.మీ,లకు సుమారు రూ.24,269 కోట్లు వ్యయం కానున్నట్లు అంచనా. ‘బి’ విభాగం కింద  ప్రతిపాదించిన మూడు మార్గాల్లో అంటే సుమారు  85 కి.మీ. మరో 19వేల కోట్లకు పైగా ఖర్చుకానుంది. ఇదే సమయంలో మొదటి దశ మెట్రో నిర్వహణ నుంచి ఎల్‌అండ్‌టీ వైదొలిగితే ఆ సంస్థకు దాదాపు రూ.6500 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.  

ఇటు మొదటి దశ చెల్లింపులకు, అటు  రెండో దశ నిర్మాణానికి నిధుల సేకరణ మరో సవాల్‌గా మారనుంది. ప్రస్తుతం పాతబస్తీలో రోడ్డు విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. ఎంజీబీఎస్‌ నుంచి చాంద్రాయణగుట్ట వరకు  7.5.కి.మీ.మార్గంలో మెట్రో నిర్మాణ పనులను  చేపట్టి ఎన్నికలకు వెళ్లాలని భావించిన అధికార కాంగ్రెస్‌ పార్టీకి ప్రస్తుత పరిణామాలతో మింగుడుపడని పరిస్థితి నెలకొంది. అంతా అనుకున్నట్లు జరిగితే నాగోల్‌ నుంచి ఎయిర్‌పోర్టు వరకు అక్కడి నుంచి ఫ్యూచర్‌సిటీ వరకు రెండోదశలో మొదట మెట్రో నిర్మాణం  చేపట్టి మార్కులు కొట్టేయాలని భావించిన ప్రభుత్వ పెద్దలు ఈ సవాళ్లన్నింటినీ అధిగమించడం ఏ మాత్రం ఆషామాషీ వ్యవహారం కాదని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలోనే మెట్రో భవిష్యత్‌ అగమ్యగోచరంగా మారింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement